Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dog Bites: తెలంగాణలో పిచ్చికుక్కలు స్వైరవిహారం.. మనుషుల పైనే కాదు పశువుల పై కూడా దాడి

తెలుగు రాష్ట్రాల్లో వీధి కుక్కలు వీర విహారం చేస్తున్నాయి. మనుషుల పైనే కాదు పశువుల పై కూడా దాడి చేసి చంపేస్తున్నాయి. వీధికుక్కలు చిన్నారుల మీదకు కూడా ఎగబడుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.

Dog Bites: తెలంగాణలో పిచ్చికుక్కలు స్వైరవిహారం.. మనుషుల పైనే కాదు పశువుల పై కూడా దాడి
Canine Horror Continues
Follow us
Surya Kala

|

Updated on: Mar 04, 2023 | 6:28 AM

తెలంగాణలో పిచ్చికుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. వరుస ఘటనలతో జనం హడలిపోతున్నారు. ఒక్క హైదరాబాదే కాదు…రాష్ట్రవ్యాప్తంగా గ్రామసింహాలు జనంపై పడి కరిచేస్తున్నాయి. అంబర్‌పేట్‌ ప్రదీప్‌ ఘటనతో వరుసగా తెలంగాణలో రోజుకో చోట కుక్కల దాడి జరుగుతూనే ఉంది. తాజాగా నిర్మల్‌జిల్లా బాసర మండలం బిడ్రేల్లీలో బాసర ఎంపీపీ భర్త విశ్వనాథ్ పటేల్‌పై వీధికుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆయన్ని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ‌అయితే వీధి కుక్క దాడి చేసిన సీసీ టీవీ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వెనుక నుంచి మెళ్లిగా వచ్చిన శునకం విశ్వనాథ్ కాళ్లను పట్టుకుంది. కుక్క గట్టిగా కరవడంతో విశ్వనాథ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అక్కడే ఉన్న మరో వ్యక్తి గట్టిగా అరిచి తరిమివేయడంతో కుక్క పారిపోయింది.

హైదరాబాద్‌లో వీధికుక్కల దాడులు కంటిన్యూ అవుతున్నాయి. నాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో మల్లాపూర్ డివిజన్ బాబానగర్‌లో వీధి బయట ఆడుకుంటున్న సద్దాం అనే బాలుడిపై కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. ఇటీవల మల్లాపూర్ డివిజన్‌లో కుక్కలదాడి ఎక్కువ అవుతున్నా కూడా జిహెచ్ఎంసి అధికారులు స్పందించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జనగాంజిల్లా దేవరుప్పుల మండలం నల్లకుంట తండాలో వీధికుక్కలు హల్‌చల్‌ చేశాయి. అజ్మీరా సోమ్లా అనే వ్యక్తి గొర్లమందపై ఒక్కసారిగా కుక్కల గుంపులు దాడి చేశాయి. ఈ ఘటనలో ఆరు గొర్లు చనిపోయాయి. 70 వేల నష్టం కలిగిందని గొర్రెల కాపరి ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

వీధి కుక్కల దాడులతో.. టీచర్ల అవతారం ఎత్తారు హైదరాబాద్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. డాగ్ బైట్స్ పై ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది హైదరాబాద్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్. డాగ్స్ పై స్కూళ్ళలో విద్యార్థులకు అవగాహన ప్రారంభించింది GHMC. కుక్కల మానసిక ప్రవర్తన, కుక్కల ఆహార అలవాట్లు, కుక్కల సైకాలజీ , కరవడానికి వస్తే ఎలా రక్షంచుకోవాలి వంటి విషయాల పై అవగాహన కల్పిస్తూ వెటర్నరీ అధికారులు ..స్కూలు పిల్లలకు పాఠాలు చెబుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో వీధి కుక్కలు వీర విహారం చేస్తున్నాయి. మనుషుల పైనే కాదు పశువుల పై కూడా దాడి చేసి చంపేస్తున్నాయి. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం దుద్దేపూడి గ్రామంలో వేగి సత్యం అనే రైతు ఇంటి ఆవరణలో అర్థ రాత్రి మేకలపై కుక్కల గుంపు దాడి చేసింది. ఈ దాడిలో నాలుగు మేకలు మృతి చెందాయి. సుమారు 50 వేల రూపాయల విలువైన మేకలు చనిపోయాయని రైతు కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. వీధికుక్కలు చిన్నారుల మీదకు కూడా ఎగబడుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.

మనుషులు, పశువులు…ఇలా అన్నింటిపైనా వీధికుక్కలు గుంపులు గుంపులుగా దాడులు చేస్తున్నాయి. ఇప్పుడు నేతలపై కూడా కుక్కలు దాడి చేస్తుండడంతో అధికారుల్లో కదలిక వచ్చి ఇకనైనా వాటికి అడ్డుకట్ట వేసే దిశగా చర్యలు తీసుకుంటారేమో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..