Telangana: పెన్షన్లు ఇవ్వకపోవడమే “చేయూత”నా..కాంగ్రెస్ సర్కారు పై మాజీ మంత్రి హరీష్ రావు మండిపాటు
200 రూపాయలున్న పెన్షన్ ను 2 వేల రూపాయలుగా పెంచి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసరా కల్పించారని గుర్తు చేశారు. ఈ పెన్షన్ డబ్బులతోనే నెలవారీ సరుకులు, మందులకు, వైద్య ఖర్చులకు, ఇతర అవసరాలకు వినియోగించుకున్నారని చెప్పారు. ప్రస్తుతం పెన్షన్ డబ్బులు ఆలస్యం కావడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని హరీష్ రావు మండిపడ్డారు.
వృద్ధులు, వికలాంగులు, ఆసరా లేని అభాగ్యులంతా నెలవారీ పెన్షన్ల కోసం ఎదురుచూసే పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. ఫిబ్రవరి నెల నడుస్తున్నా నేటికీ జనవరి నెలకు సంబంధించిన పెన్షన్లను ఖాతాల్లో ఎందుకు జమ చేయలేదని ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లాతో పాటు పలు జిల్లాల్లో పెన్షన్లు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
“చేయూత” పథకం ద్వారా గత డిసెంబర్ నెల నుండే 4 వేల రూపాయల పెన్షన్ ఇస్తామని హామీలు గుప్పించి ఇప్పుడేమో సమయానికి కనీసం 2 వేల రూపాయలు కూడా ఇవ్వడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. 200 రూపాయలున్న పెన్షన్ ను 2 వేల రూపాయలుగా పెంచి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసరా కల్పించారని గుర్తు చేశారు. ఈ పెన్షన్ డబ్బులతోనే నెలవారీ సరుకులు, మందులకు, వైద్య ఖర్చులకు, ఇతర అవసరాలకు వినియోగించుకున్నారని చెప్పారు. ప్రస్తుతం పెన్షన్ డబ్బులు ఆలస్యం కావడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని హరీష్ రావు మండిపడ్డారు.
గడిచిన పదేళ్ళలో పెన్షన్ డబ్బుల కోసం లబ్ధిదారులు రోడ్డెక్కి ఆందోళనలు చేసిన సంఘటనలు లేవన్నారు హరీష్ రావు. కేవలం రెండు నెలల వ్యవధిలోనే పెన్షన్లను సమయానికి ఇవ్వకుండా దాటవేస్తున్నారని విమర్శించారు. తక్షణమే జనవరి, ఫిబ్రవరి నెలలకు సంబంధించిన పెన్షన్ డబ్బులను ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..