SLBC canal: ఎస్‌ఎల్‌బీసీ కాల్వపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. ఇక కష్టాలు తీరినట్లేనా..?
ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు కలల సౌధంగా భావించే శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రాజెక్టు పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టి రెండేళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ప్రభుత్వం ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టుగా తీసుకుని పూర్తిచేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తోంది.
ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు కలల సౌధంగా భావించే శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (SLBC) ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రాజెక్టు పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టి రెండేళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ప్రభుత్వం ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టుగా తీసుకుని పూర్తిచేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తోంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2005లో శ్రీశైలం ఎడమగట్టు కాల్వ(SLBC) పనులను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రారంభించారు. 2010 సంవత్సరం నాటికి పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని జిల్లాలోని 3.5 లక్షల ఎకరాలకు సాగు నీరు, 250 గ్రామాలు పైగా తాగునీరు అందుతుంది. మొదట ప్రాజెక్టు వ్యయం రూ.1,925 కోట్ల అంచనా విలువతో ప్రారంభం కాగా.. తర్వాత అది రూ.3,152.72 కోట్లు, అనంతరం రూ.4,200 కోట్ల అంచనాకు చేరింది. ఈ వ్యయంతో 2020 అక్టోబరు వరకు పనులు పూర్తి చేయాల్సి ఉంది. కానీ పాలకులు నిర్లక్ష్యం చేయడంతో ఎక్కడ వేసినా గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది.
కాలేశ్వరం ప్రాజెక్టు కంటే ముందుగానే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుకు అడుగులు పడ్డాయి. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పనులను పూర్తిగా పక్కన పట్టేశారన్న వాదనలు వినిపించాయి. వాస్తవానికి ఉత్తర తెలంగాణతో పోల్చుకుంటే.. నల్లగొండ జిల్లాలో ఇటు తాగునీరు.. అటు సాగునీరు సమస్య తీవ్రంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఎల్ఎల్బీసీ పనులను టన్నెల్-1, టన్నెల్-2గా విభజించారు. టన్నెల్-1 మొత్తం 43 కిలోమీటర్లు కాగా, టన్నెల్-2 పొడవు 7.25 కిలోమీటర్లు. అయితే ఇప్పటికే టన్నెల్-2 పనులు పూర్తయ్యాయి. ఇంకా లైనింగ్ పనులు చేయాల్సి ఉంది. గత ప్రభుత్వం ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.
ఇటీవల సచివాలయంలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నతాధికారులతో ఎస్‌ఎల్‌బీసీ, డిండి ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితోపాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి, బాలు నాయక్, జైవీర్ రెడ్డి, బి.లక్ష్మారెడ్డి, వేముల వీరేశం, ఈఎన్సీ(జనరల్) జి.అనిల్‌కుమార్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరితగతిన ఎస్‌ఎల్‌బీసీ కాల్వ పనులు పూర్తి చేయాలని సూచించారు.
శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ), డిండి ప్రాజెక్టుల పనులను సత్వరంగా పునరుద్ధరించి, రెండేళ్లలోగా పూర్తి చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, కానీ తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టుగా తీసుకుందని ఆయన స్పష్టం చేశారు. ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు సొరంగ మార్గం పది కిలోమీటర్ల తవ్వకం జరపాల్సి ఉందని ఆయన అన్నారు. రెండేళ్లలో సొరంగ మార్గం పనులు పూర్తి చేస్తామని నిర్మాణ సంస్థలు అంటున్నాయని, ఆ మేరకు గడువు పెట్టుకుని పనులు చేయాలని సూచించారు. పనులను వేగవంతం చేసేందుకు అధికారులతో కమిటీ వేయాలని నీటిపారుదలశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాను మంత్రి ఉత్తమ్ ఆదేశించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…