CJI NV Ramana: వరంగల్ జిల్లాలో సీజేఐ పర్యటన.. భద్రకాళీ ఆలయంలో ఎన్వీ రమణ దంపతుల పూజలు
Justice NV Ramana Warangal Tour: ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండో రోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పర్యటన కొనసాగుతోంది.
Chief Justice of India NV Ramana Warangal Tour: ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండో రోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పర్యటన కొనసాగుతోంది. ఇవాళ ఉదయం భద్రకాళీ అమ్మవారిని జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు దర్శించనున్నారు. దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హనుమకొండలో నూతనంగా ఏర్పాటు చేసిన 10 కోర్టుల భవన సముదాయం ఆయన ప్రారంభించనున్నారు.
భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చారిత్రక నగరం వరంగల్‌లో పర్యటిస్తున్నారు. ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిన ములుగు జిల్లాలోని రామప్ప ఆలయాన్ని శనివారం సందర్శించారు. ఆలయంలోని రుద్రేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు సీజేఐ దంపతులు. జస్టిస్ ఎన్వీ రమణ దంపతులకు అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. రామప్ప ఆలయంలో రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన జస్టిస్ రమణ దంపతులకు ఆశీర్వచనం ఇచ్చారు వేదపండితులు. అనంతరం ఆలయ గైడ్ రామప్ప దేవాలయ శిల్పకళా సంపద విశిష్టత గురించి సీజేఐకి వివరించారు. కాకతీయ కళాఖండాలకు ప్రతీక, రామప్ప శిల్పాలను చూసి సంబరపడ్డారు సీజేఐ ఎన్వీ రమణ.
భారత ప్రధాన న్యాయమూర్తి పర్యటన నేపథ్యంలో, అడుగడుగునా గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత, ములుగు ఎమ్మెల్యే సీతక్క, తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, వరంగల్ జిల్లా మెజిస్ట్రేట్, అధికారులు సీజేఐకి స్వాగతం పలికారు. రామప్ప ఆలయ సందర్శన అనంతరం, హనుమకొండకు వెళ్లి రాత్రి నిట్ కళాశాలలో బస చేశారు సీజేఐ. ఇవాళ వరంగల్ భద్రకాళీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు. ఆ తర్వాత హనుమకొండలో కొత్తగా నిర్మించిన కోర్టుల భవన సముదాయాన్ని ప్రారంభిస్తారు సీజేఐ. అనంతరం హైదరాబాద్ రానున్నారు. ఇవాళ సాయంత్రం షామీర్‌పేటలోని నల్సార్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొంటారు. రాత్రి హైదరాబాద్‌లోనే బస చేసి, రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు సీజేఐ ఎన్వీ రమణ.
Read Also… Netherlands: ఒమిక్రాన్ వేరియంట్ ధాటికి మరోసారి లాక్డౌన్.. జనవరి 14 వరకూ అన్నీ బంద్!