బ్యాంక్ ఖాతాను వాడకుంటే..మీ డబ్బు ఏమవుతుంది? RBI నిబంధనలు తెలుసుకోండి..
ఏదైనా కారణం చేత కొన్ని బ్యాంకు ఖాతాలను మీరు చాలాకాలంగా ఉపయోగించడం లేదా? అలాంటి ఖాతాల విషయంలో ఆర్‌బీఐ కొన్ని కీలక నిబంధనలను అమలు చేస్తోంది. ఖాతా ఎప్పుడు ఇన్‌ఆపరేటివ్‌గా మారుతుంది? ఖాతా ఇన్‌ఆపరేటివ్ అయితే అందులోని డబ్బుకు ఏమవుతుంది? తిరిగి యాక్టివేట్ చేసుకోవడానికి, క్లెయిమ్ చేయని నగదును పొందడం సాధ్యమేనా? పూర్తి వివరాలు తెలుసుకోండి.

ఏదైనా బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ తెరిచారా? ఉద్యోగ రీత్యా కంపెనీ మారడం, మరో బ్యాంకులో ఖాతా ప్రారంభించడం లేదా ఇతర కారణాలతో పాత ఖాతాను ఉపయోగించడం మానేశారా? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోవాలి. రెండేళ్లకు పైగా లావాదేవీలు జరగని సేవింగ్స్ లేదా కరెంట్ ఖాతాను బ్యాంకులు ఇన్‌ఆపరేటివ్ ఖాతాగా పరిగణిస్తాయి. అయితే, అలా మారినంత మాత్రాన ఖాతాలోని డబ్బు పోయినట్లు కాదు. ఖాతాను తిరిగి యాక్టివేట్ చేసుకోవడానికి, పదేళ్లుగా క్లెయిమ్ చేయని డిపాజిట్లను తిరిగి పొందడానికి కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిబంధనలు ఉన్నాయి.
ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం, సేవింగ్స్ లేదా కరెంట్ ఖాతాలో రెండేళ్లకు మించి కస్టమర్ లావాదేవీలు జరగకపోతే దాన్ని ఇన్‌ఆపరేటివ్ ఖాతాగా పరిగణిస్తారు. కస్టమర్ స్వయంగా చేసిన లావాదేవీలతో పాటు, ఆయన తరఫున మూడో వ్యక్తి చేసిన లావాదేవీలు కూడా ఇందులోకి వస్తాయి. అయితే, బ్యాంకు జమ చేసే వడ్డీ లేదా బ్యాంకు విధించే సర్వీస్ ఛార్జీలను సాధారణంగా కస్టమర్ జరిపిన లావాదేవీలుగా పరిగణించరు. కాబట్టి ఖాతాలో వడ్డీ జమ అవుతోందని మాత్రమే ఖాతా యాక్టివ్‌గా ఉంటుందని భావించకూడదు.
ఖాతాను తిరిగి యాక్టివేట్ చేసుకోవడం ఎలా?
మీ పాత బ్యాంకు ఖాతాను తిరిగి ఉపయోగించుకోవాలనుకుంటే సంబంధిత బ్యాంకును సంప్రదించాలి. అవసరమైన KYC (Know Your Customer) వివరాలను అప్‌డేట్ చేసి, ఖాతాను యాక్టివేట్ చేయాలని దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్‌బీఐ సూచనల ప్రకారం, ఇన్‌ఆపరేటివ్ ఖాతాల యాక్టివేషన్ కోసం KYC అప్‌డేట్ సదుపాయాన్ని బ్యాంకులు హోమ్ బ్రాంచ్‌తో పాటు ఇతర బ్రాంచ్‌లలోనూ అందుబాటులో ఉంచాలి. సదుపాయం ఉన్నచోట వీడియో కస్టమర్ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ (V-CIP) ద్వారా కూడా KYC అప్‌డేట్ చేసుకునే అవకాశం ఉంటుంది.
అవసరమైన KYC, ధ్రువీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత సాధారణంగా మూడు పని దినాల్లో ఖాతాను యాక్టివేట్ చేయాలని ఆర్‌బీఐ మార్గదర్శకాలు సూచిస్తున్నాయి. అలాగే, ఇన్‌ఆపరేటివ్ ఖాతాను తిరిగి యాక్టివేట్ చేయడానికి బ్యాంకులు కస్టమర్ల నుంచి ఛార్జీలు వసూలు చేయకూడదు.
పదేళ్లు దాటితే డబ్బు పోతుందా?
ఇది చాలామందికి ఉండే సందేహం. ఒక ఖాతాలోని డిపాజిట్ పదేళ్ల పాటు క్లెయిమ్ చేయకుండా ఉంటే బ్యాంకులు ఆ మొత్తాన్ని ఆర్‌బీఐ నిర్వహించే డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ (DEA) ఫండ్‌కు బదిలీ చేయాల్సి ఉంటుంది. అయితే, ఈ బదిలీతో డబ్బుపై సదరు ఖాతాదారుడు హక్కును కోల్పోడు. అసలు ఖాతాదారు లేదా అర్హత కలిగిన వారసుడు సంబంధిత బ్యాంకును సంప్రదించి, అవసరమైన పత్రాలు సమర్పించి ఆ మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. అర్హతను నిర్ధారించిన తర్వాత బ్యాంకు ఆ డబ్బును చెల్లించి, ఫండ్ నుంచి తిరిగి పొందే ప్రక్రియను చేపడుతుంది. వడ్డీ వచ్చే డిపాజిట్ల విషయంలో వర్తించే నిబంధనల ప్రకారం వడ్డీ కూడా చెల్లించే అవకాశం ఉంటుంది.
మీకు పాత బ్యాంకు ఖాతా ఉందని గుర్తుంది కానీ వివరాలు తెలియడం లేదా? అలాంటి సందర్భాల్లో ఆర్‌బీఐ అందుబాటులో ఉంచిన UDGAM పోర్టల్ ఉపయోగపడుతుంది. ఈ పోర్టల్ ద్వారా పాల్గొనే బ్యాంకుల్లో ఉన్న క్లెయిమ్ చేయని డిపాజిట్ల వివరాలను తెలుసుకోవచ్చు. ఖాతాదారుడి పేరు, బ్యాంకు వివరాలు, అందుబాటులో ఉన్న గుర్తింపు వివరాలు వంటి సమాచారంతో ఇందులో వెతికేందుకు వీలుంటుంది. అయితే, UDGAM పోర్టల్ డబ్బును నేరుగా చెల్లించదు. అది క్లెయిమ్ చేయని డిపాజిట్‌ల వివరాలు పొందేందుకు మాత్రమే ఉపయోగపడుతుంది. డబ్బును తిరిగి పొందడానికి సంబంధిత బ్యాంకును సంప్రదించి, ఆ బ్యాంకు నిర్దేశించిన క్లెయిమ్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.
మరీ ముఖ్యంగా మీరు చాలాకాలంగా ఉపయోగించని బ్యాంకు ఖాతా ఉందని గుర్తిస్తే దాన్ని నిర్లక్ష్యం చేయకండి. సదరు బ్యాంకును సంప్రదించి ఖాతా స్థితిని తెలుసుకోండి. ఖాతాలో మీ డబ్బు ఉంటే, సరైన ప్రక్రియ ద్వారా తిరిగి పొందే అవకాశం ఉంది.




