Sharmila YSRTP: కొత్త పార్టీ పేరు ఖరారు.. గుర్తింపు ఇచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం.. జులైలో ప్రకటన!
తెలంగాణలో మరో కొత్త పార్టీ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల రంగంలోకి దిగబోతున్నారు.
Sharmila New Political Party as YSRTP: అన్నట్లుగానే తెలంగాణలో మరో కొత్త పార్టీ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల రంగంలోకి దిగబోతున్నారు. వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో వాడుకా రాజగోపాల్ కొత్త పార్టీ కోసం ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేశారు. ఈ పేరుపై ఎవరికైనా అభ్యంతరాలుంటే తెలపాలని ఓ జాతీయ పత్రికలో ప్రకటన ఇచ్చారు. పార్టీ తరపున ఈసీకి వచ్చిన అప్లికేషన్ పరిశీలించిన తర్వాత ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోనుంది.
పార్టీ పేరును వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీగా నిర్ణయించారు. ఈ పేరుపై ఎన్నికల సంఘం రిజిస్టర్ చేసింది. తెలంగాణలో వైఎస్ షర్మిల పెట్టబోయే పార్టీకి ఎన్నికల సంఘం ఈ గుర్తింపునిచ్చింది. పార్టీ పేరును వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైఎస్సార్ టీపీ)గా కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. వైఎస్సార్‌టీపీకి షర్మిల ప్రధాన అనుచరుడు వాడుకా రాజగోపాల్ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు.
షర్మిల గతంలో ప్రకటించిన ప్రణాళికను అమలు చేసేలా అడుగులు వేస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా.. కొన్ని ఆటంకాలు వచ్చినా.. పరిస్థితులు చక్కబడిన తర్వాత ప్రజల్లోకి వెళ్లేందుకు వ్యూహం సిద్ధం చేసుకుంటున్నారు. పార్టీ ఏర్పాటు ను ప్రకటించి పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్దమవుతున్నారు.
ఇప్పటికే వైఎస్ షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ పెడుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఆమె పార్టీ పేరును, జెండాను, సిద్ధాంతాన్ని ప్రకటించేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నారు. అయితే, ఆమె పెట్టబోయే పార్టీ పేరు ఏంటనే చర్చ ఆసక్తికరంగా మారింది. తాజాగా వైఎస్ షర్మిల పెట్టబోయే పార్టీ పేరు బయటికి వచ్చింది. ఎన్నికల సంఘం వద్ద షర్మిల పార్టీ పేరును నమోదు చేయించారు.
ఇప్పటికే షర్మిల తెలంగాణ వర్తమాన వ్యవహారాలపై చురుగ్గా స్పందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కరోనా కావడంతో వివిధ వర్గాల వారితో వర్చువల్‌గా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందుకు ఇందిరా శోభన్ కోర్టినేట్ చేస్తున్నారు. బుధవారమే షర్మిల మెదక్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఉద్యోగం రాలేదన్న కారణం చేత ఆత్మహత్య చేసుకున్న బాధితుడి కుటంబాన్ని పరామర్శించారు. అనంతరం ధాన్యం కొనుగోలు కోసం రైతులతో చర్చించారు.