Boora Narsiah: మునుగోడు ఉపఎన్నిక వేళ టీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. పార్టీకి గుడ్ బై చెప్పిన బూర నర్సయ్య..
అందరూ అనుకున్నట్లే జరిగింది. మునుగోడు ఉపఎన్నికల వేళ అధికార టీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ ఇచ్చారు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి గుడ్ బై చెప్పారు.
ఊహించిందే జరిగింది. ఊగిసలాటకు తెరపడింది. గులాబీ పార్టీకి గట్టి షాక్ తగిలిగింది. సీనియర్ నేత బూర నర్సయ్య గౌడ్.. టీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు భువనగిరి మాజీ ఎంపీ. తన రాజీనామా లేఖను టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పంపించారు. పనిలో పనిగా.. ప్రభుత్వ నిర్ణయాలు, పాలసీలపై విమర్శలు గుప్పించారు. తనకు జరిగిన అవమానాలను రాజీనామా లేఖలో ఏకరువు పెట్టారు. రెండు పేజీల రాజీనామా లేఖలో తనకు ఎంపీగా పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చినందుకు అధినేత కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూనే.. తన పట్ల వ్యవహరించిన తీరుపై విమర్శలు కురిపించారు.
ఎన్నికల్లో ఎంపీగా ఓడినప్పటి నుంచి తాను ఎదుర్కొన్న అవమానాలను హాలాహలంగా భరించానని పేర్కొన్నారు బూర నర్సయ్య గౌడ్. పదవుల కోసం పైరవీలు చేసే వ్యక్తిని తాను కాదని, ప్రజల సమస్యల విన్నవించుకునేందుకు వస్తే కూడా తనకు అవకాశం ఇవ్వలేదన్నారు. బడుగు, బలహీన వర్గాల వారి సమస్యలను ప్రస్తావిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారని రాజీనామా లేఖలో ఆరోపించారు. ఉద్యమకారుడిగా ఇది తనను ఎంతో బాధించిందన్నారు. ప్రజా సమస్యలపై తప్ప, తన స్వార్థం కోసం ఏనాడూ పైరవీలు చేయలేదన్నారు.
నా అవసరం పార్టీకి లేదు..
మునుగోడు ఉపఎన్నిక సమయంలో తన అవసరం పార్టీకి లేదని గుర్తించానని నర్సయ్య తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతకు దారి తీస్తుందని, ఆ విషయం చర్చించాలని భావిస్తే.. కేసీఆర్ తనకు అవకాశమే ఇవ్వలేదని ఆరోపించారు. తనకు మాట్లాడే అవకాశమే లేనప్పుడు పార్టీలో ఉండి చేసేది ఏముందని ప్రశ్నించారు బూర నర్సయ్య. ఉద్యమకారులు కేసీఆర్‌ను కలవాలంటే తెలంగాణ ఉద్యమానికి మించిన ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు. రాష్ట్రం ఏర్పాటయ్యాక తెలంగాణ కంటే.. బయటి ప్రాంత వ్యక్తులే ఎక్కువగా లాభ పడ్డారని ఆరోపించారు. తన జీవితాన్ని తెలంగాణ ఉద్యమానికి అంకితం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం హైదరాబాద్‌లో ప్రభుత్వం తరఫున పెట్టకపోవడం అందరినీ బాధిస్తోన్న అంశం అని పేర్కొన్నారు.
మునుగోడు ఎన్నికల్లో పట్టించుకోలేదు..
తాను ఒక మాజీ ఎంపీ అయినప్పటికీ మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా తనను పట్టించుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు బూర నర్సయ్య. ఒక్కసారి కూడా తనను సంప్రదించలేదన్నారు. నియోజకవర్గంలో జరిగిన సభలకు, సమావేశాలకు తనను కనీసం పిలువలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మునుగోడు టికెట్ తనకు సమస్యే కాదన్న నర్సయ్య.. బీసీ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలని కోరడమే తాను చేసిన నేరమయ్యిందన్నారు. ఇలాంటి సందర్భంలో పార్టీలో కొనసాగడం అనవసరం అని పేర్కొన్నారు మాజీ ఎంపీ. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో బీసీలు ఆర్థిక, రాజకీయ, విద్య రంగాలలో వివక్షకు గురికావడం బాధాకరం అన్నారు.
ఇక ఎలాగైనా మునుగోడులో గెలిచి తీరాలని చూస్తోన్న అధికార టీఆర్‌ఎస్‌కు బూర నర్సయ్య గౌడ్ రూపంలో గట్టి ఎదురుదెబ్బ తగిలిందని చెప్పాలి. ఆయన రాజీనామా మునుగోడు నియోజకవర్గంలో హాట్‌టాపిక్‌గా మారింది. ఇక కారు దిగుతున్న బూర నర్సయ్య.. కమలం కండువా కప్పుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ అగ్రనేతలతో భేటీ అయిన బూర.. పార్టీలో చేరికపై మంతనాలు జరిపారు. ఈ క్రమంలోనే ఆయన టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. త్వరలోనే బీజేపీ కండువా కప్పుకోనున్నారు.
2013లో టీఆర్‌ఎస్‌లో చేరిన బూర నర్సయ్యగౌడ్ 2014 లోక్‌సభ ఎన్నికల్లో భువనగిరి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. 2019లో పోటీ చేసిన ఆయన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ తరఫున ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. కానీ అధిష్ఠానం కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడంతో అప్పటి నుంచి అసంతృప్తితో ఉన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..