Telangana: లోక్ సభ ఎన్నికల్లో త్రిముఖ పోటీ తప్పదా.. సరికొత్త వ్యూహాలతో ముందుకెళ్తున్న పార్టీలు..

తెలంగాణలో రోజురోజుకు లోక్‌సభ ఎన్నికల పోరు హీటెక్కుతోంది. అన్ని ప్రధాన పార్టీలు సమరానికి సిద్ధమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఉత్సాహంతో అధికార పార్టీ దూసుకుపోతోంది. ఆనవాయితీ ప్రకారం అధిష్టానం నుంచి ప్రకటన వచ్చే వరకు వేచి చూడకుండా.. సందర్భాన్ని బట్టి అభ్యర్థులను ప్రకటిస్తూ.. ముందుకెళ్తోంది తెలంగాణ కాంగ్రెస్‌. ఇక మోదీ చరిష్మాతో సత్తా చాటాలని చూస్తున్న బీజేపీ బీజేపీ కూడా.. విజయ సంకల్ప్ యాత్రతో ప్రజల్లోకి వెళ్తూ.. నేడో రేపో తొలిజాబితాకు సిద్ధమైంది.

Telangana: లోక్ సభ ఎన్నికల్లో త్రిముఖ పోటీ తప్పదా.. సరికొత్త వ్యూహాలతో ముందుకెళ్తున్న పార్టీలు..
These Are The Reasons Brs Lost In Karimnagar And Congress Won..
Follow us
Srikar T

|

Updated on: Feb 23, 2024 | 10:30 PM

తెలంగాణలో రోజురోజుకు లోక్‌సభ ఎన్నికల పోరు హీటెక్కుతోంది. అన్ని ప్రధాన పార్టీలు సమరానికి సిద్ధమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఉత్సాహంతో అధికార పార్టీ దూసుకుపోతోంది. ఆనవాయితీ ప్రకారం అధిష్టానం నుంచి ప్రకటన వచ్చే వరకు వేచి చూడకుండా.. సందర్భాన్ని బట్టి అభ్యర్థులను ప్రకటిస్తూ.. ముందుకెళ్తోంది తెలంగాణ కాంగ్రెస్‌. ఇక మోదీ చరిష్మాతో సత్తా చాటాలని చూస్తున్న బీజేపీ బీజేపీ కూడా.. విజయ సంకల్ప్ యాత్రతో ప్రజల్లోకి వెళ్తూ.. నేడో రేపో తొలిజాబితాకు సిద్ధమైంది. అయితే.. బీఆర్‌ఎస్‌ మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో చూపించినంత దూకుడు.. పార్లమెంట్‌ పోరులో చూపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న బీఆర్ఎస్.. లోక్‌సభ ఎన్నికల్లో అయినా పట్టునిలుపుకుని సత్తా చాటేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తోంది. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో ‘సారు కారు 16’ పేరుతో ప్రజల్లోకి వెళ్లినా.. అది కూడా.. అంతకుముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత భారీ మెజారిటీ సాధించినా.. 9 సీట్లు మాత్రమే గెలుపొందారు. గత లోక్‌సభ ఎన్నికల్లో అప్పటికప్పుడు పార్టీలో చేరిన వారికి, వ్యాపారవేత్తలకు, పారాషూట్‌ లీడర్లకు టికెట్లు కేటాయించిన పార్టీ.. ఇప్పుడు మాత్రం అన్ని విషయాల్లోనూ ఆచితూచి అడుగులు వేస్తోంది బీఆర్‌ఎస్‌. సామాజిక సమీకరణాలు, ఉద్యమ నేపథ్యం, గెలుపు అవకాశాలను బేరీజు వేసుకొని టికెట్లు కేటాయిస్తోంది.

గతంలో ఉన్న పరిస్థితి కూడా ఇప్పుడు లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. దీంతో.. రెండు పార్టీలతోనూ పోటాపోటీగా భారత రాష్ట్ర సమితి పోరాడాల్సి ఉంది. దీంతో.. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించిన బీఆర్‌ఎస్‌.. ఆ సమాచారంతో అభ్యర్థుల వారిగా సర్వేలు కూడా నిర్వహిస్తోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ఎమ్మెల్యేలకు కూడా ఎంపీ టికెట్లను అవకాశం కల్పించనున్నారు. ఒకవైపు కాంగ్రెస్ మరోవైపు బిజెపి 2 ఎంపీ ఎన్నికల కోసం దూకుడుగా వ్యవహరిస్తున్నా.. బీఆర్ఎస్ మాత్రం ఆచితూచి అడుగులు వేస్తుంది. ఎన్నికల షెడ్యూల్ తర్వాతనే అభ్యర్థుల ఎంపిక విషయంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఈ లోపు పార్లమెంటు ఎన్నికల్లో ఎజెండాగా నీటి పోరు, కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలపై ఆందోళన చేయాలని ఆలోచిస్తుంది. మరోవైపు.. లోక్ సభ సమరానికి తెలంగాణ కాంగ్రెస్ సై అంటోంది. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాలకు గాను.. 14 చోట్ల గెలవాలనే టార్గెట్ పెట్టుకున్న కాంగ్రెస్.. ఇప్పటికే టికెట్లపై కసరత్తు పూర్తి చేసింది. అంతేకాకుండా.. ఆనవాయితీ ప్రకారం అధిష్టానం నుంచి ప్రకటన వచ్చే వరకు వేచి చూడకుండా.. సందర్భాన్ని బట్టి అభ్యర్థులను ప్రకటిస్తోంది. మహబూబ్ నగర్ స్థానం నుంచి చల్లా వంశీ చంద్ రెడ్డి పోటీ చేస్తారని సీఎం రేవంత్ ప్రకటించేశారు. సీఎం తన సొంత గడ్డ పైనుంచి చేసిన ఈ ప్రకటనతో కాంగ్రెస్ నేతల్లో ఊపు కనిపిస్తోంది.

ఇక మిగిలిన 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉండగా.. బీఆర్ఎస్ నుంచి ఇటీవల పార్టీలో చేరిన నలుగురికి సీట్లు కన్ఫార్మ్ అయినట్లు సమాచారం. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరినవారిలో పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేశ్ నేతకు అదే స్థానం కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇక.. బీజేపీ కూడా దూకుడు పెంచింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 13.90 శాతం ఓట్లు సాధించి 8 అసెంబ్లీ సెగ్మెంట్లను గెలుచుకుంది. అదే ఊపుతో మరిన్ని లోక్ సభ స్థానాలను కైవసం చేసుకోవాలనుకుంటుంది. తెలంగాణలో 10 రోజుల పాటు సాగే విజయ సంకల్ప్ యాత్రతో లోక్ సభ ఎన్నికల కోసం మొదటి దశ ప్రచారాన్ని ఇప్పటికే ప్రారంభించి మంచి జోష్ మీద ఉంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడకముందే బీజేపీ 10 లోక్‌ సభ నియోజకవర్గాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. సికింద్రాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌ లోక్‌సభ నియోజకవర్గాల నుంచి పార్టీ సిట్టింగ్‌ ఎంపీలనే కొనసాగించాలని బీజేపీ అధిష్ఠానం నిర్ణయించింది. దీంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్‌రెడ్డి ఈ ముగ్గురితో పాటు మరో ఏడు నియోజకవర్గాలకు అభ్యర్థుల ఆమోదం కోసం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీకి జాబితాను పంపించింది. శనివారం బీజేపీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్‌ జరిగిన రెండ్రోజుల్లో తొలి జాబితా రిలీజ్‌ చేసేందుకు బీజేపీ రెడీ అవుతోంది. మొత్తానికి పార్లమెంట్‌ ఎన్నికల్లో సత్తా చాటేందుకు అన్ని పార్టీలు ఫుల్‌ ఫోకస్‌ పెట్టడంతో.. తెలంగాణలో ఎన్నికల వేడి మరింత పెరిగింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..