జ్వరం వచ్చిందనుకున్న కుటుంబానికి రేబిస్ షాక్.. 11 ఏళ్ల బాలుడి ప్రాణం బలి!
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గుండెల్ని పిండేసే విషాద ఘటన చోటు చేసుకుంది. ఒక సామాన్య పేద కుటుంబంలో వెలుగులు నింపాల్సిన 11 ఏళ్ల చిరునవ్వు, పిచ్చికుక్క రూపంలో వచ్చిన మృత్యువు వాతపడింది. కేవలం జ్వరం అనుకుని సాధారణ చికిత్స చేయించిన ఆ కుటుంబానికి, తమ బిడ్డకు 'రేబిస్' సోకిందనే నిజం తెలిసి కోలుకోలేని షాక్‌కు గురయ్యారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గుండెల్ని పిండేసే విషాద ఘటన చోటు చేసుకుంది. ఒక సామాన్య పేద కుటుంబంలో వెలుగులు నింపాల్సిన 11 ఏళ్ల చిరునవ్వు, పిచ్చికుక్క రూపంలో వచ్చిన మృత్యువు వాతపడింది. కేవలం జ్వరం అనుకుని సాధారణ చికిత్స చేయించిన ఆ కుటుంబానికి, తమ బిడ్డకు ‘రేబిస్’ సోకిందనే నిజం తెలిసి కోలుకోలేని షాక్‌కు గురయ్యారు. చివరకు ఆ బాలుడు ప్రాణాలు కోల్పోవడంతో కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామం మొత్తం కన్నీటి సముద్రమైంది.
మామిడిపల్లి గ్రామానికి చెందిన లోకుర్తి రాజు, మమత దంపతుల కుమారుడు నిశాంత్ (11). స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో ఏప్రిల్ నెల 23వ తేదీన నిశాంత్ తన స్నేహితులతో కలిసి ఇంటి ముందు సరదాగా క్రికెట్ ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో అకస్మాత్తుగా దూసుకొచ్చిన ఒక పిచ్చికుక్క నిశాంత్‌పై ఘోరంగా దాడి చేసింది. ఈ దాడిలో బాలుడి తల, కంటి భాగాల్లో తీవ్రమైన గాయాలయ్యాయి. రక్తం ఓడుతున్న బాలుడిని చూసి భయాందోళనలకు గురైన కుటుంబ సభ్యులు వెంటనే సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. ఆ తర్వాత అంతా బానే ఉందనుకున్నారు.
అయితే, మే నెల 7వ తేదీన నిశాంత్‌కు ఒక్కసారిగా తీవ్రమైన జ్వరం వచ్చింది. ఎండదెబ్బ వల్లో, సాధారణంగానో జ్వరం వచ్చి ఉంటుందని భావించిన కుటుంబ సభ్యులు స్థానికంగా వైద్యం చేయించారు. కానీ, అదే రోజు రాత్రి బాలుడి పరిస్థితి విషమించింది. విపరీతమైన అస్వస్థతకు గురై, రాత్రంతా నిద్రపోకుండా వింతగా ప్రవర్తించడంతో తల్లి, బంధువులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
పరిస్థితి చేతులు దాటుతుండటంతో తదుపరి మెరుగైన చికిత్స కోసం బాలుడిని హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నిశాంత్‌ను నిశితంగా పరిశీలించిన వైద్యులు పరీక్షలు నిర్వహించి, బాలుడికి అప్పటికే ‘రేబిస్’ వ్యాధి సోకిందని నిర్ధారించారు. కుక్క కాటు వేసిన సమయంలో వైరస్ నేరుగా కేంద్ర నరాల వ్యవస్థపై ప్రభావం చూపడమే ఇందుకు కారణమని తేలింది. వైద్యులు శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ, రేబిస్ తీవ్రత ఎక్కువ కావడంతో నిశాంత్ చికిత్స పొందుతూ కన్నుమూశాడు.
నిశాంత్ కుటుంబ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. కుటుంబ పోషణ కోసం, పిల్లల చదువుల కోసం తండ్రి లోకుర్తి రాజు అప్పులు చేసి సౌదీ అరేబియాకు వలస వెళ్లాడు. ఇక్కడ ఇంట్లో తల్లి మమత రెక్కలు ముక్కలు చేసుకుంటూ, బీడీలు చుడుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. కంటికి రెప్పలా చూసుకుంటున్న కొడుకు కళ్ల ముందే శవమై పడి ఉండటంతో ఆ తల్లి గుండెలవిసేలా రోదిస్తున్న తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. కొడుకు మరణవార్త విన్న తండ్రి రాజు సౌదీలో తీరని దుఃఖంలో మునిగిపోయాడు.
ఈ ఘోర కలికానికి పిచ్చికుక్కల బెడదే కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో వైద్యులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. కుక్క కాటుకు గురైనప్పుడు గాయం చిన్నదా, పెద్దదా అని చూడకుండా… వెంటనే సబ్బుతో గాయాన్ని శుభ్రం చేసి, ఆలస్యం చేయకుండా పూర్తి స్థాయిలో యాంటీ రేబిస్ వ్యాక్సిన్ (ARV) కోర్సును పూర్తి చేయాలని సూచిస్తున్నారు. లేదంటే నిశాంత్ లాంటి అమాయక ప్రాణాలు బలికాక తప్పదని హెచ్చరిస్తున్నారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
