Car Loan: పండుగ సీజన్ ఆఫర్లో లోన్ తీసుకుని కొత్త కారు కొంటున్నారా? ఈ తప్పులు చేయకండి!
పండుగ సీజన్లో కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? బ్యాంకులు, కార్ల కంపెనీలు అందించే ఆకర్షణీయమైన ఆఫర్లను చూసి వెంటనే కార్ లోన్ తీసుకునే ముందు కొన్ని విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. తక్కువ ఈఎంఐ కోసం ఎక్కువ కాలపరిమితి ఎంచుకుంటే వడ్డీ భారం పెరుగుతుంది. మరి కార్ లోన్ తీసుకునేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదు? వడ్డీని ఆదా చేసుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?

ఫెస్టివల్ సీజన్లో కొత్త కారు కొనాలని చాలామంది ప్లాన్ చేస్తుంటారు. దసరా, దీపావళి వంటి పండుగల సమయంలో కార్ల కంపెనీలు, బ్యాంకులు ప్రత్యేక ఆఫర్లు, రాయితీలు ప్రకటిస్తాయి. తక్కువ వడ్డీ, ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు, క్యాష్‌బ్యాక్ వంటి ఆకర్షణీయమైన ప్రయోజనాలు అందిస్తుంటాయి. దీంతో చాలామంది వెంటనే బ్యాంక్ లోన్‌తో కారు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. అయితే, కారు కొనడానికి సరైన లోన్ ఎంచుకోకపోతే దీర్ఘకాలంలో అదనపు వడ్డీ భారం పడే ప్రమాదం ఉంది. అందుకే కార్ లోన్ తీసుకునే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి.
మీ ఆదాయానికి మించిన లోన్ తీసుకోవద్దు
కారు కొనుగోలు చేయడానికి ముందు మీ నెలవారీ ఆదాయం, ఇంటి ఖర్చులు, ఇప్పటికే చెల్లిస్తున్న రుణాల ఈఎంఐలను పరిశీలించాలి. ఆర్థిక నిపుణుల సూచన ప్రకారం, అన్ని రుణాల ఈఎంఐలు కలిపి మీ చేతికి వచ్చే నెలవారీ ఆదాయంలో 40 శాతానికి మించకుండా చూసుకోవడం మంచిది. కారు ధర ఎంత ఉందనే దానికంటే, దాని కోసం ప్రతి నెలా ఎంత చెల్లించగలరనేది ముఖ్యం. డౌన్ పేమెంట్ కోసం మీ వద్ద ఉన్న పొదుపు మొత్తాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అత్యవసర ఖర్చుల కోసం ఉంచిన డబ్బును పూర్తిగా ఖర్చు చేయడం మంచిది కాదు.
ఎక్కువ కాలపరిమితి ఉన్న లోన్‌తో జాగ్రత్త
లోన్ కాలపరిమితి ఎక్కువగా ఉంటే నెలవారీ ఈఎంఐ తగ్గుతుంది. అయితే, మొత్తం చెల్లించే వడ్డీ పెరుగుతుంది. ట్రాన్స్‌యూనియన్ సిబిల్ నివేదిక ప్రకారం, 2019 తొలి ఆరు నెలలతో పోలిస్తే 2026 తొలి ఆరు నెలల్లో సగటు కార్ లోన్ కాలపరిమితి ఐదు నెలలు పెరిగి 62 నెలలకు చేరింది.
ఉదాహరణకు, రూ.10 లక్షల రుణానికి 8.40 శాతం వార్షిక వడ్డీ ఉంటే.. ఐదేళ్ల కాలపరిమితిలో సుమారు రూ.2.28 లక్షల వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అదే రుణాన్ని ఆరేళ్లలో తిరిగి చెల్లిస్తే వడ్డీ సుమారు రూ.2.77 లక్షలకు పెరుగుతుంది. అందువల్ల మీ నెలవారీ బడ్జెట్‌కు ఇబ్బంది కలగకుండా చెల్లించగలిగే అతి తక్కువ కాలపరిమితిని ఎంచుకోవడం మంచిది.
వడ్డీ రేట్లను పోల్చి చూడండి
కార్ లోన్లు సాధారణంగా ఫిక్స్డ్, ఫ్లోటింగ్ వడ్డీ రేట్లతో అందుబాటులో ఉంటాయి. ఫిక్స్డ్ రేటులో వడ్డీ రేటు స్థిరంగా ఉంటుంది. ఫ్లోటింగ్ రేటులో మార్కెట్ పరిస్థితులు, రుణ నిబంధనలను బట్టి వడ్డీ మారే అవకాశం ఉంటుంది. ఫిక్స్డ్ రేటు ఎంచుకుంటే చెల్లింపులపై ముందస్తు అంచనా వేసుకోవడం సులభం. అయితే, దీనికి ఫ్లోటింగ్ రేటుతో పోలిస్తే ఎక్కువ వడ్డీ ఉండే అవకాశం ఉంది. ఫ్లోటింగ్ రేటు తీసుకునేవారు భవిష్యత్తులో ఈఎంఐ పెరిగినా చెల్లించగలిగేలా బడ్జెట్‌ను సిద్ధం చేసుకోవాలి.
లోన్ ముందుగానే చెల్లించే నిబంధనలు తెలుసుకోండి
కొంతమంది రుణగ్రహీతలు బోనస్ లేదా ఇతర ఆదాయం వచ్చినప్పుడు లోన్‌ను ముందుగానే కొంత చెల్లించాలని భావిస్తారు. ఇలా చేయడం వల్ల అసలు రుణ మొత్తం తగ్గి, భవిష్యత్తులో చెల్లించే వడ్డీని ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే, లోన్ తీసుకునే ముందే ప్రీపేమెంట్ ఛార్జీలు, లాక్-ఇన్ పీరియడ్, పార్ట్ పేమెంట్‌కు సంబంధించిన నిబంధనలు తెలుసుకోవాలి. ముందస్తు చెల్లింపు చేసినప్పుడు ఈఎంఐ తగ్గుతుందా, లేక లోన్ కాలపరిమితి తగ్గుతుందా అనే విషయాన్ని కూడా అడిగి తెలుసుకోవాలి. కాలపరిమితి తగ్గడం వల్ల సాధారణంగా మొత్తం వడ్డీ ఆదా ఎక్కువగా ఉండవచ్చు.
పండుగ ఆఫర్లను చూసి నిర్ణయం తీసుకోవద్దు
పండుగల సమయంలో కొన్ని బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజును మాఫీ చేస్తాయి. మరికొన్ని సంస్థలు కారు ఆన్-రోడ్ ధర మొత్తానికి రుణం అందించే ఆఫర్లు ప్రకటిస్తాయి. కొన్ని సందర్భాల్లో ఈఎంఐ కాలపరిమితిని ఏడేళ్ల వరకు పొడిగించే అవకాశం కూడా ఉంటుంది. అయితే, క్యాష్‌బ్యాక్ లేదా ఉచిత యాక్సెసరీల కంటే వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజు, ముందస్తు చెల్లింపు నిబంధనలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. వేర్వేరు బ్యాంకుల ఆఫర్లను ఒకే రుణ మొత్తం, ఒకే కాలపరిమితి ఆధారంగా పోల్చి చూసి తుది నిర్ణయం తీసుకోవాలి.
కార్ లోన్ తీసుకునే ముందు వీటిని గుర్తించుకోండి
కొత్త కారు కొనుగోలు చేయడం అనేది పెద్ద ఆర్థిక నిర్ణయం. అందుకే కారు ధరతో పాటు ఇన్సూరెన్స్, ఇంధనం, సర్వీసింగ్, మెయింటెనెన్స్ ఖర్చులను కూడా పరిగణలోకి తీసుకోవాలి. తక్కువ ఈఎంఐ కనిపిస్తోందని ఎక్కువ కాలపరిమితి ఉన్న రుణాన్ని ఎంచుకోవడం సరికాదు. అలాగే, మీ ఆదాయానికి సరిపడే కారు మోడల్‌ను ఎంచుకోవడం మంచిది. తక్కువ ఆదాయం ఉన్నా ఖరీదైన మోడల్‌ను ఎంచుకుంటే.. ఆ తర్వాత దాని ఈఎంఐతో పాటు ఇంధనం, మెయింటెనెన్స్ తదితరాలకు కూడా ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది.
అందుకే కేవలం పండుగ ఆఫర్లను మాత్రమే చూసి కార్ లోన్ తీసుకోవాలన్న నిర్ణయానికి రాకూడదు. మీ ఆదాయం, ఖర్చులు, రుణ కాలపరిమితి, వడ్డీ రేటు, ముందస్తు చెల్లింపు నిబంధనలను పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోండి. ఇలా చేస్తే అనవసర వడ్డీ భారాన్ని తగ్గించుకోవడంతో పాటు ఆర్థిక ఒత్తిడిని కూడా నివారించవచ్చు.
