AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akhilesh Yadav: తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని రాజకీయ యాత్ర సాగిస్తున్న అఖిలేష్ యాదవ్ ప్రస్థానం..!

అఖిలేష్ యాద‌వ్ స‌మాజ్‌వాదీ పార్టీ అధ్యక్షులు. ఉత్త‌ర్ ప్ర‌దేశ్ రాష్ట్రానికి ఆయ‌న 20 వ ముఖ్య‌మంత్రిగా ప‌ని చేశారు.

Akhilesh Yadav: తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని రాజకీయ యాత్ర సాగిస్తున్న అఖిలేష్ యాదవ్ ప్రస్థానం..!
Akhilesh Yadav
Balaraju Goud
|

Updated on: Jan 17, 2022 | 8:14 PM

Share

Akhilesh Yadav full profile: అఖిలేష్ యాద‌వ్ స‌మాజ్‌వాదీ పార్టీ అధ్యక్షులు. ఉత్త‌ర్ ప్ర‌దేశ్ రాష్ట్రానికి ఆయ‌న 20 వ ముఖ్య‌మంత్రిగా ప‌ని చేశారు. ఆయన తండ్రి యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ నుంచి వారసత్వ రాజకీయాలను అంది పుచ్చుకుని, రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఒక ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు.

జూలై 1, 1973న ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలో ఉన్న సైఫాయ్ గ్రామంలో జన్మించారు అఖిలేష్ యాదవ్. ములాయం సింగ్ యాదవ్ , మాల్తీ దేవి దంపతుల ముద్దు బిడ్డ అఖిలేష్ యాదవ్. ఆ పిల్లవాడు పెద్దయ్యాక, ప్రజలు అతన్ని ప్రేమగా టిప్పు అని పిలిచుకునేవారు. టిప్పు చిన్నతనంలో సైన్యంలో చేరాలనుకున్నాడు, కాని సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) రాజకీయ వారసత్వం అతడికి ఎదురుగా నిలిచి ఇక్కడి నుంచి సుల్తాన్ కావాలనే టిప్పు యాత్రను ప్రారంభించింది. అఖిలేష్ యాదవ్.. 38 సంవత్సరాల వయస్సులో, దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అయ్యారు. ఉత్తరప్రదేశ్‌కు అత్యంత పిన్న వయస్కుడైన ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు.

విద్యాభ్యాసం..

అఖిలేష్ యాదవ్ ప్రాథమిక విద్యాభ్యాసం ఇటావాలోని సెయింట్ మేరీస్ స్కూల్‌లో జరిగింది. దీని తరువాత, అతను రాజస్థాన్‌లోని ధోల్‌పూర్ మిలిటరీ స్కూల్‌లో తన తదుపరి విద్యను అభ్యసించాడు. అతను మైసూర్ విశ్వవిద్యాలయం నుండి ఇంజనీరింగ్ డిగ్రీని పొందాడు. ఆ తర్వాత తదుపరి చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లారు. అక్కడ సిడ్నీ యూనివర్సిటీ నుంచి ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ చేశారు. చదువు ముగించుకుని భారతదేశానికి తిరిగి వచ్చి తన తండ్రి ములాయం సింగ్ దగ్గర రాజకీయాలు నేర్చుకున్నారు అఖిలేష్ యాదవ్ 1999 నవంబర్ 24న డింపుల్ యాదవ్‌ను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చిన అఖిలేష్ యాదవ్ 2000లో తొలి ఎన్నికల్లో పోటీ చేశారు. లోక్‌సభ ఉప ఎన్నికలో, అఖిలేష్ యాదవ్ సమాజ్ వాదీ పార్టీ (SP) టిక్కెట్‌పై కన్నౌజ్ స్థానం నుండి పోటీ చేసి, గెలిచి లోక్‌సభకు చేరుకున్నారు.

వరుసగా మూడు లోక్‌సభ ఎన్నికల్లో విజయం

2000లో తొలి ఎన్నికల్లో గెలిచిన అఖిలేష్ యాదవ్ 2004 లోక్ సభ ఎన్నికల్లో రెండోసారి కూడా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లోనూ అఖిలేష్ యాదవ్ విజయం సాధించారు. అదే సమయంలో, 2009 లోక్‌సభలో విజయం సాధించడం ద్వారా అఖిలేష్ హ్యాట్రిక్ విజయం సాధించారు. కన్నౌజ్‌తో పాటు, అఖిలేష్ యాదవ్ 2009లో ఫిరోజాబాద్ నుంచి కూడా పోటీ చేశారు. అయితే, ఆ తర్వాత ఫిరోజాబాద్ సీటును వదిలేశారు.

2012 అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేష్ అద్భుతం

2012 అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ 224 సీట్లు గెలుచుకుని సంపూర్ణ మెజారిటీ సాధించింది. క్రెడిట్ మొత్తం అఖిలేష్ యాదవ్ వ్యూహానికే దక్కుతుంది. 10 మార్చి 2012న ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ నాయకుడిగా అఖిలేష్ యాదవ్ ఎన్నికయ్యారు. దీని తరువాత, మార్చి 15 న, అఖిలేష్ యాదవ్ 38 సంవత్సరాల వయస్సులో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. మాయావతి తర్వాత ఐదేళ్ల పదవీకాలం పూర్తయ్యేలా ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత, ఆయన 3 మే 2012న కన్నౌజ్ లోక్‌సభ స్థానానికి రాజీనామా చేశారు. దీని తర్వాత, 5 మే 2012న, అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడిగా మారారు.

2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు

2017 అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్ గాంధీతో అఖిలేష్ యాదవ్ చేతులు కలిపారు. కానీ అది పెద్దగా ప్రభావం చూపలేదు. సమాజ్‌వాదీ పార్టీ కేవలం 47 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగితే, 100 సీట్లకు పైగా పోటీ చేసిన కాంగ్రెస్ కేవలం ఏడు సీట్లకే పరిమితమైంది. ఈ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీకే భారీ నష్టం వాటిల్లింది. ఫలితంగా చాలా గ్యాప్ తర్వాత బీజేపీ రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోగలిగింది.

2019 లోక్‌సభ ఎన్నికల్లో విజయం

అఖిలేష్ యాదవ్ 2019 లోక్‌సభ ఎన్నికల్లో అజంగఢ్ నుంచి పోటీ చేశారు. నాలుగోసారి గెలిచి పార్లమెంటుకు చేరుకున్నారు. ఆయన బీజేపీ నేత, భోజ్‌పురి సినిమా సూపర్ స్టార్ దినేష్ లాల్ యాదవ్ నిర్హువాపై ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్‌కు 621578 ఓట్లు రాగా, బీజేపీకి చెందిన నిర్హువాకు 361704 ఓట్లు వచ్చాయి.

మరోసారి సీఎం సీటుపై కన్ను

ప్రస్తుతం అఖిలేష్ యాదవ్ 2022 అసెంబ్లీ ఎన్నికల సన్నాహాల్లో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. తాను ప్రతి ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో బీజేపీని అధికారం నుంచి కూల్చివేయడమే లక్ష్యమని ఆయన పేర్కొంటున్నారు. ఇది ఎన్నికలలో మాత్రమే తెలుస్తున్నప్పటికీ, దీని కోసం అతను RLD సహా అనేక చిన్న, ప్రాంతీయ పార్టీలతో జతకట్టారు. భారతీయ జనతాపార్టీని ఓడించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు.

Read Also… UP Elections: మరోసారి తెరపైకి కుల ప్రాతిపదికన జనాభా గణన.. అధికారంలోకి రాగానే చేపడతామన్న అఖిలేష్