TPCC Chief Election: ఎటు తేలని తెలంగాణ పీసీసీ చీఫ్.. కొత్త అలజడి సృష్టిస్తున్న సోనియా గాంధీకి లేఖ

తెలంగాణ పీసీసీ చీఫ్‌ ఎవరవుతారన్నది బహుశా కాలజ్ఞానులు కూడా చెప్పలేరేమో! డైలీ సీరియల్‌లా ఎపిసోడ్లకు ఎపిసోడ్లు నడుస్తూ వస్తున్న ఈ అంశానికి ఎప్పుడు ఎండ్‌ కార్డ్‌ పడనుంది.

  • Updated On - 9:43 am, Thu, 17 June 21 Edited By: Balaraju GoudFollow us -
TPCC Chief Election: ఎటు తేలని తెలంగాణ పీసీసీ చీఫ్.. కొత్త అలజడి సృష్టిస్తున్న సోనియా గాంధీకి లేఖ
Telangana Pradesh Congress Committee Chief

Delay in naming TPCC Chief: తెలంగాణ పీసీసీ చీఫ్‌ ఎవరవుతారన్నది బహుశా కాలజ్ఞానులు కూడా చెప్పలేరేమో! డైలీ సీరియల్‌లా ఎపిసోడ్లకు ఎపిసోడ్లు నడుస్తూ వస్తున్న ఈ అంశానికి ఎప్పుడు ఎండ్‌ కార్డ్‌ పడుతుందా అని రాజకీయాల పట్ల కాసింత ఆసక్తి ఉన్న వారు ఎదురుచూస్తున్నారు.. కొందరేమో ఎదురుచూడటం మానేశారు.. రెండేళ్ల నుంచి చూస్తూనే ఉన్నాం.. రేపు మాపు అంటూ నెట్టుకొస్తున్నారే తప్ప నియామకం మాత్రం జరగడం లేదు. దీనికే కాంగ్రెస్‌ అధినాయకత్వం ఆపసోపాలు పడుతున్నది.. ఎవరిని నియమిస్తే ఏమవుతుందోనన్న భయం..

అసలు నాగార్జునసాగర్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక లేకుండా ఉండి ఉంటే ఈ నియామకం ఎప్పుడో జరిగేది.. ఇప్పుడేమో నేడో , రేపో పీసీసీ ప్రకటన రాబోతుందనుకున్న వేళ.. కాంగ్రెస్ లో ఆసక్తికరమైన అంశం చోటుచేసుకుంది. దీంతో పీసీసీ ఎంపిక మళ్లీ రసకందాయంలో పడినట్లయింది. తాజా సంఘటనతో పీసీసీ అధ్యక్షుడి ఎంపిక ఏంటనేది మిలియన్ డాలర్ల ప్రశ్న గా మారింది. ఇంతకీ కాంగ్రెస్ లో చోటు చేసుకున్న పరిమాణం ఏంటి.. ? దీనికి పీసీసీ ఎంపిక కు లింక్ ఏంటి..?

ఏ నిమిషానికి ఏమి జరుగునో అన్నారో సినీ కవి. రాజకీయాలకు ఇది బాగా సూటవుతుంది. ఏ టైమ్‌కు ఏమి జరుగుతుందన్నది అంచనా వేయడం చాలా కష్టం. ఈ మాటను బహుశా కాంగ్రెస్ పార్టీని దృష్టిలో పెట్టుకొని అని ఉండొచ్చునేమో అనే సందేహం కలగకమానదు. ఇదంతా ఎందుకు చెప్పాలి వస్తుందంటే.. ఏడాది కాలంగా ఇదిగో పీసీసీ, అదిగో పీసీసీ అంటూ ప్రచారం జరుగుతోంది. ప్రచారం మొదలైన ప్రతీసారి కాంగ్రెస్ నేతలు తమదైన మార్క్ రాజకీయాన్ని చూపిస్తున్నారు.

తాజాగా నేడో రేపో పీసీసీ అధ్యక్షుడిని ప్రకటిస్తారనుకుంటున్న వేళ.. తెలంగాణ కాంగ్రెస్ లో ఊహించని ట్విస్ట్ నెలకొంది. పీసీసీ అధ్యక్షుడి విషయంలో.. కొంత మంది నేతలు తమ లెటర్ హెడ్ మీద .. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కి లేఖ రాశారు. భద్రాచలం ఎమ్మెల్యే పొడెం వీరయ్య లెటర్ హెడ్ మీద రాసిన లేఖపై .. ఎమ్మెల్యేలు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, తూర్పు జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లు సంతకాలు చేశారు. ఆ లేఖలో అత్యంత కీలకమైన అంశాలను ప్రస్తావించారు. కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపిక లో .. అభ్యర్థి ట్రాక్ రికార్డ్ పరిశీలించాలని.. కాంగ్రెస్ పార్టీ కి ..గాంధీ కుటుంబానికి లాయలిస్ట్, నమ్మకస్తుడు అయ్యుండాలని పేర్కొన్నారు. ఇప్పుడు ఈ లేఖ.. తెలంగాణ కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారింది.

అయితే, ఈ లేఖ ఎవరిని ఉద్దేశించి రాశారనేది కాంగ్రెస్‌లో హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు ఈ లేఖలో మొత్తం ఎమ్మెల్యేలు కూడా సంతకాలు చేయలేదు. కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ఆరుగురే ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో ఈ లెటర్ పై ముగ్గురు మాత్రమే సంతకాలు చేశారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీతక్క , కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లు చేయలేదు. వీరిలో రాజగోపాల్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీతో అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఎమ్మెల్యే సీతక్క మాత్రం మొదటి నుంచి.. ఎంపీ రేవంత్ రెడ్డి వర్గంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ లేఖ ఎంపీ రేవంత్ రెడ్డిని దృష్టిలో పెట్టుకొనే రాశారనే టాక్ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.

ఇదిలాఉంటే టీపీసీసీ అధ్యక్ష పదవిపై తనకు ఎలాంటి ఆసక్తి లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డి.శ్రీధర్‌బాబు ప్రకటించారు. ఆ పదవి రేసులో తాను లేనని అన్నారు. మొత్తం మీద డైలీ సీరియల్‌ను తలపిస్తోన్న టీపీసీసీ ప్రక్రియలో కొత్త ట్విస్ట్ స్టార్ట్ అయ్యింది. ఈ ఎపిసోడ్ ఎటువైపు కు దారి తీస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఫైనల్ పీసీసీ అధ్యక్షుడి ఎంపిక మళ్లీ గందరగోళంలో పడినట్లేనని పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. చూడాలి పార్టీ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది.

ఇవి కూడా చదవండి:

Published On - 9:41 am, Thu, 17 June 21

Click on your DTH Provider to Add TV9 Telugu