Bhongir Politics: భువనగిరిలో బీజేపీ బీసీ అస్త్రం.. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు సంకటంగా మారానుందా..?

లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించి, నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్న భారతీయ జనతా పార్టీ ప్రత్యేక వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఎంపీ అభ్యర్థుల ఎంపికలో బీజేపీ అన్ని అస్త్రాలకు పదును పెడుతోంది. ఈ క్రమంలోనే భువనగిరి లో్క్‌సభ నియోజకవర్గంలో బీజేపీ బీసీ అస్త్రాన్ని ప్రయోగించి, బీఆర్ఎస్, కాంగ్రెస్‌‌లకు సవాల్ విసిరింది.

Bhongir Politics: భువనగిరిలో బీజేపీ బీసీ అస్త్రం.. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు సంకటంగా మారానుందా..?
Boora Narsaiah Goud
Follow us
M Revan Reddy

| Edited By: Balaraju Goud

Updated on: Mar 04, 2024 | 10:25 AM

లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించి, నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్న భారతీయ జనతా పార్టీ ప్రత్యేక వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఎంపీ అభ్యర్థుల ఎంపికలో బీజేపీ అన్ని అస్త్రాలకు పదును పెడుతోంది. ఈ క్రమంలోనే భువనగిరి లో్క్‌సభ నియోజకవర్గంలో బీజేపీ బీసీ అస్త్రాన్ని ప్రయోగించి, బీఆర్ఎస్, కాంగ్రెస్‌‌లకు సవాల్ విసిరింది. భువనగిరిలో బీజేపీ బీసీ అభ్యర్థిగా బూర నర్సయ్య గౌడ్ ఎంపిక, కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు సంకటంగా మారింది. దీంతో ఆ రెండు పార్టీల్లో బీసీ గళం గట్టిగా వినిపిస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు కూడా బీసీ అభ్యర్థులనే బరిలోకి దింపుతాయా..? భువనగిరి పార్లమెంటు అభ్యర్థుల ఎంపికలో ఏం జరుగుతోంది. అన్నదీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

భువనగిరిలో బీజేపీ బీసీ అస్త్రం..

భువనగిరి పార్లమెంట్‌పై బీజేపీ బీసీ అస్త్రాన్ని ప్రయోగించింది. ఆ పార్టీ హైకమాండ్ ప్రకటించిన తొలి జాబితాలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌కు చాన్స్‌ ఇచ్చింది. అయితే ఇక్కడి నుంచి పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగడి మనోహర్ రెడ్డి, పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు పీవీ శ్యాసుందర్ రావు టికెట్ కోసం గట్టిగానే ప్రయత్నించారు. కానీ, మునుగోడు ఉపఎన్నికల సమయంలో ఎంపీ టికెట్‌ హామీతో బీజేపీలో చేరిన బూర వైపే హైకమాండ్ మొగ్గు చూపింది. 2014లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి విజయం సాధించిన బూర.. 2019లో ఓటమి పాలయ్యారు.

బీసీ నియోజకవర్గంగా భువనగిరి..

భువనగిరి పార్లమెంటు పరిధిలో జనగామ, ఆలేరు, తుంగతుర్తి, మునుగోడు, నకిరేకల్, భువనగిరి, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో తుంగతుర్తి, నకిరేకల్‌లో ఎస్సీ సామాజికవర్గ ఓట్లు అత్యధికంగా ఉండగా, మిగతా నియోజకవర్గాల్లో మాత్రం బీసీల ఓట్ల శాతం అత్యధికంగా ఉంటాయి. బీసీ వర్గాలైన కురుమ, గొల్ల, గౌడ, ముదిరాజ్, పద్మశాలి ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ పరిధిలో ఒక్క జనగామ తప్పా, మిగతా అన్నింటిలోనూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలుపొందారు. ఏడు స్థానాలకు గాను కేవలం ఒక్క స్థానంలో మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది. ప్రస్తుతం భువనగిరి పార్లమెంటు స్థానం కాంగ్రెస్ కు సిట్టింగ్ స్థానంగా ఉంది.

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరాన్ని ఆనుకుని ఉన్న భువనగిరి పార్లమెంటుపై బీజేపీ ఫోకస్ పెంచింది. నియోజకవర్గంలో బీజేపీ బలం నామమాత్రమే. ఇక్కడ రెడ్డి సామాజిక వర్గానిదే ఆధిపత్యం ఉన్నప్పటికీ, బీజేపీ మాత్రం బీసీ ఆస్త్రాన్ని ప్రయోగించింది. ప్రధాని మోదీ చరిష్మా, అయోధ్యలో రామ మందిర నిర్మాణం కలిసి వస్తుందని ఆ పార్టీ పెద్దలు భావిస్తున్నారు.

ప్రత్యర్థులకు సవాల్ విసిరిన బీజేపీ..

బీజేపీ అభ్యర్థిగా బూర నర్సయ్య గౌడ్‌ను ప్రకటించడం ద్వారా బీఆర్ఎస్, కాంగ్రెస్‌ పార్టీలకు బీజేపీ సవాల్ విసిరింది. బీజేపీ అభ్యర్థిగా బూర ఎంపికతో తెరపైకి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్‌లలో బీసీ గళం గట్టిగానే వినిపిస్తోంది. కాంగ్రెస్‌కు కంచుకోట ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెడ్డి సామాజిక వర్గ ఆధిపత్యమే. అయినప్పటికీ ఈసారి భువనగిరి సీటును తమకు కేటాయించాలని బీసీ కాంగ్రెస్ నేతలు గళమెత్తుతున్నారు. భువనగిరి ఎంపీ టికెట్‌ రేసులో సీఎం రేవంత్‌రెడ్డి అనుచరుడు, టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి భువనగిరి టికెట్ నాదే అంటున్నారు. సీనియర్ నేత జానారెడ్డి అనుచరుడు ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిషత్ చైర్మన్ కసిరెడ్డి నారాయణరెడ్డి కూడా ఎంపీ టికెట్ ను ఆశిస్తున్నారు. కోమటిరెడ్డి కుటుంబానికి చెందిన సూర్య పవన్ రెడ్డి కూడా టికెట్ కోరుతున్నారు. ఈ దఫా బీసీ కోటాలో సూర్యాపేట డిసిసి అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ ఎంపీ రేసులో ఉన్నారు. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా కొనసాగుతున్న వెంకన్న కూడా టికెట్ ఆశిస్తున్నారు. మరోవైపు బీసీ నినాదంతో మునుగోడు నియోజక వర్గానికి చెందిన పున్న కైలాస్ నేత, రాష్ట్ర మున్సిపల్‌ చైర్మన్స్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు వెన్‌రెడ్డి రాజు, తీన్మార్‌ మల్లన్న తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు.

భువనగిరి ఎంపీ టికెట్ కోసం బీఆర్ఎస్‌లోని పలువురు ముఖ్యనేతలు ప్రయత్నిస్తున్నారు. శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి టికెట్ ను ఆశిస్తున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్, అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీలో చేరిన తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి, డాక్టర్ చెరుకు సుధాకర్ సైతం టికెట్ ఆశిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరిన మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కూడా ఈ టికెట్ కోసం ఆశలు పెట్టుకున్నారు. మాజీ కార్పొరేషన్ ఛైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ తో పాటు మరికొందరు నేతలు కూడా ఈ టికెట్ కోసం పావులు కదుపుతున్నారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ లలో బీసీ గళం..

బీజేపీ.. భువనగిరి పార్లమెంటు టికెట్ ను బీసీ అభ్యర్థికి ఇవ్వడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో బీసీలకే కేటాయించాలంటూ డిమాండ్ వినిపిస్తోంది. బీసీ కార్డుతో బీజేపీ బరిలో ఉండడంతో ఎవరిని ఖరారు చేయాలి..? ఎవరికి టికెట్ ఇస్తే గెలుపు అవకాశాలు బలంగా ఉంటాయి..? వంటి పలు అంశాలపై లెక్కలు వేసుకునే పనిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లు పడ్డాయట. భువనగిరిలో బీజేపీ బీసీ అస్త్రాన్ని ప్రయోగించడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు సంకటంగా మారిందట. మొత్తంగా కీలక నేతలు భువనగిరి టికెట్ ఆశిస్తున్న నేపథ్యంలో… కాంగ్రెస్, బీఆర్ఎస్ లు కూడా బీసీ అస్త్రాన్ని ప్రయోగించాలని భావిస్తున్నాయట.

బీఆర్ఎస్ గత రెండు ఎన్నికల్లో కూడా బీసీ అభ్యర్థికి టికెట్ ఇచ్చింది. గతంలో కాంగ్రెస్.. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారినే బరిలోకి దించింది. ఈ సారి కూడా బీఆర్ఎస్ బీసీలకు టికెట్ కేటాయిస్తుందో అన్నదీ చర్చనీయాంశంగా మారింది. మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కాంగ్రెస్.. బీసీ కార్డును ప్రయోగిస్తుందో లేదో చూడాలి..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి