Hyderabad: ఐటీ ఉద్యోగులతో మాట్లాడాలని ఉంది..! మాజీ మావోయిస్ట్ చీప్ దేవ్‌జీ ఆసక్తికర వ్యాఖ్యలు!
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌లో భాగంగా మావోయిస్ట్‌లు తమ ఆయుధాలను విడిచిపెట్టి లొంగిపోతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్ట్ ఛీఫ్ దేవ్ జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు హైటెక్ సిటీకెళ్లి అక్కడ పనిచేసే ఐటీ ఉద్యోగులతో చర్చించాలని ఉందని పోలీసులకు చెప్పినట్లు సమాచారం. ఇంతకు ఆయన ఐటీ ఉద్యోగులతో ఏం మాట్లాడాలి అనుకుంటాన్నారనే ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

మావోయిస్టుల లొంగుబాటు నేపథ్యంలో తెలంగాణకు కేంద్ర దర్యాప్తు సంస్థలు క్యూ కడుతున్నాయి. లొంగిపోయిన టాప్ మావోయిస్టులపై ఫోకస్‌లో భాగంగానే ఇటీవలే కేంద్ర సంస్థలు హైదరాబాద్ చేరుకున్నారు. ముఖ్యంగా National Investigation Agency (ఎన్‌ఐఏ)తో పాటు ఇతర కేంద్ర ఇంటెలిజెన్స్, దర్యాప్తు సంస్థల అధికారులు రాష్ట్రంలో మకాం వేసినట్లు సమాచారం. లొంగిపోయిన కీలక మావోయిస్టు నాయకుల నుంచి కీలక సమాచారాన్ని రాబట్టడమే లక్ష్యంగా ఈ విచారణ కొనసాగనున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల సరెండర్ అయిన దేవ్ జీ, మల్లారాజిరెడ్డి, దామోదర్‌లను కేంద్ర సంస్థలు ప్రత్యేకంగా విచారించనున్నాయి. ముఖ్యంగా మావోయిస్టు పార్టీ అగ్రనేత గణపతి ఆచూకీపై ఫోకస్ పెట్టినట్లు సమాచారం. గణపతి కదలికలు, అతని భద్రతా వలయం, ఆర్థిక లావాదేవీలు, పార్టీ భవిష్యత్ వ్యూహాలు వంటి అంశాలపై లోతైన ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులతో సమన్వయం చేసుకుంటూ కేంద్ర బృందాలు విచారణ చేపడుతున్నాయి.
రాజకీయాల్లోకి రావాలని ఉంది
మరోవైపు లొంగిపోయిన నేతలు తమ కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. ఏళ్ల తరబడి అండర్‌గ్రౌండ్ జీవితాన్ని గడిపిన వీరు కుటుంబ సభ్యులతో భావోద్వేగంగా మమేకమయ్యారు. దేవ్ జీ రాజకీయాలపై ఆసక్తి ఉందని తన సమీప వర్గాలకు తెలిపినట్లు సమాచారం. భవిష్యత్తులో ప్రజాసేవ దిశగా అడుగులు వేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఐటీ ఉద్యోగులను కలవాలని ఉంది!
అంతేకాదు ఆసక్తికరంగా, హైటెక్ సిటీకెళ్లి ఐటీ ఉద్యోగులతో చర్చించాలని ఉందని దేవ్ జీ పోలీసులకు చెప్పినట్లు సమాచారం. సమాజంలోని కొత్త తరంతో మాట్లాడి వారి ఆలోచనలు తెలుసుకోవాలని ఉందని ఆయన తెలిపినట్లు తెలుస్తోంది. ఇది భవిష్యత్ రాజకీయ ప్రవేశానికి సంకేతమా అనే చర్చ కూడా సాగుతోంది. దామోదర్ కూడా రాజకీయ రంగ ప్రవేశంపై సంకేతాలు ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ములుగు ప్రాంత ప్రజలు కోరుతున్నారని ఆయన వెల్లడించినట్లు సమాచారం.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
