AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

El Nino: ఎల్‌నినో ఎఫెక్ట్‌తో పశువులకు హీట్‌స్ట్రెస్.. పాల దిగుబడికి దెబ్బ!

ఎల్‌నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరిగితే పశుసంపదపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని పశువైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక వేడి కారణంగా పశువుల్లో హీట్‌స్ట్రెస్, వ్యాధుల ముప్పు పెరగడంతో పాటు పాల దిగుబడి 10 నుంచి 30 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. వర్షపాతం తగ్గితే పశుగ్రాసం కొరత, దాణా ధరల పెరుగుదలతో పాడి రైతులపై అదనపు భారం పడే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ముందుగానే పశుగ్రాసం నిల్వ, నీటి వసతి, పశువుల కొట్టాల్లో గాలి ప్రసరణ వంటి చర్యలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

El Nino: ఎల్‌నినో ఎఫెక్ట్‌తో పశువులకు హీట్‌స్ట్రెస్.. పాల దిగుబడికి దెబ్బ!
Livestock
P Shivteja
| Edited By: |

Updated on: Oct 03, 2026 | 1:53 PM

Share

వాతావరణ మార్పులు వ్యవసాయానికే కాదు.. పశుసంపదకు కూడా సవాల్‌గా మారుతున్నాయి. సాధారణం కంటే తక్కువ వర్షపాతం, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు పశువుల ఆరోగ్యం, దాణా లభ్యత, పాల ఉత్పత్తిపై ప్రభావం చూపే అవకాశం ఉందని పశువైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఎల్‌నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు మరింత పెరిగితే పరిస్థితి తీవ్రతరమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.

పెరుగుతున్న వేడి.. పశువులపై తీవ్ర ప్రభావం

అధిక ఉష్ణోగ్రతల కారణంగా పశువుల్లో వేడి ఒత్తిడి (హీట్ స్ట్రెస్) పెరుగుతుంది. వేడిని తట్టుకునే క్రమంలో ఒత్తిడి హార్మోన్ల స్థాయి పెరగడంతో రోగనిరోధక శక్తి తగ్గే ప్రమాదం ఉంటుంది. దీంతో గొంతువాపు, జబ్బవాపు వంటి వ్యాధులు సోకే అవకాశం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎండ తీవ్రత పెరిగినప్పుడు పశువులు సాధారణ స్థాయిలో దాణా తీసుకోలేవు. జీర్ణక్రియ మందగించడం, నీటి వినియోగం పెరగడం వంటి మార్పులు చోటుచేసుకుంటాయి. వీటి ప్రభావం నేరుగా పాల ఉత్పత్తిపై పడుతుంది.

పాల దిగుబడిపై వేడి ప్రభావం

వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారితే పాలిచ్చే ఆవుల్లో పాల దిగుబడి గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా కొన్ని పరిస్థితుల్లో పాల ఉత్పత్తి 10 నుంచి 30 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పాల సేకరణ గణాంకాల్లో తగ్గుదల కనిపిస్తోంది. విజయ డెయిరీ గణాంకాల ప్రకారం 2024–25లో రోజువారీ సగటు పాల సేకరణ సుమారు 4 లక్షల లీటర్లుగా ఉండగా.. 2025–26లో అది 3.36 లక్షల లీటర్లకు తగ్గింది. అంటే ఏడాది వ్యవధిలో రోజువారీ సగటు పాల సేకరణ సుమారు 64 వేల లీటర్లు తగ్గింది. పాల దిగుబడి తగ్గడం డెయిరీలపైనే కాకుండా పాడి రైతుల ఆదాయంపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది.

పశుగ్రాసం కొరతతో రైతులకు అదనపు భారం

వర్షపాతం తగ్గితే పశుగ్రాసం కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. దాణా, పశుగ్రాసం ధరలు పెరిగితే పశువుల పోషణ రైతులకు అదనపు ఆర్థిక భారంగా మారుతుంది. మరోవైపు పోషకాహారం సరిగా అందకపోతే పశువుల ఆరోగ్యం, పాల ఉత్పత్తి మరింత దెబ్బతినే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వేసవి తీవ్రత ప్రారంభమయ్యే ముందే అవసరమైన పశుగ్రాసాన్ని నిల్వ చేసుకోవడం, నీటి వనరులను సిద్ధం చేసుకోవడం కీలకమని పశువైద్య నిపుణులు సూచిస్తున్నారు.

పశుసంరక్షణలో జాగ్రత్తలు తప్పనిసరి

వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పశువుల కొట్టాల్లో తగినంత గాలి ప్రసరణ ఉండేలా చూడాలని నిపుణులు సూచిస్తున్నారు. పశువులకు ఎప్పటికప్పుడు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో ఉంచడంతో పాటు.. వేడి ఒత్తిడిని తగ్గించేందుకు అవసరమైన ఎలక్ట్రోలైట్లను పశువైద్యుల సూచన మేరకు వినియోగించాలని చెబుతున్నారు. దాణా విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ అవసరం. జీర్ణక్రియ సక్రమంగా ఉండేందుకు పశువైద్యుల సూచన మేరకు ప్రోబయోటిక్స్ వినియోగించడం, పాకల్లో అధిక రద్దీ లేకుండా చూడటం వంటి చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

డెయిరీల ఆదాయంపైనా ఒత్తిడి

మరోవైపు పాల సేకరణ తగ్గుతున్న నేపథ్యంలో డెయిరీల ఆదాయంపైనా ఒత్తిడి పెరుగుతోంది. ఆదాయ మార్గాలను విస్తరించేందుకు విజయ డెయిరీకి చెందిన స్థలాల్లో పెట్రోల్ బంకులు, షాపింగ్ కాంప్లెక్సులు వంటి వాణిజ్య కార్యకలాపాల ద్వారా అదనపు ఆదాయ వనరులను సమకూర్చుకునే దిశగా దృష్టి సారిస్తున్నట్లు సమాచారం.

ముందస్తు ప్రణాళికే కీలకం

మొత్తంగా.. ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితులు మరింత ప్రతికూలంగా మారితే వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమపైనా ప్రభావం పడే అవకాశం ఉంది. పశుగ్రాసం కొరత, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వ్యాధుల ముప్పు, తగ్గే పాల దిగుబడి.. ఇవన్నీ కలిసి పాడి రైతులకు సవాలుగా మారకుండా ముందుగానే పశుసంరక్షణ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది.

Follow Us