ఢిల్లీ లిక్కర్‌ కేసులో కీలక పరిణామం.. కవితను నిందితురాలిగా చేర్చిన సీబీఐ

ఏడాదిగా స్తబ్దుగా ఉన్న లిక్కర్ కేసు మరోసారి సంచలనాలు రేపుతోంది. కవిత ఢిల్లీ పీఏ అప్రూవర్‌గా మారడంతో.. ఆమెను నిందితురాలిగా చేరుస్తూ నోటీసులిచ్చింది సీబీఐ. ఢిల్లీలో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. అయితే.. ఇదంతా బీజేపీ-బీఆర్ఎస్ ప్లాన్, సింపతీ డ్రామా అని కొట్టి పారేస్తున్నారు కాంగ్రెస్ నేతలు.

ఢిల్లీ లిక్కర్‌ కేసులో కీలక పరిణామం.. కవితను నిందితురాలిగా చేర్చిన సీబీఐ
MLC Kavita
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 23, 2024 | 7:23 PM

ఢిల్లీ లిక్కర్‌ కేసులో ఏడాది గ్యాప్‌ తర్వాత ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు ఇవ్వడమే కాదు, ఆమెను నిందితురాలిగా పేర్కొనడం ఇప్పుడు కలకలం రేపుతోంది. గతంలో ఇంటికొచ్చి స్టేట్‌మెంట్ తీసుకున్న సీబీఐ… ఈ 26న ఢిల్లీకి రావాలని, తమ ఎదుట విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో కవితను నిందితురాలిగా చేర్చి 41-A కింద సీబీఐ నోటీసులు ఇచ్చింది. గతంలో సమాచారం కోసం కవితను హైదరాబాద్‌లోని తన ఇంటికి వచ్చి 160 సీఆర్‌పీసీ కింద ప్రశ్నించింది సీబీఐ. 2022 డిసెంబర్‌లో కవితను ప్రశ్నించింది సీబీఐ. ఇదే కేసులో ఇప్పటికే మూడుసార్లు కవితను ఈడీ కూడా విచారించింది.

లిక్కర్ కేసులో కీలక నిందితులు అప్రూవర్లుగా మారడంతో.. వారిస్టేట్మెంట్స్ ఆధారంగా కవితకు నోటీసులు జారీ చేసింది సీబీఐ. లిక్కర్ కేసులో నిందితులు మాగుంట రాఘవ, శరత్ చంద్రారెడ్డితో పాటు.. కవిత ఢిల్లీ పీఏ అశోక్‌ కౌశిక్ అప్రూవర్‌గా మారడంతో.. కేసు కీలక మలుపు తిరిగింది. పీఏ అశోక్‌ జడ్జి ముందు సంచలన విషయాలు చెప్పాడు. లిక్కర్ వ్యవహారంలో.. పలువురికి ముడుపులు అందించినట్టు అంగీకరించాడు. దీంతో.. అశోక్‌ను, కవితను నిందితులుగా చేర్చి.. విచారించేందుకు సిద్ధమైంది సీబీఐ. అశోక్‌ ఇచ్చిన సమాచారంతో కవితను ప్రశ్నించే అవకాశం ఉంది.

కవితకు సీబీఐ నోటీసులపై స్పందించారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. కవితను అరెస్ట్ చేస్తే కేసీఆర్ ఫ్యామిలీ రోడ్డెక్కుతుందని, సింపతీతో బీఆర్‌ఎస్ ఎంపీ సీట్లు గెలిచే ప్లాన్ చేస్తోందన్నారు జగ్గారెడ్డి. కాంగ్రెస్‌కి వచ్చే ఎంపీ సీట్లు గండికొట్టేందుకు బీజేపీ-బీఆర్‌ఎస్‌ ఈ ప్లాన్‌ చేశాయన్నారు జగ్గారెడ్డి. లిక్కర్ కేసులో ఈడీ నోటీసుల్ని ఇప్పటికే.. సుప్రీంలో సవాల్‌ చేశారు కవిత. ఆ పిటిషన్‌కి సంబంధించి ఈ నెల 28న విచారణ ఉంది. ఈ గ్యాప్‌లో వచ్చిన సీబీఐ నోటీసులకు కవిత స్పందిస్తారా.. విచారణకు వెళ్తారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. సుప్రీంలో విచారణ ఉండటంతో.. కవిత సీబీఐ విచారణకు గైర్హాజరు అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. సుప్రీంలో కేసు విచారణ తర్వాతే సీబీఐ విచారణకు వెళ్తానని.. ఢిల్లీ హైకోర్ట్ లో కవి పిటిషన్ వేసే అవకాశం ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..