Munugode By Poll: మునుగోడులో మునిగేదెవరూ.. తేలేదేవరు.. ప్రజాభిప్రాయం ఇదేనా..?

తెలంగాణ రాజకీయాల్లో మునుగోడు ఉప ఎన్నికల అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేవలం ఉప ఎన్నిక మాత్రమే అయినా.. సాధారణ ఎన్నికల కంటే ఎక్కువ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ఇక్కడి గెలుపును ప్రధాన పార్టీలు. మునుగోడు శాసనసభా స్థానం నుంచి..

Munugode By Poll: మునుగోడులో మునిగేదెవరూ.. తేలేదేవరు.. ప్రజాభిప్రాయం ఇదేనా..?
Munugode Bypoll
Follow us

|

Updated on: Oct 22, 2022 | 8:58 AM

తెలంగాణ రాజకీయాల్లో మునుగోడు ఉప ఎన్నికల అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేవలం ఉప ఎన్నిక మాత్రమే అయినా.. సాధారణ ఎన్నికల కంటే ఎక్కువ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ఇక్కడి గెలుపును ప్రధాన పార్టీలు. మునుగోడు శాసనసభా స్థానం నుంచి 2019లో కాంగ్రెస్ పార్టీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్రంలో టీఆర్ ఎస్ అధికారంలోకి రావడంతో మునుగోడు అభివృద్ధిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, నిధులు ఇవ్వడం లేదంటూ.. తన నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నా అంటూ.. తన ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేసి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారు. దీంతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యం అయింది. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీచేయడంతో నవంబర్ 3వ తేదీన పోలింగ్ జరగనుంది. ఇప్పటికే నామినేషన్ల ఉప సంహరణ ప్రక్రియ ముగిసి.. ప్రచారంలో అన్ని పార్టీల నాయకులు నిమగ్నమయ్యారు. రోజుకో వ్యూహాంతో అన్ని రాజకీయపార్టీలు ముందుకెళ్తున్నాయి. సాధారణ ఎన్నికల సమయంలో నాయకులు పార్టీలు మారడం సర్వసాధారణం, తమకు టికెట్లు రాలేదనో, లేదా పార్టీపై అసంతృప్తితో పార్టీలు మారుతుంటారు. కాని మునుగోడు ఉప ఎన్నిక వేళ ఆపరేషన్ ఆకర్ష్ ఊపందుకుంది. పార్టీల మార్పు రాజకీయం వేగం పుంజుకుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు టీఆర్ ఎస్, బీజేపీలో చేరుతుండగా, టీఆర్ ఎస్ నాయకులు బీజేపీలో, బీజేపీ నాయకులు టీఆర్ ఎస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకులంతా మునుగోడు నియోజకవర్గంలో మకాం వేసి తమ పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, నరేంద్రమోదీ విధానాలను టార్గెట్ చేస్తూ టీఆర్ ఎస్, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకుని బీజేపీ మాటల యుద్ధం కొనసాగుతోంది. వాస్తవానికి బీజేపీ, టీఆర్ ఎస్ తో పోలిస్తే మిగిలిన పార్టీలు ప్రచారంలో కొంత వెనుకబడి ఉన్నాయని క్షేత్రస్థాయి పరిస్థితుల ఆధారంగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇటీవల కాలంలో దుబ్బాక, హుజురాబాద్, నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరిగినా వాటికి, మునుగోడుకు చాలా తేడా ఉంది. మిగతా చోట్ల వివిధ కారణాల వల్ల ఉప ఎన్నిక రాగా, మునుగోడులో మాత్రం బీజేపీ ఉప ఎన్నికను కోరి తెచ్చుకుందనే చెప్పాలి. దీంతో ఆ పార్టీకి, వ్యక్తిగతంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఈ ఎన్నిక ఎంతో ప్రతిష్టాత్మకం. మరోవైపు టీఆర్ ఎస్ పార్టీకి కూడా మునుగోడు ఉప ఎన్నిక ఓ సవాలు అనే చెప్పుకోవాలి. మునుగోడు సీటు తమ సిట్టింగ్ స్థానం కాదని, గెలిస్తే తమకు ఒక ఎమ్మెల్యే పెరుగుతారని, ఓడిపోయినా మాకు నష్టం లేదని పైకి టీఆర్ ఎస్ నాయకులు చెబుతున్నారు. అయినా తెలంగాణలో ఎన్నో అభివృద్ధి పధకాలు అమలు చేస్తున్నామని, దేశంలో ఏ ఇతర రాష్ట్రాల్లో లేని సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని టీఆర్ ఎస్ చెబుతూ వస్తోంది. కాని ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని బీజేపీ, కాంగ్రెస్ విమర్శిస్తున్నాయి. సంక్షేమానికి ప్రజలు ఓటు వేస్తారా లేదా అనేది ఈ ఎన్నిక ద్వారా తెలనుంది. మరో ఏడాదిలో తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఉప ఎన్నిక కావడంతో ఈ గెలుపు ప్రభావం తెలంగాణ మొత్తం ఉండవచ్చనే అభిప్రాయంలో అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. దీంతో మునుగోడులో మునిగేదెవరు, తేలేదెవరు అనేదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

టీఆర్ ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. అదే రాజగోపాల్ రెడ్డి ప్రస్తుతం బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. టీఆర్ ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నమ్ముకున్నారు. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ప్రజల్లో సానుభూతి, అభిమానం రెండూ ఉన్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలోని పేద, మధ్య తరగతి ప్రజలు ఆపదలో ఉన్నామని, తమకు సాయం చేయాలని అడిగితే వెంటనే స్పందించి లక్షల్లో సాయం చేసే వ్యక్తిగా రాజగోపాల్ రెడ్డికి పేరుంది. దీంతో వ్యక్తిగత ఇమేజ్ తనను గెలిపిస్తుందని రాజగోపాల్ రెడ్డి ఆశిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఒక వేళ బీజేపీ అభ్యర్థి గెలవకపోతే మాత్రం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి తప్పదనే చెప్పుకోవాలి. ఆయన రాజకీయ భవిష్యత్తుపై కూడా ఈ ఎన్నిక ఫలితం ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి మాత్రం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న క్షేత్రస్థాయి బలాన్నే నమ్ముకున్నారు. అయితే ఉప ఎన్నిక నోటిఫికేషన్ తర్వాత కాంగ్రెస్ పార్టీ గ్రామ, మండల స్థాయి క్యాడర్ చాలా మంది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెంట వెళ్లిపోయారనే ప్రచారం జరుగుతోంది. ఒక విధంగా దీనిలో కొంత వాస్తవం కూడా ఉంది. దీంతో కాంగ్రెస్ కు నియోజకవర్గంలో కొంత ఎదురుదెబ్బ అని చెప్పుకోవాలి. నియోజకవర్గంలో కీలకమైన నాయకులు కూడా టీఆర్ ఎస్, బీజేపీలో చేరడంతో హస్తం పార్టీ గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. వచ్చే ఏడాది జరగనున్న శాసనసభ ఎన్నికల దృష్ట్యా ఈ ఉప ఎన్నిక అన్ని రాజకీయ పార్టీలకు ఓ అగ్నిపరీక్ష అనే చెప్పుకోవాలి. తీవ్ర ఉత్కంఠ రేపుతున్న ఈ పోరులో ఎవరూ మునిగినా ఆ పార్టీకి కొంత నష్టమే.. విజయం సాధించిన పార్టీ మాత్రం విజయానందంతో మరింత దూకుడుగా రాజకీయం చేసే అవకాశం ఉంది.

ఎంతో ఆసక్తి రేపుతున్న మునుగోడు ఉప ఎన్నికలో ప్రజలు కూడా భిన్నాభిప్రాయాలతో ఉన్నారు. గతంతో పోలిస్తే ప్రజలు చైతన్యవంతులయ్యారు. సాధారణంగా పార్టీకి అభిమానులు, కార్యకర్తలు అయితే తప్పకుండా అదే పార్టీకి ఓటు వేస్తారు. కొన్ని సందర్భాల్లో వారి వైఖరి కూడా మారవచ్చు. ఇక గృహిణులు, వేతన జీవులు, సాధారణ ఉద్యోగులు, యువత ఎటువైపు మొగ్గు చూపుతారనేది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఎవరి అభిప్రాయాలను బయటకు చెప్పకపోయినప్పటికి క్షేత్రస్థాయిలో మాత్రం ప్రజలు భిన్నాభిప్రాయాలను కలిగి ఉన్నట్లు అర్థమవుతోంది. ఎప్పటినుండో కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వారు హస్తం పార్టీ వైపు ఉండగా, కాంగ్రెస్ పార్టీలో రాజగోపాల్ రెడ్డిని అభిమానించే వారు మాత్రం ఆయన వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. యువతలో మాత్రం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంచి క్రేజ్ ఉండటంతో పాటు.. చదువుకున్న యువత మాత్రం బీజేపీ అభ్యర్థి వైపు మొగ్గుచూపుతుండగా, కొంతమంది మహిళలు, రైతులు, సాధారణ ప్రజలు టీఆర్ ఎస్ వైపు ఉన్నారని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. నియోజకవర్గంలో సర్వే సంస్థలకు కూడా ప్రజల నాడిని పట్టుకోవడం కొంత కష్టంగానే ఉందన్న ప్రచారం జరుగుతోంది. రోజురోజుకు కూడా ప్రజల అభిప్రాయం మారుతుందనే ఓపినియన్ వ్యక్తమవుతోంది. ఈక్రమంలో నవంబర్ 3 వ తేదీన జరగనున్న మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ సమయానికి ప్రజలు తమ ఎమ్మెల్యేగా ఎవరిని ఎన్నుకుంటారనేది ఆసక్తిగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..