బ్యాంక్ ఆఫ్ ఇండియా బంపర్ ఆఫర్: కళ్లు చెదిరే వడ్డీతో 500 రోజుల ‘అక్షయ్’ FD స్కీమ్ !!
సాధారణంగా బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD)చేయాలనుకునే వారికి వడ్డీ రేట్లు అనేవి చాలా కీలకమని చెప్పొచ్చు. ఈ క్రమంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) 500 రోజుల అక్షయ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాన్ని తీసుకొచ్చింది. డిపాజిట్ మొత్తం ఖాతాదారుడి వయస్సును బట్టి గరిష్ఠంగా వార్షిక వడ్డీ పొందే అవకాశం ఉంది. మరి ఈ పథకంలో ఎవరికి ఎంత వడ్డీ లభిస్తుంది? వంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

సాధారణంగా బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD)చేయాలనుకునే వారికి వడ్డీ రేట్లు అనేవి చాలా కీలకమని చెప్పొచ్చు. పెట్టుబడికి భద్రతతో పాటు మంచి రాబడి రావాలని చాలామంది కోరుకుంటారు. అందుకే వివిధ బ్యాంకులు అందిస్తున్న ఎఫ్‌డీ వడ్డీ రేట్లను పోల్చి చూసి తమకు అనుకూలమైన పథకాన్ని ఎంచుకుంటారు. ముఖ్యంగా సాధారణ ఖాతాదారులతో పోలిస్తే సీనియర్ సిటిజన్లకు బ్యాంకులు అదనపు వడ్డీని అందిస్తున్నాయి. ఈ క్రమంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) 500 రోజుల అక్షయ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో డిపాజిట్ మొత్తం ఖాతాదారుడి వయస్సును బట్టి గరిష్ఠంగా వార్షిక వడ్డీ పొందే అవకాశం ఉంది. మరి ఈ పథకంలో ఎవరికి ఎంత వడ్డీ లభిస్తుంది వంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం..
బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్తగా ప్రవేశపెట్టిన ఈ పథకం పరిమిత కాలం పాటు మాత్రమే అమలులో ఉంటుంది. ఈ స్కీమ్‌లో గరిష్ఠంగా ఏడాదికి 7.65 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. ఇందుకు సంబంధించి అధికారిక వెబ్‌సైట్లో పేర్కొన్న వివరాల ప్రకారం సాధారణ పౌరులకు కాలబుల్ డిపాజిట్లపై 6.85 శాతం వడ్డీ ఆఫర్ చేస్తుండగా సీనియర్ సిటిజన్లకు 7.35 శాతం.. సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం వరకు వడ్డీ అందిస్తోంది. అయితే రూ.1 కోటి కంటే ఎక్కువ రూ.3 కోట్ల లోపు నాన్ కాలబుల్ డిపాజిట్లపై సాధారణ పౌరులకు 7 శాతం వడ్డీ.. సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం వడ్డీ.. సూపర్ సీనియర్ సిటిజన్లకు ఏకంగా 7.65 శాతం వడ్డీ అందిస్తోంది.
ఇన్వెస్టర్లకు ఏది బెటర్..
అత్యవసర సమయంలో 500 రోజుల గడువు ముగియకముందే నిబంధనలకు లోబడి డబ్బు విత్ డ్రా చేసుకునే వెసులుబాటు కాలబుల్ ఎఫ్‌డీలో ఉంటుంది. దీనిపై లోన్ సైతం తీసుకోవచ్చు. కానీ నాన్ కాలబుల్ ఎఫ్‌డీలో 500 రోజులు పూర్తయ్యే వరకు డబ్బును మధ్యలో విత్ డ్రా చేసుకునే అవకాశం గానీ, ఎఫ్‌డీపై లోన్ తీసుకునే సదుపాయం గానీ ఉండవు. కాబట్టి 16.5 నెలల పాటు కచ్చితంగా అవసరం లేని నిధులను మాత్రమే ఇందులో లాక్ చేయాలి. మరోవైపు మెచ్యూరిటీ సమయంలో ఒకేసారి వడ్డీ తీసుకోవడానికి బదులుగా, ప్రతి నెలా లేదా ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ ఆదాయం కోరుకునే రిటైర్డ్ ఉద్యోగుల కోసం బ్యాంక్ ఆఫ్ ఇండియా నెలవారీ, త్రైమాసిక వడ్డీ ఆప్షన్లను అందిస్తోంది. అలాగే బ్యాంక్ డిపాజిట్లపై డిపాజిటర్‌కు రూ.5 లక్షల వరకు DICGC బీమా రక్షణ ఉంటుంది.
రూ.5,00,000 డిపాజిట్‌పై ఎవరికి ఎంతొస్తుంది?
బ్యాంక్ ఆఫ్ ఇండియా 500 రోజుల పథకంలో అత్యధిక 7.65 శాతం వడ్డీ రేటు కేవలం రూ.1 కోటి కంటే ఎక్కువ నాన్-కాలబుల్ డిపాజిట్లకు మాత్రమే వర్తిస్తుంది. అయితే మీరు రూ.5 లక్షలు జమ చేయాలంటే రిటైల్ విభాగంలో కాలబుల్ ఎఫ్‌డీ కేటగిరీలో చేయాల్సి ఉంటుంది. ఇందులో గరిష్ఠ వడ్డీ రేటు 7.50 శాతం వరకు ఉంది.
- ఒక జనరల్ కస్టమర్ ఇందులో రూ.5 లక్షలు జమ చేస్తే అతనికి వార్షిక వడ్డీ 6.85 శాతం వర్తిస్తుంది. దీని ప్రకారం 500 రోజుల్లో వచ్చే వడ్డీ రూ.48,556 అవుతుంది. మొత్తం రూ.5,48,556 అవుతుంది.
- 60-80 ఏళ్ల మధ్య వయసు గల సీనియర్ సిటిజన్ రూ.5 లక్షలు జమ చేసినట్లయితే వార్షిక వడ్డీ రేటు 7.35 శాతం వర్తిస్తుంది. అప్పుడు 500 రోజులకు వడ్డీ 52,230 వరకు వస్తుంది. మెచ్యూరిటీ నాటికి చేతికి వచ్చే మొత్తం రూ.5,52,230 అవుతుంది.
- 80 ఏళ్ల వయసు దాటిన సూపర్ సీనియర్ సిటిజన్ రూ.5 లక్షలు జమ చేస్తే వడ్డీ 7.50 శాతం వర్తిస్తుంది. దీని ప్రకారం వడ్డీ రూ.53,337 వస్తుంది. మొత్తంగా చేతికి రూ.5,53,337 లభిస్తుంది.
