Netherlands: ఒమిక్రాన్ వేరియంట్ ధాటికి మరోసారి లాక్‌డౌన్.. జనవరి 14 వరకూ అన్నీ బంద్!
ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి పగ పట్టినట్లు ఉంది. ఇప్పుడప్పుడే వదిలేలా లేదు. రెండేళ్లుగా మూడు విడతలుగా విరుచుకుపడుతూనే ఉంది. రోజుకో కొత్త రూపంలో రాకాసి కోరల్లో జనాన్ని బంధించేస్తోంది.
Netherlands Lockdown: ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి పగ పట్టినట్లు ఉంది. ఇప్పుడప్పుడే వదిలేలా లేదు. రెండేళ్లుగా మూడు విడతలుగా విరుచుకుపడుతూనే ఉంది. రోజుకో కొత్త రూపంలో రాకాసి కోరల్లో జనాన్ని బంధించేస్తోంది. డెల్టా వేరియంట్ సృష్టించి విధ్వంసం మరవకముందే, ఒమిక్రాన్ రూపంలో మరో భూతం భయపడుతోంది. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా మెల్ల మెల్లగా విస్తరిస్తోంది. ముఖ్యంగా అమెరికా, యూకే, ఫ్రాన్స్ వంటి అగ్రదేశాలు సైతం చిరుగుటాకుల్లా వణికిపోతున్నాయి. తాజాగా నెదర్లాండ్స్ దేశంలో కొత్త కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఆదేశ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
కరోనా వైరస్ భయంకర కొత్త స్వరూపం ఒమిక్రాన్ వ్యాప్తి నివారించడానికి మళ్లీ లాక్‌డౌన్‌ను ఆశ్రయించాల్సిన దుస్థితి తలెత్తింది. ఒక్కో దేశం క్రమంగా లాక్‌డౌన్‌లోకి జారుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే నెదర్లాండ్స్ ప్రభుత్వం మరోసారి లాక్‌డౌన్ ప్రకటించింది. కంప్లీట్ క్రిస్మస్ లాక్‌డౌన్‌ను ప్రవేశపెట్టింది. ఆదివారం నుంచి లాక్‌డౌన్ అమల్లోకి వచ్చింది. జనవరి 14వ తేదీ వరకు ఈ లాక్‌డౌన్ అమలులో ఉంటుందని నెదర్లాండ్స్ ప్రధానమంత్రి మార్క్ రుట్టె వెల్లడించారు.
ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతోండటం, క్రిస్మస్, కొత్త సంవత్సరం వేడుకలను దృష్టిలో ఉంచుకుని తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని మార్క్ రుట్టె అన్నారు. క్రిస్మస్, కొత్త సంవత్సరం వేడుకల కోసం దేశ ప్రజలు సంసిద్ధమవుతున్న వేళ లాక్‌డౌన్ విధించడం బాధాకరంగా ఉందన్నారు. ఆదివారం నుంచి పూర్తి లాక్‌డౌన్ అమలులోకి వస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే, అత్యవసర సర్వీసులు, నిత్యావసర సరుకుల రవాణా, వాటికి సంబంధించిన దుకాణాలకు మినహాయింపునిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 24, 25, 26 తేదీల్లో క్రిస్మస్ వేడుకల కోసం తమ ఇళ్లకు నలుగురు దగ్గరి బంధువులను మాత్రమే ఆహ్వానించుకోవచ్చని తెలిపింది. 13 సంవత్సరాలకు పైనున్న, 60 సంవత్సరాల లోపు వయస్సున్న వారిని మాత్రమే ఈ వేడుకల కోసం ఆహ్వానించాలని సూచించింది. కొత్త సంవత్సరం వేడుకల కోసం ఈ సంఖ్యను రెండుకు కుదించింది.
నిత్యావసర సరుకులను విక్రయించడానికి వారాంతపు రోజుల్లో ఏర్పాటు చేసే మార్కెట్లు, వైద్య సేవలు, ఇతర అత్యవసర సర్వీసులు మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలిపింది. అంత్యక్రియల్లో హాజరయ్యే వారి సంఖ్యను కూడా పరిమితం చేసింది. పాఠశాలలను జనవరి 9వ తేదీ వరకు మూసి ఉంచాలని నెదర్లాండ్స్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తరువాత పరిస్థితులను సమీక్షించిన తరువాత వాటిని తెరవడంపై ఆదేశాలను జారీ చేస్తామని పేర్కొంది.