AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bihar Politics: బీహార్ లో లాలూ మార్క్ మ్యాజిక్ మళ్ళీ పనిచేస్తుందా? ప్రత్యర్ధులు ఎందుకు కంగారు పడుతున్నారు?

Bihar Politics: లాలూ ప్రసాద్ యాదవ్.. భారత రాజకీయాల్లో పరిచయం అవసరం లేని పేరు. బీహార్ రాజకీయాల్లో ఒక ప్రత్యెక ఒరవడి సృష్టించిన పేరు. ఈ ఆర్జేడీ అధినేత ఇప్పుడు బెయిల్ పై బయటకు వచ్చారు.

Bihar Politics: బీహార్ లో లాలూ మార్క్ మ్యాజిక్ మళ్ళీ పనిచేస్తుందా? ప్రత్యర్ధులు ఎందుకు కంగారు పడుతున్నారు?
Bihar Politics
KVD Varma
|

Updated on: Jun 03, 2021 | 9:04 PM

Share

Bihar Politics: లాలూ ప్రసాద్ యాదవ్.. భారత రాజకీయాల్లో పరిచయం అవసరం లేని పేరు. బీహార్ రాజకీయాల్లో ఒక ప్రత్యెక ఒరవడి సృష్టించిన పేరు. ఈ ఆర్జేడీ అధినేత ఇప్పుడు బెయిల్ పై బయటకు వచ్చారు. ఈయన ఎప్పుడైనా పాట్నాలో అడుగు పెట్టె అవకాశం ఉంది. పాట్నాలో ఆయన అడుగుపెట్టడం అంటే.. బీహార్ రాజకీయాల్లో మళ్ళీ తన మార్కు చూపించెందుకే అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. లాలూ రాజకీయ వ్యూహాలు ప్రత్యర్ధులకు అంత తేలికగా అర్ధం కావు. ఆయన వెనుకబడిన కులాల ఎమ్మెల్యేలను సమీకరించే సామర్ధ్యం ఎప్పుడూ ప్రత్యర్ధి వర్గాలకు కోరకరానివిగానే ఉండిపోయాయి. ఇప్పుడు లాలూ ఇక్కడ ఏం చేయబోతున్నారు అనేది అందరికీ ఆసక్తికరంగా మారింది. మరోవైపు జేడీయూ, బీజేపీ లాలూ ప్రసాద్ వ్యూహాలపై ఇప్పటికే ఓ కన్నువేసి ఉంచాయని పరిశీలకులు భావిస్తున్నారు.

లాలూ వ్యూహాలు ఎలా ఉంటాయో చెప్పడానికి నాలుగు ఉదాహరణలు చాలు.. అవేమిటో ఒకసారి పరిశీలిస్తే.. లాలూ ఎంత వ్యూహకారో తెలిసిపోతుంది.

అద్వానీ రధానికి బ్రేక్!

అది 1990 సంవత్సరం. అప్పుడు రామ్ మందిర్ సమస్యపై దేశవ్యాప్తంగా బీజేపీ దూకుడుగా ఉంది. బీజేపీ నాయకుడు ఎల్కే అద్వానీ ప్రజల మద్దతు సంపాదించడానికి రథయాత్రకు బయలుదేరారు. లాలూ యాదవ్ ఆ సమయంలో బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అద్వానీని ఆపడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం సాహసించలేదు. కానీ, లాలూ యాదవ్ బీహార్ సరిహద్దుకు వచ్చిన వెంటనే అద్వానీ రథాన్ని ఆపారు. ఇది ఆ కాలపు మొత్తం రాజకీయాలను మార్చివేసిందని చెప్పవచ్చు.

వాజ్‌పేయి మళ్లీ ప్రధాని అవ్వకుండా బ్రేక్!

లాలూ ప్రసాద్ 1990 లో బీహార్ ముఖ్యమంత్రి అయ్యారు. అక్కడ నుంచి పదేళ్ళు అంటే 2000 వరకూ ఆయన రాజకీయాల్లో ముఖ్యంగా దేశ రాజకీయాల్లో చక్రం తిప్పారు. ఆయన ఐకే గుజ్రాల్, దేవేగౌడలను ప్రధానిగా చేశారని చెబుతారు. అదేవిధంగా రెండోసారి ప్రధాని కావాలనుకున్న వాజ్‌పేయిని అడ్డుకున్నారు లాలూ. బీజేపీ ఎంత ప్రయత్నించినా రాజకీయంగా లాలూను అడ్డుకోలేకపోయింది.

కాంగ్రెస్‌తో దోస్తీ.. బీజేపీకి అడ్డుకట్ట..

1999 తరువాత, కేంద్రంలో కాంగ్రెస్ బలహీనపడింది. సోనియా గాంధీ పేరిట పార్టీలో నిరసన కూడా జరిగింది. అప్పుడు లాలూ సోనియా గాంధీకి మద్దతు ఇచ్చారు. 2004 లోక్ సభ ఎన్నికలలో, కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని బీహార్లో దాదాపు మూడింట రెండు వంతుల స్థానాలను గెలుచుకున్నారు. దీని ప్రభావంతో, అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం మళ్లీ ఢిల్లీ పీఠం ఎక్కలేకపోయింది. దీని తరువాత లాలూ యాదవ్ రైల్వే మంత్రి అయ్యారు.

నితీష్ తో పొత్తు.. బీజేపీ చిత్తు..

2014 లోక్‌సభ ఎన్నికల్లో బీహార్‌లో నితీష్ కుమార్ ఒంటరిగా పోరాడారు. కానీ విజయవంతం కాలేకపోయారు. దీని తరువాత ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి జితాన్ రామ్ మంజీని సిఎం సింహాసనంపై ఉంచారు. కొన్ని రోజుల తరువాత, మంజీకి నితీష్ మీద కోపం వచ్చింది. ఆ సమయంలో బీజేపీ వెనుక వైపు నుండి మంజీకి మద్దతు ఇవ్వడం ప్రారంభించింది. అప్పుడు నితీష్ తన తప్పును గ్రహించాడు. సరిగ్గా ఈ పరిస్థితులను లాలూ తనకు అనుకూలంగా మార్చుకున్నారు. దీంతో 2015 అసెంబ్లీ ఎన్నికల్లో లాలూ నితీష్ కుమార్‌తో చేతులు కలిపి బీహార్‌లో బీజేపీకి అవకాశం రాకుండా చేశారు.

ఈ నాలుగు సందర్భాల్లోనూ లాలూ ప్రసాద్ యాదవ్ రాజకీయ చతురత కనిపిస్తుంది. ఆయన రాజకీయ ఎత్తుగడల్లో దూకుడు కనిపిస్తుంది. రాజకీయాల్లో లాలూ ప్రసాద్ గేమ్ ఛేంజర్ కావడానికి అతి పెద్ద కారణం ఏమిటంటే, ఆయన యాదవ్స్ కులంలో అత్యంత గుర్తింపు పొందిన నాయకుడు. లాలూ ప్రసాద్ ఎవరికి టికెట్ ఇస్తారో వారికి యాదవ్ లంతా ఓటు వేస్తారు. లోక్‌సభ ఎన్నికల్లో పట్లిపుత్ర సీటు నుంచి రామ్ కృపాల్ యాదవ్ విజయం సాధించడం, అదే విస్ ఎన్నికల్లో రెండు స్థానాల్లో రాబ్రీ దేవిని ఓడించడం దీనికి మినహాయింపు. ఈ జనాభా ఓట్ బ్యాంక్ 16 శాతం. అదే సమయంలో, ఆతను ముస్లింల 16% ఓటు బ్యాంకును కూడా తన చేతిలో ఉంచుకోగలిగారు.

2020 అసెంబ్లీ ఎన్నికల్లో 19 మంది ముస్లిం ఎమ్మెల్యేలు గెలిచారు, అందులో 8 మంది లాలూ ప్రసాద్ పార్టీ రాష్ట్ర జనతాదళ్ నుంచి గెలిచారు. ఏఐఎంఐఎం నుండి 4 గురు మాత్రమే గెలిచారు. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటప్పుడు ఏఐఎంఐఎం ఎమ్మెల్యేలు ఆర్జేడీతో కలవడానికే ఎక్కువ మొగ్గు చూపడం.

మరోవైపు, నితీష్ కుమార్ పార్టీకి చెందిన ఒక్క ముస్లిం ఎమ్మెల్యే కూడా లేరు. బీఎస్పీకి చెందిన జామా ఖాన్‌ను పార్టీలో చేర్చుకుని ఆయనను మంత్రిగా చేశారు. రాజకీయాల్లో సమతుల్యతను చూపించడానికి బీజేపీకి చెందిన షహనావాజ్ హుస్సేన్ ను ఎంఎల్‌సిని చేసి మంత్రిగా చేసింది. చాలా వివాదాలు ఉన్న సబీర్ అలీని పార్టీలో చేర్చుకుని బీజేపీ మైనారిటీ సెల్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది.

మొత్తమ్మీద లాలూ మళ్ళీ బీహార్ రాజకీయాల్లో యాక్టివ్ పాత్ర పోషించనున్నారు అనే వార్త ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిపోయింది. ప్రస్తుత పరిస్థితిలో లాలూ తన రాజకీయ వ్యూహాలకు ఏమాత్రం పదును పెడతారో.. వాటిని ఎలా అమలు చేస్తారో అనే ఆలోచన ఇప్పటికే అక్కడి రాజకీయ నాయకుల్లో మొదలైందని పరిశీలకులు చెబుతున్నారు. ఏది ఏమైనా బీహార్ రాజకీయాల్లో మళ్ళీ లాలూ మార్క్ గట్టిగా కనిపించే అవకాశం మాత్రం స్పష్టంగా ఉంది.

Also Read: ‘అదంతా బూటకం..’..డిసెంబర్ 31 నాటికి దేశ జనాభా అంతటికీ వ్యాక్సిన్ ఇస్తారా ..? కేంద్రంపై మమతా బెనర్జీ ఫైర్

PM Modi: కేబినెట్ సమావేశాల్లో ‘జీరో అవర్’.. ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త సలహా.. ఎందుకో తెలుసా?