CM KCR: భారీ వర్షాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష.. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచన..
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తుండటంతో తాజా పరిస్థితులపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సమీక్షించారు. కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతాల్లో...
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తుండటంతో తాజా పరిస్థితులపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సమీక్షించారు. కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఇప్పటికే చేపట్టిన చర్యలు, చేపట్టాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. SRSP ఎగువ నుంచి గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో పెరుగుతున్న వరద తాకిడిపై మంత్రులు, ఉన్నతాధికారులతో CM KCR చర్చించారు. యుద్ధ ప్రాతిపదికన ఆయా ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
NDRF బృందాలను పంపాలని CSకు సూచించారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు ఉండడంతో ప్రజాప్రతినిధులంతా నియోజకవర్గాల్లోనే ఉండాలని CM KCR ఆదేశించారు. అన్ని జిల్లాల అధికారులకు ముఖ్యమంత్రి ఫోన్లు చేశారు. అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వాతావరణ శాఖ వారి హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని, క్షేత్ర స్థాయి అధికారులు స్థానికంగా అందుబాటులో ఉండేలా చూడాలని అన్నారు.
అధికారులతోపాటు జిల్లాల మంత్రులకు కూడా ముఖ్యమంత్రి స్వయంగా ఫోన్ చేశారు. ఎప్పటికప్పుడు అధికారులతో పరిస్థితులను సమీక్షించాలని సూచించారు. నిర్మల్ జిల్లాలో వరదలు ముంచెత్తుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదల పరిస్థితిపై మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో మాట్లాడారు సీఎం కేసీఆర్. జిల్లాలో వరద పరిస్థితిపై.. ఆరాతీశారు. అలాగే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వరద బాధితులకు అండగా ఉండాలని అధికారులు, ప్రజాప్రతినిధులను ఆదేశించారు సీఎం కేసీఆర్.
ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గుండుగూడెం దగ్గర ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉండడానికి గూడు కూడా లేదని, తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. అటు భైంసా ముంపులో చిక్కుకుంది. గడ్డెన్నవాగు గేట్లు ఎత్తివేయడంతో వరద నీరు టౌన్‌ను ముంచెత్తింది. ముఖ్యంగా ఆటోనగర్ ప్రాంతంలో పరిస్థితి దారుణంగా మారింది. అంతకంతకూ వరద ప్రవాహం పెరుగుతుండడంతో.. భైంసాలోని ఆటోనగర్‌వాసులు కనీసం ఇళ్లలోంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. 60 మంది వరకు చిక్కుకుపోయారు. వారిని బయటకు తీసుకొచ్చేందుకు అధికార యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోంది.