AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LPG subsidy: సామాన్యులకు భారీ షాక్.. వంట గ్యాస్‌‌పై సబ్సిడీ పూర్తిగా ఎత్తివేసిన కేంద్రం

గ్యాస్‌ బండ మరింత భారం కానుందా? ధర గురించి మొన్నటికి మొన్న గుడ్‌న్యూస్‌ చెప్పి, ఇప్పుడు రాయితీ గురించి షాకింగ్‌ న్యూస్‌ చెప్పడం దేనికి సంకేతం. అసలు కేంద్రం మదిలో మెదిలే ప్లాన్‌ ఏంటీ?

LPG subsidy: సామాన్యులకు భారీ షాక్.. వంట గ్యాస్‌‌పై సబ్సిడీ పూర్తిగా ఎత్తివేసిన కేంద్రం
LPG Cylinder Price
Ram Naramaneni
|

Updated on: Jun 03, 2022 | 6:59 AM

Share

subsidy on cooking: సామాన్యులకు కేంద్రం షాక్‌ ఇచ్చింది. ఇకనుంచి గ్యాస్‌కి సబ్సిడీ ఎత్తివేసింది. వంట గ్యాస్‌ సబ్సిడీకి పూర్తిగా మంగళం పాడుతున్నట్లు ప్రకటించింది. కాకపోతే, ఉజ్వల యోజన పథకం(Pradhan Mantri Ujjwala Yojana) కింద ఉన్న లబ్ధిదారులకు రాయితీ ఇస్తామని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ఎల్పీజీ కనెక్షన్లు దాదాపు 30 కోట్ల వరకు ఉన్నాయి. వీటిలో ఉజ్వల యోజన పథకం కింద 9 కోట్ల కనెక్షన్లు ఇచ్చారు. అంటే మిగిలిన 21 కోట్ల మంది వినియోగదారులు, ఇకపై మార్కెట్‌ రేటుకే గ్యాస్‌ కొనుక్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది కేంద్ర సర్కార్. అటు, ఉజ్వల యోజన పథకం కింద ఉన్న లబ్దిదారులకు కూడా వచ్చేది ఇటీవల ప్రకటించిన 200 రూపాయలే కావడం గమనార్హం.

ఎల్పీజీ వంటగ్యాస్‌ ధరను 200 తగ్గిస్తున్నట్లు గతనెల 21న కేంద్రం ప్రకటించింది. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. మోదీ సర్కారుకి సడెన్‌గా ఇంత ప్రేమ పుట్టుకొచ్చిందా అని అవాక్కయ్యారు. కానీ, అసలు ప్లాన్‌ను గ్రహించలేకపోయారు. బీజేపీ ప్రభుత్వం సైలెంట్‌గా అమలు చేస్తోన్న ప్లాన్‌ తాజాగా, బయటకొచ్చింది. 30 శాతం మందికి సబ్సిడీ పెంచి, 70 శాతం మందికి సబ్సిడీ తొలగించడమే అసలు పరమార్ధం అంటున్నారు విశ్లేషకులు. 2022-23 బడ్జెట్‌లో, గ్యాస్‌ సబ్సిడీకి కేటాయించిన నిధులు చూసినప్పుడే ఇటువంటిదేదో జరగబోతోందనే సందేహం వచ్చిందని చెబుతున్నారు.

ఇకనుంచి తెలుగు రాష్ట్రాల్లో, ఒక్కో సిలిండర్‌ ధర 1100 రూపాయలకు పైగానే ఉండనుంది. ఎందుకంటే ప్రస్తుతం గ్యాస్ సిలిండర్‌ ధర వెయ్యి 56 రూపాయలకు చేరింది. సబ్సిడీగా ఇస్తున్న 40 రూపాయలు కూడా ఇకనుంచి రావు కాబట్టి, సిలిండర్‌ ధర 1100కి చేరుతుంది. కేంద్ర ప్రభుత్వ వ్యవహారశైలి చూస్తుంటే, ఉజ్వల యోజన పథకం కింద ఉన్న లబ్ధిదారులకు కూడా, ఈ సబ్సిడీ ఎన్నాళ్లు ఉంటుందో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆర్థిక రంగ నిపుణులు. రెండోసారి అధికారంలోకి వచ్చాక, ఎన్డీయే ప్రభుత్వం గ్యాస్‌ సబ్సిడీకి మంగళంపాడుతూ వస్తోంది. అందుకే ఈ వాదనకు బలం చేకూరుతోంది.

గత ఎనిమిదేళ్లలో సిలిండర్ ధరలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. 2014 ఏప్రిల్‌ నాటికి వినియోగదారులు వంట గ్యాస్‌కు చెల్లించింది కేవలం 410 రూపాయలే. అప్పటినుంచి 2019 మే వరకు గ్యాస్‌ ధర 769కి పెరిగింది. అయితే, అప్పుడు వినియోగదారుల ఖాతాల్లో సబ్సిడీ కింద 260 రూపాయలు జమయ్యేవి. కానీ, ఆ రాయితీ కూడా క్రమంగా తగ్గిపోయింది. 2020 జనవరిలో వంట గ్యాస్ ధర 769 రూపాయలు ఉండగా, వినియోగదారులకు 204 రూపాయలు సబ్సిడీ వచ్చేది. సరిగ్గా ఏడాది తర్వాత, అంటే 2021 జనవరి 1న వంట గ్యాస్ ధరను 23 రూపాయలు తగ్గించి, 746 చేశారు. కానీ, సబ్సిడీని పూర్తిగా ఎత్తేశారు.

రాయితీని పూర్తిగా ఎత్తేయడంపై అటు ప్రజలు, ఇటు ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవడంతో, మళ్లీ 2021 ఫిబ్రవరి నుంచీ అకౌంట్లలో 40 రూపాయల 71 పైసలు జమచేయడం ప్రారంభించారు. ప్రస్తుతం సిలిండర్‌ ధర వెయ్యి రూపాయలు ఉండగా, దాదాపు 21 కోట్ల మందికి ఈ 40 రూపాయల రాయితీ కూడా ఇవ్వబోమని కేంద్రం బాంబ్ పేల్చింది. అయితే, బడ్జెట్‌లో ఎల్పీజీ సబ్సిడీకి 5వేల 813 కోట్లు కేటాయించినప్పుడే దీన్ని గ్రహించామని అంటున్నారు ఆర్థికవేత్తలు.

కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. సిలిండర్‌ ధరలు ఇంకా తగ్గించడానికే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని ప్రభుత్వాన్ని సమర్దించేవారు చెబుతున్నారు. కానీ, పెట్రోల్‌, డీజిల్‌ లాగానే, గ్యాస్‌ విషయంలోనూ కేంద్రం చేతులు దులుపుకునేందుకు తాజా నిర్ణయం తీసుకుందని ఆరోపిస్తున్నారు ప్రభుత్వాన్ని వ్యతిరేకించేవారు. మొత్తానికి, రాబోయే రోజుల్లో బ్రేకింగ్‌, షాకింగ్‌ న్యూస్‌లకు మించి ఏదో ఉంటుందని కామెంట్స్‌ చేస్తున్నారు నెటిజన్‌లు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…