EPFO ఖతాదారులకు గుడ్‌న్యూస్! మీ బ్యాంక్ అకౌంట్‌లోకి నేరుగా డబ్బులు జమ?
ఈపీఎఫ్ఓ (EPFO) పీఎఫ్ ఉపసంహరణ, బదిలీ ప్రక్రియను సులభతరం చేయనుంది. కొత్త ఆటో-సెటిల్‌మెంట్ విధానం ద్వారా ఉద్యోగులకు పీఎఫ్ డబ్బు త్వరగా నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమవుతుంది. పత్రాల సమర్పణ భారం తగ్గి, క్లెయిమ్ తిరస్కరణలు తగ్గుతాయి. సరైన వివరాలతో UANను అనుసంధానిస్తే, 7 కోట్ల మందికి పైగా సభ్యులు వేగవంతమైన ప్రయోజనాలు పొందవచ్చు.

దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఉద్యోగులకు ఊరటనిచ్చే కీలక మార్పులకు EPFO సిద్ధమవుతోంది. ఉద్యోగం మానేసిన తర్వాత లేదా పదవీ విరమణ అనంతరం పీఎఫ్ డబ్బును సులభంగా పొందేందుకు కొత్త ఆటో-సెటిల్‌మెంట్ వ్యవస్థను తీసుకురావాలని సంస్థ ప్రణాళిక రూపొందిస్తోంది. ఈ విధానం అమల్లోకి వస్తే, ఉద్యోగుల పీఎఫ్ నిధులు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం పీఎఫ్ ఉపసంహరణ కోసం సభ్యులు అనేక దశల ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయాల్సి వస్తోంది. KYC వెరిఫికేషన్, ఉద్యోగ వివరాలు, బ్యాంక్ ఖాతా ధృవీకరణ వంటి ప్రక్రియల కారణంగా క్లెయిమ్ సెటిల్‌మెంట్‌కు రోజులు లేదా వారాలు పడుతోంది.
అయితే కొత్త ఆటోమేటెడ్ విధానంలో సభ్యుల వివరాలు ముందుగానే సరిగా అప్‌డేట్ అయి ఉంటే, క్లెయిమ్ స్వయంచాలకంగా ప్రాసెస్ అవుతుంది. దీంతో డబ్బు త్వరగా ఖాతాలో జమయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కొన్ని పాక్షిక పీఎఫ్ ఉపసంహరణ క్లెయిమ్‌లను ఆటోమేటెడ్ విధానంలో మూడు రోజుల్లో పరిష్కరిస్తున్న EPFO, ఇప్పుడు అదే విధానాన్ని పూర్తి పీఎఫ్ ఉపసంహరణలకు కూడా విస్తరించనుంది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా 7 కోట్లకు పైగా సభ్యులకు ప్రయోజనం చేకూర్చవచ్చని అంచనా. కొత్త విధానం వల్ల ఉద్యోగులకు పత్రాల సమర్పణ భారం తగ్గడంతో పాటు, పొరపాట్లు, క్లెయిమ్ తిరస్కరణలు కూడా తగ్గే అవకాశం ఉంది. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో కంపెనీ ఆమోదంపై ఆధారపడాల్సిన అవసరం కూడా తగ్గవచ్చు.
ఇక ఉద్యోగం మారినప్పుడు పీఎఫ్ బదిలీ ప్రక్రియను కూడా సులభతరం చేయాలని EPFO భావిస్తోంది. ప్రస్తుతం ఉద్యోగులు కొత్త కంపెనీలో చేరిన తర్వాత PF ట్రాన్స్‌ఫర్ కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేయాల్సి వస్తోంది. కొత్త విధానంలో అయితే UANకు అనుసంధానమైన కొత్త ఖాతాకు PF మొత్తం ఆటోమేటిక్‌గా బదిలీ అయ్యే అవకాశం ఉంది. త్వరగా ప్రయోజనాలు పొందాలంటే సభ్యులు తమ UAN యాక్టివ్‌గా ఉంచడం, ఆధార్, పాన్, బ్యాంక్ ఖాతా వివరాలను సరిగా లింక్ చేయడం, అలాగే మొబైల్ నంబర్‌ను ఆధార్‌తో అనుసంధానించడం అవసరమని EPFO సూచిస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
