Telangana: ఆదిలాబాద్ జిల్లాలో టెర్రర్ పుట్టిస్తున్న చెడ్డీ గ్యాంగ్.. సీసీటీవీ ఫుటేజీలో షాకింగ్ సీన్స్..
నక్కినక్కి కాదు.. ఎదురొచ్చినోళ్లను తొక్కుకుంటూ పోవాలె..! అనే రేంజ్‌లో స్టయిల్ మార్చేసినట్టుంది చెడ్డీ గ్యాంగ్. లేటెస్ట్‌గా అడ్డా మార్చుకుని..

నక్కినక్కి కాదు.. ఎదురొచ్చినోళ్లను తొక్కుకుంటూ పోవాలె..! అనే రేంజ్‌లో స్టయిల్ మార్చేసినట్టుంది చెడ్డీ గ్యాంగ్. లేటెస్ట్‌గా అడ్డా మార్చుకుని.. అడ్డూ అదుపూ లేకుండా రెచ్చిపోతున్నాయి.. వరుస దోపిడీలతో వార్ వన్‌సైడ్ చేసుకుంటున్నాయి చెడ్డీ గ్యాంగులు. కాకపోతే.. ఈ చెడ్డీ గ్యాంగులే ఆ చెడ్డీ గ్యాంగులా.. లేక.. చెడ్డీ గ్యాంగులకి నకిలీలేమైనా పుట్టుకొచ్చాయా.. అనేవి కొత్త డౌట్లు.
చెడ్డీ గ్యాంగ్.. నిక్కర్లేసుకుని నడిరాత్రిలో నిలువుదోపిడీలకు పాల్పడే ముఠాలకున్న బ్రాండ్ నేమ్ ఇది. కానీ.. ఈ బ్రాండ్ ఏ ఒక్కడి సొంతం కాదని.. మిగతా దొంగలు కూడా చెడ్డీ బ్రాండ్‌పై కన్నేశారా… లేక చెడ్డీ గ్యాంగే అక్కడక్కడా బ్రాంచీలు ఏర్పాటు చేసుకుని.. నెట్‌వర్క్‌ను విస్తరించుకుంటోందా.. తెలీదు గాని.. లేటెస్ట్‌గా ఆదిలాబాద్ జిల్లాలో టెర్రర్ పుట్టిస్తున్నాయి కొన్ని చెడ్డీలు.
చెడ్డీ గ్యాంగ్ అడ్డా మార్చినట్టుంది. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో కనిపించిన చెడ్డీలివి. బోథ్ మండలం పొచ్చెర గ్రామంలో అర్థరాత్రి చెడ్డి గ్యాంగ్ సంచరించిందన్నది పోలీసుల అనుమానం. ఓ ఇంట్లో అమర్చిన సీసీ టీవి కెమెరాల్లో రికార్డయిన చెడ్డీ గ్యాంగ్ దృశ్యాలు… ఖాకీల అనుమానాలకు బలాన్నిస్తోంది.




నిర్మానుష్య ప్రాంతంలో.. అనుమానితుల దుస్తులు, బ్యాగులు దొరకడంతో ఇవి చెడ్డీ గ్యాంగ్‌వే అనే నిర్ధారణక్కూడా వచ్చేశారు. వెంటనే డాగ్ స్క్వాడ్స్‌ని దింపి.. సెర్చాపరేషన్ షురూ చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో రెండు రోజుల్లో మూడు ఘటనలు జరగడం.. వాటిలో చెడ్డీ గ్యాంగ్ ఆనవాళ్లు కనిపించడం పోలీసుల్ని పరుగు పెట్టిస్తోంది. మంచిర్యాల జిల్లా చెన్నూర్ బడా హనుమాన్ వీధిలో ఇటీవలే దొంగల భీభత్సం సృష్టించారు. కిరాణా వ్యాపారి ఇంట్లో కిచెన్ కిటికీ గ్రిల్ తొలగించి ఇంట్లోకి చొరబడ్డారు.
విద్యానగర్, సాయినగర్ కాలనీల్లో కూడా చోరీకి యత్నం జరిగింది. ఇలా వరుస దొంగతనాలతో విసుగెత్తిన పట్టణ ప్రజలు.. నిఘా వ్యవస్థను పటిష్టం చేయాలని వేడుకుంటున్నారు స్థానికులు. గత ఏడాది సెప్టెంబర్‌లో సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పీఎస్ పరిధిలో చెడ్డీ గ్యాంగ్ కలకలం రేగింది. మారణాయుధాలతో కనిపించిన చెడ్డీ గ్యాంగ్… 12 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. వారం రోజుల కిందట మహబూబ్‌నగర్ బృందావన్ కాలనీలో కూడా చెడ్డీ గ్యాంగ్ కదలికలు కనిపించాయి. అందుకే పోలీసుల్లో ఈ పరేషాన్.. నాలుగు టీమ్‌లతో స్పెషలాపరేషన్..!
ఇంతకీ.. ఆదిలాబాద్ జిల్లాలో తిరిగేది చెడ్డీ గ్యాంగేనా.. ? ఏపీకి మాత్రమే పరిమతమైన చెడ్డీ దొంగలు.. తెలంగాణాకు మకాం మార్చేశారా.. ఇటువంటి అనుమానాలతో చెడ్డీ గ్యాంగ్ రూట్స్ అండ్ నేచర్‌పై మళ్లీ ఫోకస్ పెరిగింది.
చెడ్డీ గ్యాంగ్.. ఈ మాట వినగానే వెన్నులో వణుకు పుట్టేది. నలుగురు లేదా ఐదుగురితో ఒక ముఠా.. చేతిలో చిన్నచిన్న మారణాయుధాలు.. ఒంటిమీద చెడ్డీ మాత్రమే వేసుకోవడం యూనిక్ స్పెషాలిటీ… గతంలో కృష్ణాజిల్లా, గుంటూరు జిల్లాల్లో మాత్రమే కనిపించేవాళ్లు. నిజానికి వీళ్లది గుజరాత్‌లోని దవోద్ జిల్లాలో ఓ గిరిజనగ్రాం. అడవిలో పోడు వ్యవసాయం చేసుకుంటూ.. అది కుదరక కరడుగట్టిన దొంగలుగా మారారు.
సీసీ కెమెరాలు ఎక్కువయ్యాక వీళ్ల వేషబాషలు, చెడ్డీలు ధరించి, ఒళ్ళంతా ఆయిల్ పూసుకొని చేసే ఘోరాలు బాగా ఓపెనయ్యాయి. వీళ్ల కన్ను ఏ నగరంపై పడితే ఆనగరానికి నెలముందే చేరుకొని రెక్కీలు నిర్వహించడం వీళ్ల అలవాటు.
రొట్టెలు మాత్రమే తింటూ..పగటి పూట రోడ్లపై కూలీల్లా సంచరిస్తారు. రాత్రిపూట పొలాల్లోకెళ్ళి తలదాచుకుంటారు. అడవుల్లో మృగాల్ని వేటాడేవాళ్లు కనుక.. వీళ్ల స్టయిలాఫ్ చోరీ మరీ ఆటవికంగా ఉంటుంది. గుజరాత్ టు ఏపీ.. ఇప్పుడు చెడ్డీ గ్యాంగ్ అడ్డా తెలంగాణాకు మారిందా? అనే డౌట్లు.. స్థానికుల్ని, పోలీసుల్ని వణికిస్తున్నాయి.. ఇళ్లకు తాళాలెయ్యాలంటేనే భయపడిపోతున్నారు ఆదిలాబాద్ జిల్లా వాసులు. ఈ చెడ్డీ ఆ చెడ్డీ ఒకటి కాదు.. డోన్ట్ వర్రీ అనే భరోసా కూడా ఇవ్వలేకపోతున్నారు ఖాకీలు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..