Etela Rajender: టీఆర్‌ఎస్‌కు ఈటల గుడ్‌బై.. నేడు మీడియా సమావేశం.. 8న బీజేపీలో చేరే అవకాశం..!
Etela Rajender: అసైన్డ్ భూముల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈటెల రాజేందర్ మంత్రి వర్గం నుంచి బర్తరఫ్‌కు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈటెల..
Etela Rajender: అసైన్డ్ భూముల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈటెల రాజేందర్ మంత్రి వర్గం నుంచి బర్తరఫ్‌కు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈటెల టీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పేందుకు నిర్ణయించుకున్నారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎమ్మెల్యే పదవీకి రాజీనామ చేయనున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు షామీర్‌పేటలోని తన నివాసంలో నిర్వహించే మీడియా సమావేశంలో తన నిర్ణయాన్ని ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. బీజేపీలో చేరాలని ఇప్పటికే నిర్ణయించుకున్న ఈటెల రాజేందర్.. ఈ మీడియా సమావేశంలో చేరిక విషయమై ముహూర్తాన్ని కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఈనెల 8వ తేదీన బీజేపీలో చేరే అవకాశం కనిపిస్తోంది. అయితే ఉద్యమం నుంచి టీఆర్‌ఎస్ పార్టీలో తన పాత్రను వివరించడంతో పాటు తనకు ఎదురైన ఇబ్బందులను మీడియా ముందు చెప్పనున్నట్లు తెలుస్తోంది. మూడు రోజుల ఢిల్లీ పర్యటన పూర్తి చేసుకొని గురువారం హైదరాబాద్ చేరుకున్న ఈటల రాజేందర్.. హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన తన అనుచరులతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు.
అనుచరులతో భేటీ అయిన ఈటల రాజేందర్ ఢిల్లీ పర్యటన వివరాలను వెల్లడించారు. టీఆర్‌ఎస్, ఎమ్మెల్యే పదవికి రాజీనామ చేయడంపై అనుచరుల నుంచి అభిప్రాయాలు కోరారు. అయితే పార్టీ వీడటంపై అనుచరుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం కాగా, ‘వారు పొమ్మనే వరకు ఉండటం సరైనదేనా’ అని ఈటల అనుచరులను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కొత్త పార్టీ ఏర్పాటు ప్రతిపాదన ఆలోచనేదీ లేదని, బీజేపీలో చేరడం గురించే అభిప్రాయాలు కోరినట్లు ఈటల వ్యాఖ్యానించినట్లు తెలిసింది. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామాకు సంబంధించి శుక్రవారం జరిగే మీడియా సమావేశంలోనే అన్ని వివరాలు వెల్లడిస్తానని అనుచరులతో తెలిపినట్లు తెలుస్తోంది. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. మీ వెంటే ఉంటామని అనుచరులు హామీ ఇచ్చినట్లు సమాచారం.