Telangana: మరో వివాదంలో గవర్నర్ తమిళిసై.. ఓ పొలిటికల్ మీటింగ్‌లో పాల్గొన్నట్టు ఆరోపణలు
తెలంగాణ గవర్నర్ గా తమిళిసై సౌందర్ రాజన్ బాధ్యతలు చేపట్టి మూడేళ్లు దాటింది. తొలుత ప్రభుత్వంతో ఆమె సఖ్యతగా ఉన్నా.. రాను రాను సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే.
తెలంగాణ గవర్నర్ తమిళిసైని మరో వివాదం చుట్టుముడుతోంది. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న గవర్నర్.. ఓ పొలిటికల్ మీటింగ్‌లో పాల్గొన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఆమె రాజకీయ వేదిక పంచుకున్నారంటూ పలు రాజకీయ పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. పోల్ స్ట్రేటజీ 2024 ఫర్ సౌత్ స్టేట్స్ పేరుతో ట్విట్టర్ స్పేసెస్‌లో బీజేపీ ఓ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో గవర్నర్ తమిళిసై పాల్గొన్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో ఇటు నెటిజన్లు అటు రాజకీయ నేతలు ఈ అంశంపై స్పందిస్తున్నారు. పార్టీలకతీతంగా వ్యవహరించాల్సిన గవర్నర్.. బీజేపీ ఎన్నికల వ్యూహ చర్చలో పాల్గొని.. బీజేపీ ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా రాష్ట్రాల్లో గవర్నర్లను మార్చారు. కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వం, గవర్నర్ మధ్య కొంత గ్యాప్ నడుస్తోంది. పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, తమిళనాడు లాంటి పలు రాష్ట్రాల్లో గవర్నర్ల జోక్యంపై ఆయా రాష్ట్రాల సీఎంలు అసంతృప్తితో ఉన్నారు. తెలంగాణలోనూ అలాంటి పరిస్థితులే ఉన్నాయి.
గవర్నర్ తమిళిసై.. బీజేపీ ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారంటూ ఇప్పటికే టీఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య సంబంధాలు ఉప్పు, నిప్పులా ఉన్నాయి. ఈ క్రమంలో ఆమె ఓ పొలిటికల్ యాక్టివిటీలో భాగం కావడం వివాదాలకు తావిస్తోంది. ఈ వివాదం ఎన్ని టర్న్‌లు తీసుకుంటుందో చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..