Telangana: ఫాస్ట్‌ట్యాగ్ వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇక పంతంగి టోల్‌ప్లాజా దగ్గర దూసుకెళ్లిపోవచ్చు..
సంక్రాంతి సెలవులొచ్చాయంటే చాలు హైదారాబాద్- విజయవాడ జాతీయ రహదారి వాహనాల జాతర నెలకొంటుంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి వాహనాలు పల్లెటూర్లకు బారులు తీరుతుంటాయి. ప్రతి ఏటా వాహన దారులు, ప్రయాణికులు ట్రాఫిక్ లో చిక్కుకొని నరకం చూస్తున్నారు. ముఖ్యంగా టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరుతాయి.

దేశంలోనే అత్యంత వాహనాల రద్దీ కలిగిన హైవేగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారికి పేరు ఉంది. సంక్రాంతి పండుగ వేళ ఈ హైవేపై వాహనాలు సందడి చేస్తుంటాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి పట్నం వాసులు ఈ హైవే మీదుగా పల్లెబాట పడుతుంటారు. దీంతో సంక్రాంతి పండగకు హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరుతాయి. తెలుగు రాష్ట్రాలను కలిపే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై యాదాద్రి జిల్లా పంతంగి టోల్ ప్లాజా చాలా కీలకమైనది. ఈ టోల్ ప్లాజా మీదుగా సాధారణ రోజుల్లో 40 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. గత ఏడాది సంక్రాంతి పండుగ వేళ.. పండుగకు ముందు రోజు 84,000 వాహనాలు వెళ్లాయి.
ఇది చదవండి: ‘నారా లోకేష్, ఆ హీరో, నేను క్లాస్‌మేట్స్.. కాలేజీ రోజుల్లో మేమంతా..’
సంక్రాంతి పండుగకు వాహనాల రద్దీని దృష్టిలో పెట్టుకుని పంతంగి టోల్ ప్లాజా వద్ద సగానికి పైగా విజయవాడ వైపు టోల్ బూతులను ఓపెన్ చేస్తారు. ఫాస్టాగ్ విధానం అమలులోకి వచ్చాక టోల్ ప్లాజాల వాహనదారులకు కొంతమేర ఇబ్బందులు తగ్గుముఖం పడ్డాయి. కొద్ది సేపు కూడా టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఆగకుండా నేరుగా వెళ్లేందుకు NHIA ఏర్పాట్లు చేస్తోంది. పంతంగి టోల్ ప్లాజా వద్ద శాటిలైట్ ద్వారా ఆటోమేటిక్‌గా టోల్ చార్జీలను వసూలు చేసేందుకు NHIA ట్రయల్ రన్ నిర్వహించింది. పంతంగి టోల్ ప్లాజా వద్ద మొత్తం 16 టోల్ బూత్‌లలో విజయవాడ వైపు ఎనిమిదింటిని ఓపెన్ చేసి.. ఒక్కో బూత్‌లో అరగంట పాటు ట్రయల్ రన్ చేశారు. శాటిలైట్ సెన్సార్ ద్వారా వాహనాల నంబర్లను గుర్తించి టోల్ వసూలు చేసిందా.. లేదా అన్న విషయాన్ని NHIA అధికారులు పరిశీలించారు.
సెన్సార్ పరిధిలోకి రాకుండా టోల్ చెల్లించకుండా నేరుగా వాహనాలు వెళ్లాయా అనేది కూడా పరిశీలించారు. శాటిలైట్ ద్వారా టోల్ చార్జీల వసూలుకు సంబంధించి ట్రయల్ రన్‌లో గుర్తించిన లోపాలను హైవే అధికారులు సరి చేస్తున్నారు. వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు హ్యాండ్ గన్ ద్వారా కూడా టోల్ వసూలు చేస్తారు. శాటిలైట్ విధానంలో టోల్ ప్లాజా వద్ద ఫాస్ట్ ట్యాగ్ వాహనాన్ని మూడు సెకండ్లలో స్కాన్ చేస్తుంది. శాటిలైట్ ద్వారా నిమిషానికి 20 వాహనాల టోల్ చార్జీని వసూలు చేసే అవకాశం ఉంది. దీంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పతంగి టోల్ ప్లాజా నుంచి వాహనాలు త్వరగా ముందుకు సాగే అవకాశం ఉందని హైవే అధికారులు చెబుతున్నారు. శాటిలైట్ టోల్ వసూలను కేవలం పంతంగి టోల్ ప్లాజా వద్ద మాత్రమే ఉంటుందని చెబుతున్నారు.
ఇది చదవండి: ఆ సినిమానే చిరంజీవిని ఫ్లాప్‌ల నుంచి గట్టెక్కించింది.. ఓపెన్‌గా చెప్పేసిన టాలీవుడ్ దర్శకుడు
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..




