BJP: కరీంనగర్‌ కాషాయ దళంలో కలవరం.. బండి సంజయ్ సొంత ఇలాకాలో అసమ్మతి రాగం!

Telangana BJP: తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బండిని నడపగలడన్న నమ్మకంతో... బండి సంజయ్‌ మీద అధిష్టానం పెద్ద బాధ్యతలే పెట్టింది. కానీ, ఇప్పుడు ఆయన సొంత ఇలాకాలో అసమ్మతి రేగడం కలకలం సృష్టిస్తోంది.

BJP: కరీంనగర్‌ కాషాయ దళంలో కలవరం..  బండి సంజయ్ సొంత ఇలాకాలో అసమ్మతి రాగం!
Bjp Leaders
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 17, 2022 | 8:51 PM

 Rebellion against Bandi Sanjay: తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బండిని నడపగలడన్న నమ్మకంతో… బండి సంజయ్‌ మీద అధిష్టానం పెద్ద బాధ్యతలే పెట్టింది. కానీ, ఇప్పుడు ఆయన సొంత ఇలాకాలో అసమ్మతి రేగడం.. నేతలు రహస్య మీటింగులు పెట్టుకోవడం కమలం పార్టీలో కలకలానికి కారణమవుతోంది. ఇంతకీ ఎవరానేతలు? ఏమా కథ? అని తెలుసుకునే పనిలో ఉంది కాషాయం హైకమాండ్‌.

తెలంగాణ బీజేపీకి జోష్‌ తెచ్చిన కరీంనగర్‌ కాషాయ దళం.. రెండుగా చీలడం అధిష్టానానికి కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టింది. ఎప్పుడూ అంతర్గత అసంతృప్తి బయటపడకుండా జాగ్రత్తపడే బీజేపీని.. రాష్ట్ర పార్టీఅధ్యక్షుడు బండిసంజయ్‌కి వ్యతిరేకంగా కొందరు నేతలు కరీంనగర్‌లో రహస్య మీటింగ్‌లు పెట్టారన్న వార్త ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది. ఆ నేతలు బండిసంజయ్ తీరును వ్యతిరేకిస్తూ… మూడుసార్లు మీటింగులు పెట్టడంతో పాటు మద్దతుగా కూడగట్టే ప్రయత్నం చేయడంతో… విషయం ఢిల్లీకి చేరింది.

పార్టీ సీనియర్లు సుగుణాకర్ రావు, గుజ్జుల రామకృష్ణరెడ్డి, అర్జున్ రావు, రమణా రెడ్డిలతోపాటు మరికొంతమంది.. కరీంనగర్‌లో పదే పదే రహస్య భేటీలు నిర్వహించి సంజయ్ తీరును తప్పుబడుతున్నారు. ఆ మీటింగ్‌లో సంజయ్‌పై దూషణలకు దిగడం.. ఆధారాలతో సహా పార్టీ దృష్టికి వచ్చింది. ఈ విషయం ఢిల్లీ పెద్దలకు తెలియడంతో.. దీనికి వెనుక ఎవరి హస్తం ఉందో తెలుసుకోవాలని నిర్ణయించారు. ఆరా తీయాలని.. సీనియర్‌ నేత ఇంద్రసేనారెడ్డికి కేంద్ర పార్టీ నుంచి ఆదేశాలు వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో సదరు నేతలపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం.

కరీంనగర్ తో పాటు నిజామాబాద్ జిల్లా నేతల తీరుపైనా కమలం పార్టీలో చర్చ జరుగుతోంది. పార్టీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణపై కూడా పార్టీ ఆగ్రహంతో ఉందనే టాక్‌ వినిపిస్తోంది. ఆయన తరుచూ.. ఎంపి ధర్మపురి అర్వింద్‌పై పరోక్ష ఆరోపణలు చేస్తుండటం దుమారం రేపుతోందట. దీనిపై ఫిర్యాదు అందడంతో లక్ష్మినారాయణను.. పార్టీ వివరణ కోరిన్నట్లు సమాచారం. అయితే, యెండల మాత్రం.. తనకు ఎలాంటి షోకాజ్ అందలేదని కొట్టి పారేస్తున్నారట.

ఈ రెండు జిల్లాల నేతల తీరుపై పూర్తి వివరాలతో.. ఢిల్లీకి నివేదిక పంపేందుకు కసరత్తు చేస్తోంది రాష్ట్ర పార్టీ. ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ.. సంహించేది లేదని హెచ్చరిస్తోంది. ఇలాంటివి మొదట్లోనే… అణచివేయకపోతే నష్టం తప్పదని భావిస్తున్న కమలం పార్టీ.. కఠినంగానే వ్యవహరించాలని నిర్ణయించింది.

Read Also… Akhilesh Yadav: తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని రాజకీయ యాత్ర సాగిస్తున్న అఖిలేష్ యాదవ్ ప్రస్థానం..!