Telangana: వైద్యుడి నిర్వాకం.. బతికుండగానే చనిపోయినట్లు చీటీ రాసిచ్చాడు.. తీరా ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్తే
వైద్యుడిని దేవుడితో పోలుస్తాం. దేవుడు ప్రాణం పోస్తే డాక్టర్ ఆ ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా కాపాడతాడు. అందుకే సమాజంలో వైద్యులకు విశేష ప్రాధాన్యత కట్టబెట్టారు. కానీ కొందరి తీరు వల్ల డాక్టర్లకూ చెడ్డ పేరు వస్తోంది. విధుల్లో నిర్లక్ష్యంగా...

వైద్యుడిని దేవుడితో పోలుస్తాం. దేవుడు ప్రాణం పోస్తే డాక్టర్ ఆ ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా కాపాడతాడు. అందుకే సమాజంలో వైద్యులకు విశేష ప్రాధాన్యత కట్టబెట్టారు. కానీ కొందరి తీరు వల్ల డాక్టర్లకూ చెడ్డ పేరు వస్తోంది. విధుల్లో నిర్లక్ష్యంగా ఉండటం, రోగుల పట్ల సరిగ్గా వ్యవహరించకపోవడం వంటివి చేస్తూ వైద్య వృత్తికే కళంకం తీసుకొస్తుంటారు. జహీరాబాద్(Zahirabad) లో సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. వైద్యం కోసం అపస్మారక స్థితిలో ఉన్న మహిళను తీసుకొస్తే.. ఆమె చనిపోయినట్లు ప్రభుత్వ వైద్యుడు నిర్ధరించాడు. ఆయన మాటతో నమ్మకం కలగని ఆ తల్లిదండ్రులు బాధితురాలిని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించి బతికున్నట్లు నిర్ధరించారు. ఆమెకు వైద్యం అందించి జీవం పోశారు. అయితే ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం అందించి ఉంటే తాము మానసికంగా, ఆర్థికంగా ఇబ్బంది పడే పరిస్థితి రాకుండా ఉండేది కాదని బాధితురాలి తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు.
సంగారెడ్డి(Sangareddy) జిల్లాలోని జహీరాబాద్ మండలం చిన్న హైదరాబాద్ గ్రామానికి చెందిన అర్చనకు మునిపల్లి మండలం తాటిపల్లికి చెందిన యువకుడితో వివాహమైంది. పూజకార్యక్రమాల్లో భాగంగా అర్చన ఉపవాసం ఉన్న సమయంలో ఆకస్మాత్తుగా కిందపడిపోయి, అపస్మారక స్థితిలోకి వెళ్లింది. వెంటనే అప్రమత్తమైన భర్త జహీరాబాద్ ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అర్చనను పరీశిలించిన జనరల్ సర్జన్ వైద్యుడు ఆమె చనిపోయిందని చెప్పి, ఆసుపత్రి చీటీపై ‘బ్రాట్ డెడ్’ అని రాసిచ్చారు. అంతే కాకుండా బాధితురాలి కుటుంబసభ్యులతో ఆస్పత్రి రిజిస్టర్‌లో సంతకం చేయించుకున్నాడు. ప్రభుత్వ వైద్యుడు చెప్పిన మాటలను అర్చన తల్లిదండ్రులు నమ్మలేదు.
బాధితురాలిని సంగారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు అర్చన బతికున్నట్లు చెప్పారు. ఆసుపత్రిలో చేర్చుకుని వైద్యం అందించారు. మే 22న డిశ్ఛార్జ్ చేశారు. వారం రోజుల తర్వాత మే 28 న మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించి, పూర్తిగా కోలుకున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ వైద్యుడి నిర్వాకంతో ప్రైవేటు ఆసుపత్రిలో రూ.లక్షలు ఖర్చు చేశామని బాధితులు ఆవేదన చెందారు. న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఆసుపత్రి రిజిస్టర్‌లో అర్చన చనిపోయినట్లు రాసిన పేజీలోని స్థలంలో కొత్తగా కాగితం అంటించి, మరో ఆసుపత్రికి సిఫార్సు చేసినట్లు రాసి ఉండటం గమనార్హం.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి