AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026: ఆ టీమిండియా ప్లేయర్‌ను నిషేధించండి: ఐసీసీని డిమాండ్ చేసిన మాజీ దిగ్గజం..!

Arshdeep Singh Controversy: భారత యువ క్రికెటర్ తిలక్ వర్మపై పంజాబ్ కింగ్స్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా లోకంలో పెను దుమారం రేపుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఒక వీడియో ఆధారంగా అర్ష్‌దీప్‌పై వర్ణవివక్ష ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ స్పిన్నర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ స్పందిస్తూ అర్ష్‌దీప్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.

IPL 2026: ఆ టీమిండియా ప్లేయర్‌ను నిషేధించండి: ఐసీసీని డిమాండ్ చేసిన మాజీ దిగ్గజం..!
Arshdeep Singh Controversy
Venkata Chari
|

Updated on: May 15, 2026 | 7:45 PM

Share

Arshdeep Singh Controversy: ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన ఐపీఎల్ 2026 మ్యాచ్‌కు ముందు ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్న ఒక చిన్న వీడియో క్లిప్‌లో అర్ష్‌దీప్ సింగ్, తిలక్ వర్మను ఉద్దేశించి “ఓయ్ అంధేరే (చీకటివాడా), సన్‌స్క్రీన్ రాసుకున్నావా?” అని అనడం వినిపించింది. తిలక్ వర్మ చర్మ రంగును ఎగతాళి చేస్తూ చేసిన ఈ వ్యాఖ్యలు నెటిజన్లకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. ఒక అంతర్జాతీయ స్థాయి ఆటగాడు తోటి క్రీడాకారుడి పట్ల ఇలాంటి వివక్షాపూరిత వ్యాఖ్యలు చేయడం క్షమించరాని నేరమని సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

శివరామకృష్ణన్ సంచలన డిమాండ్..

ఈ వివాదంపై టీమ్ ఇండియా మాజీ స్పిన్నర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తీవ్రంగా స్పందించారు. అర్ష్‌దీప్ సింగ్‌ను ఈ ఐపీఎల్ సీజన్ మొత్తం నిషేధించాలని ఆయన భారత క్రికెట్ నియంత్రణ మండలిని (బిసిసిఐ) కోరారు. “గతంలో నేను ఇలాంటి విషయాలు చెప్పినప్పుడు ఎవరూ నమ్మలేదు, నన్ను ట్రోల్ చేశారు. కానీ ఇప్పుడు ఆటగాళ్లకు ఎక్కడ దెబ్బ తగిలితే బుద్ధి వస్తుందో అక్కడే కొట్టాలి. అర్ష్‌దీప్‌కు ఇచ్చే పారితోషికంలో కోత విధించడంతో పాటు అతడిని తక్షణమే నిషేధించాలి” అని ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

ముంబై ఇండియన్స్ వినూత్న సమాధానం..

మరోవైపు, ఈ వివాదంపై ముంబై ఇండియన్స్ యాజమాన్యం తమదైన శైలిలో స్పందించింది. తిలక్ వర్మ చేతిలో అవార్డులు పట్టుకుని ఉన్న ఒక వీడియోను పోస్ట్ చేస్తూ, దానికి నేపథ్యంగా “అంధేరా తేరా మైనే లేలియా..” (నీ చీకటిని నేను తీసుకున్నాను, నా వెలుగును నీకు ఇచ్చాను) అనే అర్థం వచ్చే పాటను జత చేసింది. తిలక్ వర్మ తన ప్రతిభతో విమర్శకులకు సమాధానం చెబుతాడని పరోక్షంగా సందేశం ఇచ్చింది.

ఆటపైనే దృష్టి అంటున్న తిలక్ వర్మ..

ఈ వివాదాల మధ్య తిలక్ వర్మ మాత్రం తన ఆట తీరుపైనే దృష్టి సారించాడు. మ్యాచ్ అనంతరం ఆయన మాట్లాడుతూ, “దేశం తరపున అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడటం వల్ల నాకు ఒత్తిడిని ఎదుర్కొనే అనుభవం వచ్చింది. పిచ్ నెమ్మదిగా ఉన్నప్పటికీ నా ప్రాథమిక సూత్రాలను నమ్మి ఆడాను. మ్యాచ్‌ను చివరి వరకు తీసుకెళ్లి గెలిపించడం నాకు సంతోషాన్నిచ్చింది” అని తెలిపారు. వ్యక్తిగత దూషణల కంటే జట్టు విజయంపైనే తను ఏకాగ్రత పెట్టినట్లు ఆయన మాటల ద్వారా స్పష్టమైంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us