AP CM YS Jagan: కేంద్రం వ్యాక్సిన్ల సరఫరాపై రాష్ట్రాల అసంతృప్తి.. కలిసి రావాలని అన్ని రాష్ట్రాల సీఎంలకు ఏపీ సీఎం జగన్ లేఖ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. కరోనా వ్యాక్సిన్ల సరఫరాకు కేంద్రంపై ఒత్తిడి తేవాలంటూ ముఖ్యమంత్రులను కోరారు.
AP CM YS Jagan Letter to all State CMs: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. కరోనా వ్యాక్సిన్ల సరఫరాకు కేంద్రంపై ఒత్తిడి తేవాలంటూ ముఖ్యమంత్రులను కోరారు.. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి అల్లకల్లోలం సృష్టిస్తోంది. వైరస్ కట్టడికి వ్యాక్సిన్ ఒక్కటే ఉత్తమ మార్గమన్న నిపుణుల సూచనల మేరకు కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టింది. తొలుత ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు టీకా వేయగా, అనంతరం విడతల వారీగా వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టింది కేంద్రం. కరోనా వ్యాక్సిన్ల సరఫరా అంశంలో కేంద్రం అనుసరిస్తున్న తీరు పలు రాష్ట్రాలను అసంతృప్తికి గురిచేస్తోంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు బాహాటంగానే తమ గళం వినిపించారు.
తాజాగా, ఏపీ సీఎం జగన్ కరోనా వ్యాక్సిన్ల అంశంపై దేశంలోని అందరు సీఎంలకు లేఖ రాశారు. కరోనా వ్యాక్సిన్ల సరఫరాపై ఒకే గొంతుక వినిపించాలని సీఎం జగన్ ఇతర ముఖ్యమంత్రులను కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియకు అనుగుణంగా టీకా సరఫరా లేదని ఆయన రాసిన లేఖలో పేర్కొన్నారు. అయితే, రాష్ట్రాలే స్వంతంగా వ్యాక్సిన్లను సమకుర్చుకునేందుకు.. గ్లోబల్ టెండర్లు పిలిచినా ఒక్కరూ బిడ్ వేయలేదని వెల్లడించారు. గ్లోబల్ టెండర్ల ఆమోదం కేంద్రం చేతుల్లో ఉందని లేఖలో పేర్కొన్నారు.
వైరస్ మహమ్మారి తగ్గడం లేదు. సెకండ్ వేవ్ కొనసాగుతుండగానే.. మూడో వేవ్ కూడా ఉంటుందని చెప్తున్నారు. ఆ మహమ్మారి బారి నుంచి తప్పించుకోవడానికి ప్రస్తుతం ఉన్న ఒకే ఒక మార్గం వ్యాక్సినేషన్. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలన్నీ రెండు డోస్‌లు వేసుకోవాల్సిందే. అయితే.. వ్యాక్సిన్ల లభ్యత ప్రధాన సమస్యగా మారింది. రాష్ట్రాలు గ్లోబల్ టెండర్లకు వెళ్తున్నా.. నిబంధనలు అడ్డుగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. అన్ని రాష్ట్రాల సీఎంలకు ఏపీ సీఎం జగన్ లేఖలు రాశారు.
అయితే, పరిస్థితులు చూస్తుంటే వ్యాక్సిన్ లభ్యతపై కేంద్రం, రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తేలా అవకాశముందని ముఖ్యమంత్రి జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ సరఫరాలో రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాల్సిన అవసరం ఉందని సీఎం జగన్ పిలుపునిచ్చారు. వ్యాక్సిన్ సేకరణ కోసం కలిసికట్టుగా ప్రయత్నించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇకపై రాష్ట్రాలే సొంతంగా వ్యాక్సిన్ డోసులు సమకూర్చుకోవాలన్నది కేంద్రం వైఖరిగా తెలుస్తోందని, కానీ, డిమాండ్ కు తగిన విధంగా వ్యాక్సిన్ల లభ్యత లేదని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు.
Read Also… Sharmila YSRTP: కొత్త పార్టీ పేరు ఖరారు.. గుర్తింపు ఇచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం.. జులైలో ప్రకటన!