Telangana: సర్కారుతో వీఆర్‌ఏల చర్చలు సఫలం.. సమ్మె విరమణ.. రేపటి నుంచే తిరిగి విధుల్లోకి
80 రోజులుగా ఆందోళన చేస్తున్న వీఆర్‌ఏలతో బీఆర్కే భవనంలో సీఎస్ సోమేశ్ కుమార్ చర్చలు జరిపారు. పేస్కేల్, ఉద్యోగ భద్రత, ప్రమోషన్ల విషయాలకు సంబంధించిన డిమాండ్లను ట్రెసా అధ్యక్షుడు రవీందర్ రెడ్డి ప్రభుత్వం ముందు ఉంచారు.
తమ డిమాండ్ల సాధన కోసం 80 రోజులుగా సమ్మెలో ఉన్న వీఆర్‌ఏలు దిగొచ్చారు. తెలంగాణ ప్రభుత్వంతో వీఆర్‌ఏ జేఏసీ జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. వీఆర్‌ఏల డిమాండ్లకు సీఎస్ అంగీకరించడంతో వారు సమ్మె విరమించారు. రేపటి నుంచే తిరిగి విధుల్లోకి చేరనున్నారు. కాగా వీఆర్‌ఏల డిమాండ్లకు అనుగుణంగానే కొత్త పే స్కేలు తీసుకురానుననారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున వచ్చే నెల 7 నుంచి కొత్త పే స్కేల్‌ను అమలుచేయనున్నారు. కాగా 80 రోజులుగా ఆందోళన చేస్తున్న వీఆర్‌ఏలతో బీఆర్కే భవనంలో సీఎస్ సోమేశ్ కుమార్ చర్చలు జరిపారు. పేస్కేల్, ఉద్యోగ భద్రత, ప్రమోషన్ల విషయాలకు సంబంధించిన డిమాండ్లను ట్రెసా అధ్యక్షుడు రవీందర్ రెడ్డి ప్రభుత్వం ముందు ఉంచారు. దీనికి ప్రభుత్వం కూడా సానుకూలంగానే ఉందని ఆయన చర్చల అనంతరం ప్రకటించారు. ‘వీఆర్‌ఏల డిమాండ్లపై సీఎస్‌తో చర్చించాం. సమస్యలను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. మునుగోడు ఉప ఎన్నిక దృష్ట్యా నవంబరు 7 తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వీఆర్‌ఏలు రేపట్నుంచి విధులకు హాజరవుతారు’ అని రవీందర్ రెడ్డి తెలిపారు.