Adilabad: ఎగ్జామ్ హాల్‌లో ఇలా సెల్‌ఫోన్లు ఏంటి..? అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే
ఇదేంటి క్లాస్ రూంలో విద్యార్థులు ఫోన్లలలో మునిగిపోయారేంటి.. అందులోనూ పరీక్ష సమయంలా కనిపిస్తుంది.. పక్కనే ఇన్విజిలెటర్ కూడా ఉన్నట్టున్నాడు.. అయినా విద్యార్థుల దర్జాగా ఫోన్‌లలో మునిగి పోయారేంటి అనుకుంటున్నారా.. అయితే మీరు పప్పులో కాలేసినట్టే. వాళ్లంతా ఫోన్‌లలో మునిగిపోయింది పరీక్షలు రాసేందుకంట. అందులోను అదంతా చట్టబద్దంగా సాగుతున్న పరీక్షేనంట. అవును మీరు చదువుతున్నది నిజమే.

ఇక్కడ సెల్ ఫోన్‌లతో కనిపిస్తున్న విద్యార్థులంతా టైం పాస్ కోసం ఫోన్ పట్టుకోలేదు. వాళ్లంతా కాలక్షేపం చేయడం లేదు. వీరంతా ఓపెన్ స్కూల్ పరీక్ష రాస్తున్న విద్యార్థులు. అవును నిజం. తొలిసారి ఓపెన్ స్కూల్ దూరవిద్య విభాగం ఆధ్వర్యంలో సెల్‌ఫోన్ ద్వారా పరీక్ష రాసే వెసులుబాటు కల్పించింది. ఇందులో భాగంగానే ఆదిలాబాద్ జిల్లాలో ఆదివారం జరిగిన పదవ తరగతి, ఇంటర్ ప్రవేశాల కోసం బేస్‌లైన్ టెస్ట్‌లో పాల్గొన్నారు. ఇన్విజిలేటర్లు ఇచ్చిన క్యూఆర్ కోడ్ స్కాన్ ఆధారంగా ఇలా సెల్ ఫోన్ సాయంతో పరీక్ష రాశారు విద్యార్థులు. ప్రశ్నపత్రం డౌన్లోడ్ కాగానే ప్రశ్నలకు సెల్ ఫోన్‌లో పరీక్ష రాశారు. ఒకే రోజు మొత్తం ఐదు సబ్జెక్టుల పరీక్షలను రాశారు విద్యార్థులు. పరీక్ష పూర్తయ్యాక ఎన్ని మార్కులు వచ్చాయో కూడా సెల్ఫోన్ స్క్రీన్ పైనే కనిపించడంతో క్షణాల్లో ఫలితాలు తెలుసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన ఈ పరీక్షలకు పదో తరగతి నుంచి 418 మంది, ఇంటర్ నుంచి 245 మంది హాజరైనట్లు ఓపెన్ స్కూల్ జిల్లా కో ఆర్డినేటర్ అశోక్ తెలిపారు. రాబోయే కాలంలో ఈ తరహాలోనే పరీక్షలు జరిగే అవకాశం ఉందన్నారు నిర్వహకులు. మరో వైపు పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఎలక్ట్రానిక్ డివైస్‌లతో పరీక్ష హాల్లోకి అనుమతి ఉండదని.. కానీ ఈ ఓపెన్ స్కూల్ ఎంట్రన్స్ పరీక్షలకు ఆ నిబంధనలు ఉండవని చెపుతున్నారు. చూడాలి మరి భవిష్యత్‌లో పరీక్షలకు ఫోనే సర్వస్వం అయినా ఆశ్చర్యం లేదు.

Also Read: పంటి నొప్పి 10 నిమిషాల్లో తగ్గాలంటే ఈ ఆకు తింటే చాలు..!
