‘అదంతా బూటకం..’..డిసెంబర్ 31 నాటికి దేశ జనాభా అంతటికీ వ్యాక్సిన్ ఇస్తారా ..? కేంద్రంపై మమతా బెనర్జీ ఫైర్
ఈ ఏడాది అంతానికల్లా దేశ జనాభాకంతటికీ వ్యాక్సిన్ ఇస్తామన్న కేంద్ర ప్రకటనను బెంగాల్ సీఎం మమతా బెనర్జీ 'వట్టి బూటకమని' కొట్టి పారేశారు.
ఈ ఏడాది అంతానికల్లా దేశ జనాభాకంతటికీ వ్యాక్సిన్ ఇస్తామన్న కేంద్ర ప్రకటనను బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ‘వట్టి బూటకమని’ కొట్టి పారేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరాధారమైన, పస లేని స్టేట్ మెంట్స్ ఇస్తోందని ఆరోపించారు. బుధవారం వర్చ్యువల్ గా మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె.. రాష్ట్రాలకు వ్యాక్సిన్ పంపిణీలో కేంద్రం విఫలమైందన్నారు. ఫార్మా కంపెనీల నుంచి టీకామందులను సేకరించి అన్ని రాష్ట్రాలకు ఉచితంగా పంపిణీ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అసలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు వ్యాక్సిన్ పంపడమే మానుకుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం జాప్యం చేయకుండా ఈ విషయంలో చొరవ తీసుకోవాలని, వ్యాక్సిన్ కొరతను తీర్చాలని మమత కోరారు. డిసెంబరు 31 నాటికి దేశ జనాభా అంతటికీ వ్యాక్సిన్ ఇస్తామన్న కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన ఆమె.. దీన్ని ఇలా కొట్టి పారేశారు. కాగా ప్రభుత్వం ఇందుకు యాక్షన్ ప్లాన్ రూపొందించిందని, వివిధ ఫార్మా సంస్థలతో చర్చలు జరుపుతోందని కిషన్ రెడ్డి ఇటీవల వెల్లడించేజారు. 250 కోట్ల డోసుల వ్యాక్సిన్ మనకు అందుబాటులో ఉంటుందన్నారు. నిన్న హైదరాబాద్ కు రష్యా నుంచి స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ వచ్చిందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రానున్న ఏడెనిమిది నెలలు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు.
అటు కేంద్రం సుప్రీంకోర్టులో కూడా ఇదే హామీనిచ్చింది. డిసెంబరు 31 నాటికి దేశంలో ప్రతి వ్యక్తికీ టీకామందులు ఇవ్వడం జరుగుతుందని పేర్కొంది. జులై రెండో వారం లేదా ఆగస్టు మొదటి వారానికి రోజుకు కోటిమందికి వ్యాక్సిన్ ఇస్తామని ఇదివరకే కోవిద్-19 పై గల వర్కింగ్ గ్రూప్ చైర్మన్ అరోరా వెల్లడించారు.
మరిన్ని ఇక్కడ చూడండి: International Flights: విజయవాడకు విదేశీ సర్వీసులు పునః ప్రారంభం.. దుబాయ్ నుంచి ప్రవాసాంధ్రులతో చేరుకున్న ప్రత్యేక విమానం