AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP – TG CM Meet: విభజన సమస్యలే అజెండా.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి సర్వం సిద్ధం..!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన జరిగి పదేళ్లయిపోయింది. అయినా విభజన చట్టం ప్రకారం జరగాల్సిన పంపకాలు మాత్రం పూర్తి కాలేదు. తాజాగా, ఇదే అంశంపై ఏపీ సీఎం చంద్రబాబు.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి భేటీ అవుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పుడు రాజకీయంగానూ ఇది హాట్‌ టాపిక్‌గా మారింది.

AP - TG CM Meet: విభజన సమస్యలే అజెండా.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి సర్వం సిద్ధం..!
Chandrababu Revanth Reddy Meet
Balaraju Goud
|

Updated on: Jul 05, 2024 | 5:22 PM

Share

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన జరిగి పదేళ్లయిపోయింది. అయినా విభజన చట్టం ప్రకారం జరగాల్సిన పంపకాలు మాత్రం పూర్తి కాలేదు. తాజాగా, ఇదే అంశంపై ఏపీ సీఎం చంద్రబాబు.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి భేటీ అవుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పుడు రాజకీయంగానూ ఇది హాట్‌ టాపిక్‌గా మారింది.

విభజన అంశాలపై చర్చించుకుందామంటూ… తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాయడం.. అందుకు సీఎం రేవంత్ రెడ్డి సరే అంటూ ముహూర్తం ఖరారు కావడం ఆసక్తి రేపుతోంది. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జూలై7 శనివారం సాయంత్రం 6గంటలకు హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం కానున్నారు. విభజనకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ముఖ్యమంత్రులు భేటీ కావడం ఇదే మొదటి సారి. ప్రధానంగా షెడ్యూల్‌ 9, షెడ్యూల్‌ 10లో విభజన పూర్తి కాని సంస్థలపై చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

ఈ సమావేశంపై తెలంగాణ సీఎం రేవంత్ కసరత్తు చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి హైలెవెల్ మీటింగ్ నిర్వహించారు సీఎం రేవంత్. రాష్ట్ర విభజన తర్వాత ప్పటికీ అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై ఆరా తీశారు. తెలంగాణ హక్కులకు భంగం కలగకుండా.. రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్‌ సమస్యలను పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. రెండు రాష్ట్రాలు షేర్‌ చేసుకోవాల్సిన ఉమ్మడి ఆస్తులు.. తెలంగాణ స్వాధీనం చేసుకోవాల్సిన ఆస్తులపైనా ఇప్పటికే మంత్రులు ఆయా శాఖల అధికారులతో ఇప్పటికే చర్చించారు.

ప్రధానంగా షెడ్యూలు 9, షెడ్యూలు 10లో ఉన్న సంస్థల విభజనపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విద్యుత్తు సంస్థలకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య బకాయిలపై చర్చించే అవకాశముంది. దాదాపు రూ.24 వేల కోట్లు ఏపీ ప్రభుత్వం తెలంగాణకు చెల్లించాల్సి ఉంది. కానీ.. రూ.7 వేల కోట్లు మాత్రమే తెలంగాణ తమకు చెల్లించాల్సి ఉందని ఏపీ పట్టుబడుతోంది. ఇక, కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత విభజనకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు.

మార్చి నెలలో సీఎం చొరవతో ఢిల్లీలో ఏపీ భవన్ కు సంబంధించిన విభజన వివాదం పరిష్కారమైంది. ఇటీవలే మైనింగ్ కార్పొరేషన్‌కు సంబంధించిన నిధుల పంపిణీకి పడిన చిక్కుముడి కూడా వీడిపోయింది. ఇప్పటి వరకు విభజన వివాదాలపై రెండు రాష్ట్రాల అధికారుల మధ్య దాదాపు 30 సమావేశాలు జరిగాయి. షెడ్యూలు 9లో ఉన్న మొత్తం 91 సంస్థలు ఆస్తులు, అప్పులు, నగదు నిల్వల పంపిణీపై కేంద్ర హోం శాఖ షీలాబీడే కమిటీని వేసింది. వీటిలో 68 సంస్థలకు సంబంధించిన పంపిణీకి అభ్యంతరాలేమీ లేవు. మిగతా 23 సంస్థల పంపిణీపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. పదో షెడ్యూలులో ఉన్న 142 సంస్థల్లో తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ వంటి 30 సంస్థల పంపిణీపై ఇంకా వివాదాలున్నాయి. వీటన్నింటికి ఇద్దరు ముఖ్యమంత్రి సమావేశంలో స్పష్టత రానుంది.

కృష్ణా జలాల పంపిణీ, కోర్టుల్లో ఉన్న పిటిషన్లను వెనక్కి తీసుకోవడం, భద్రాచలం మండలంలోని ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణకు ఇవ్వడం, పలు ఉమ్మడి సంస్థల ఆస్తులు, అప్పుల పంపిణీలో నెలకొన్న ప్రతిష్టంభన, రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజన.. ఇలాంటి అనేక విషయాలు ఈ చర్చల్లో ప్రధాన అంశాలుగా ఉండనున్నట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా రెండు రాష్ట్రాల మధ్య వివాదాలను క్లియర్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఉన్న ఇద్దరు సీఎంలు… ఈభేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

కాగా, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీని పలు రాజకీయ పార్టీల నేతలు స్వాగతించారు. రెండు రాష్ట్రాల ప్రజల సమస్యలపై చర్చించడం మంచి పరిణామమన్నారు. సమస్యల పరిష్కారానికి తప్ప మరో మార్గం లేదన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..