ఫుడ్ అండ్ గ్రాసరీ డెలవరీ యాప్స్ గోదాముల్లో తనిఖీలు! అక్కడి పరిస్థితి చూసి షాకైన అధికారులు
తెలంగాణ ఫుడ్ సేఫ్టీ విభాగం జెప్టో, రిలయన్స్ జియోమార్ట్ వంటి ఈ-కామర్స్ గోదాములపై భారీ డ్రైవ్ నిర్వహించింది. తనిఖీల్లో గడువు ముగిసిన, తప్పుడు లేబుల్స్ ఉన్న 1,903 యూనిట్ల ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. 76 కిలోల కుళ్లిన ఆహారాన్ని ధ్వంసం చేసి, 32 నోటీసులు జారీ చేశారు.

తెలంగాణ ఫుడ్ సేఫ్టీ విభాగం ఈ–కామర్స్ సంస్థల గోదాములపై భారీ స్థాయిలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించింది. జెప్టో, రిలయన్స్ జియోమార్ట్, బ్లింకిట్, బిగ్‌బాస్కెట్, జొమాటో, స్విగ్గీ, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌తో పాటు స్థానిక యూనిట్లు కూడా ఈ డ్రైవ్‌లో భాగమయ్యాయి. ఆహార భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా? వినియోగదారులకు నాణ్యమైన ఆహారం అందుతున్నదా? అనే అంశాలపై అధికారులు కఠినమైన తనిఖీలు చేపట్టారు.
ఈ డ్రైవ్‌లో మొత్తం 75 గోదాములను అధికారులు తనిఖీ చేశారు. ఇందులో భాగంగా 98 ఎన్‌ఫోర్స్‌మెంట్ నమూనాలు, 124 సర్వైలెన్స్ నమూనాలు సేకరించారు. తనిఖీల్లో గడువు ముగిసిన ఆహార పదార్థాలు, తప్పుడు లేబుల్స్‌తో విక్రయానికి ఉంచిన ఉత్పత్తులు పెద్ద ఎత్తున బయటపడగా, మొత్తం 1,903 యూనిట్ల గడువు ముగిసిన, తప్పుదారి పట్టించే లేబుల్స్ ఉన్న ఫుడ్ ఆర్టికల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
అదనంగా గోదాముల్లో నిల్వ ఉంచిన 76 కిలోల గడువు ముగిసిన పదార్థాలు, పాత ఆహారం, కుళ్లిన కూరగాయలను వెంటనే ధ్వంసం చేశారు. నిల్వ, శుభ్రత, నాణ్యత పరంగా లోపాలు ఉన్న యూనిట్లకు మొత్తం 32 ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు జారీ చేశారు. వినియోగదారుల ఆరోగ్యం ప్రధానమని, ఈ–కామర్స్ ప్లాట్‌ఫార్ములు ఆహార భద్రతా నియమాలు కచ్చితంగా పాటించాలని ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇటువంటి ప్రత్యేక డ్రైవ్‌లు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
ఈ క్రమంలో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనరేట్ అన్ని ఈ–కామర్స్ సంస్థలకు స్పష్టమైన గైడ్‌లైన్స్‌ను మరోసారి పంపినట్టు తెలుస్తోంది. గోదాముల్లో నిల్వ ఉంచే ప్రతి ఉత్పత్తి పూర్తి వివరాలతో పాటు స్పష్టమైన బ్యాచ్ నంబర్, తయారీ తేదీ, గడువు తేదీ తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు. వినియోగదారులకు డెలివరీ అయ్యే ప్రతి ఆహార పదార్థం భద్రంగా, నాణ్యంగా ఉండే బాధ్యత ఈ–కామర్స్ కంపెనీలదేనని హెచ్చరించారు. ఆహార విషబాధలు, నకిలీ ఉత్పత్తులు, గడువు ముగిసిన పదార్థాల విక్రయం వంటి అంశాలు సహించబోమని, భవిష్యత్తులో ఇలాంటి నిర్లక్ష్యం పట్ల భారీ జరిమానాలు, లైసెన్స్ రద్దు వంటి చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు అధికారులు స్పష్టం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
