AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దిష్టి తీస్తానంటూ.. మట్టి గురిగితో ‘మాయ’ చేశాడు.. 21 రోజుల ముందే రట్టయిన గుట్టు..!

సృష్టికి ప్రతి సృష్టి జరుగుతున్న ఆధునిక యుగంలో కూడా పల్లెలు మూఢ నమ్మకాల మత్తులో జోగుతున్నాయి. సామాన్యుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొందరు కేటుగాళ్లు క్షుద్ర పూజల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం, కుటుంబ సమస్యలతో ప్రాణహాని ఉందంటూ క్షుద్ర పూజల పేరుతో కుచ్చుటోపి పెట్టాడు ఓ కేటుగాడు.

దిష్టి తీస్తానంటూ.. మట్టి గురిగితో ‘మాయ’ చేశాడు.. 21 రోజుల ముందే రట్టయిన గుట్టు..!
Black Magic
M Revan Reddy
| Edited By: |

Updated on: May 15, 2026 | 8:04 PM

Share

సృష్టికి ప్రతి సృష్టి జరుగుతున్న ఆధునిక యుగంలో కూడా పల్లెలు మూఢ నమ్మకాల మత్తులో జోగుతున్నాయి. సామాన్యుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొందరు కేటుగాళ్లు క్షుద్ర పూజల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం, కుటుంబ సమస్యలతో ప్రాణహాని ఉందంటూ క్షుద్ర పూజల పేరుతో కుచ్చుటోపి పెట్టాడు ఓ కేటుగాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లికి చెందిన పేర్ల చిరంజీవి (48) వృత్తిరీత్యా నాటు మందులు అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో దైవభక్తి గల ప్రజలను మోసం చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలో సూర్యాపేట జిల్లా కేంద్రం కుడకుడకు చెందిన లింగంపల్లి మమత కుటుంబంతో పరిచయం పెంచుకున్నాడు. మమత కుటుంబం కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. గతంలో కొందరు కుటుంబ సభ్యులు సైతం మరణించారు. మీ ఇంట్లో క్షుద్ర శక్తులు ఉన్నాయని, చేతబడి జరిగిందని, తనకు క్షుద్రపూజలు వస్తాయని, మీ ఇంటిని బాగు చేస్తానని నమ్మించాడు.

మే నెల ఎనిమిదవ తేదీన మమత ఇంటికి చిరంజీవి వెళ్లాడు. మీ వంటిపై, ఇంట్లో ఉన్న బంగారంపై దిష్టి ఉందని అందుకు బంగారంపై పూజలు చేస్తే నయమవు తుందన్నాడు. క్షుద్ర పూజలు చేస్తూ ఆమె మెడలోనీ పుస్తెల తాడుతో పాటు ఇంట్లోని చంద్రహారం, గోల్డ్ చైన్, బిళ్లను తీసుకున్నాడు. వాటిపై చేతబడి ఉందని నమ్మించి, మట్టి గురుగిలో వేయించాడు. దాన్ని తొలుత తన సంచిలో పెట్టి వారి కళ్లుగప్పి అదే సంచిలోని మరో ఖాళీ గురిగిని భూమిలో పాతిపెట్టాడు. 21 రోజుల వరకు గుంతలు తెరవొద్దని, అప్పటివరకు నిత్యం పూజలు చేయాలని సూచించి వెళ్లిపోయాడు.

అప్పటివరకు ఫోన్ లో టచ్ లో ఉన్న చిరంజీవి.. మూడు రోజుల తర్వాత మమతకు అందుబాటులోకి రాలేదు. దీంతో మోసపోయానని గ్రహించిన మమత ఇంట్లో పాతిపెట్టిన గురిగిని తవ్వి చూడగా అందులో ఏమీ లేదు. దీంతో మమత సూర్యాపేట రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో క్షుద్ర పూజల పేరుతో కొట్టేసిన బంగారాన్ని తాకట్టు పెట్టేందుకు చిరంజీవి సూర్యాపేటకు వస్తున్నాడు. అయిలాపురం స్టేజీ వద్ద పోలీసులు వాహనాలను తనిఖీలు చేస్తుండగా నిందితుడు పారిపోయేందుకు ప్రయత్నించగా, పోలీసులు వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు వద్ద ఉన్న ఐదున్నరతులాల బంగారంతో పాటు బైక్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్ తెలిపారు. మూఢనమ్మకాల పేరుతో చేసే పూజలు నమ్మవద్దని ఆయన సూచించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us