Telangana: రామగుండం, జగిత్యాల జిల్లాలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనాలు
Telangana: తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భూకంపం సంభవించింది. ఆదివారం సాయంత్రం రామగుండం, జగిత్యాల జిల్లాలలో భూమి స్వల్పంగా కంపించింది.

Telangana: తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భూకంపం సంభవించింది. ఆదివారం సాయంత్రం రామగుండం, జగిత్యాల జిల్లాలలో భూమి స్వల్పంగా కంపించింది. లక్షేటిపేట, గోదావరి పరివాహక ప్రాంతాల్లో సాయంత్రం 6:49 నిమిషాలకు దాదాపు 3 సెకన్ల పాటు భూమి కంపించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలందరు ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు. భయంతో కాలనీలలో పరుగెత్తారు. అయితే భూకంప తీవ్రంత ఎంత నమోదైందో తెలియాల్సి ఉంది. కాగా ఈ భూకంపం వల్ల ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఇదిలా ఉంటే.. గతవారం కూడా పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో పలు చోట్ల భూమి స్వల్పంగా కంపించింది. శనివారం మధ్యాహ్నం 2 గంటల 3 నిమిషాల సమయంలో భూమి కంపించింది. దాదాపు రెండు సెకండ్లపాటు భూమి కంపించినట్లు అధికారులు గుర్తించారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4 తీవ్రతగా నమోదయింది. అప్పుడు కరీంనగర్‌కు ఈశాన్యంగా 45 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే ఈ భూకంపాలు ఎందుకు వస్తున్నాయో ఎవ్వరికి అంతుచిక్కడం లేదు. తరచూ గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలో భూమి కంపించడంతో దీనిని ఆనుకొని ఉన్న గ్రామాలు, పట్టణాల ప్రజలు భయంతో ఆందోళన చెందుతున్నారు. ఈ భూకంపాలు దేనికి సంకేతమో తెలియడం లేదు.