Ration Card: రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్‌న్యూస్.. ఇక నుంచి క్యూలైన్‌లో నిల్చోవాల్సిన అసవరం లేదు.. అందుబాటులోకి యాప్..
రేషన్ కార్డు ఉన్నవారికి భారీ గుడ్‌న్యూస్. ఇక మీరు రేషన్ షాపుకి వెళ్లి వివరాలు అడగాల్సిన అవసరం లేదు. ఇక యాప్ నుంచే మీరు అన్నీ వివరాలు తెలుసుకోవచ్చు. మీ రేషన్ కార్డు యాక్టివ్‌లో ఉందా..? ఇప్పటివరకు ఎన్ని సరుకులు తీసుకున్నారు? అనే వివరాలు తెలుసుకోవచ్చు.

ప్రజలు మొబైల్ నుంచి అన్నీ సేవలు పొందేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇటీవల మీ సేవ సేవలను ఇంటి నుంచే పొందేలా యాప్ తీసుకురాగా.. ఇక రైతులు మొబైల్ నుంచే యూరియా బుక్ చేసుకునేలా కొత్త యాప్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. టీ రేషన్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్‌లో రేషన్ కార్డుదారులు తమ సమాచారం మొత్తాన్ని చూడవచ్చు. తెలంగాణ పౌరసరఫరాల శాఖ ఈ యాప్ రూపొందించింది. ఈ యాప్ ద్వారా లాభాలేంటో ఇప్పుడు చూద్దాం.
మీకు ఎంత బియ్యం వస్తుంది..?
ఈ టీ-రేషన్ యాప్‌లో మీ రేషన్ వివరాలన్నీ చెక్ చేసుకోవచ్చు. బియ్యం కోటా వివరాలతో పాటు మీరు ఎంత రేషన్ తీసుకున్నారనే డీటైల్స్ చూడవచ్చు. ఇక మీకు కేటాయించిన రేషన్ డీలర్, షాప్ నెంబర్, షాప్ లొకేషన్ తెలసుకోవచ్చు. దీంతో పాటు మీ కుటుంబానికి ప్రతీ నెలా ఎంతవరకు బియ్యం, గోధుములు, ఇతర సరుకులు అందుతాయనేది చెక్ చేసుకోవచ్చు. ప్రభుత్వం మీకు ఎంత కేటాయించింది..? మీరు ఎంత అందుకున్నారు? అనే వివరాలు ప్రజలు తెలుసుకునేలా యాప్ రూపొందించారు. ఇక రేషన్ కార్డులో మీ కుటుంబ సభ్యుల వివరాలు తనిఖీ చేసుకోవడంతో పాటు ఎవరి ఆధార్ కార్డుతో లింక్ అయిందనే వివరాలు కూడా తెలుసుకోవచ్చు.
రేషన్ షాపుకు వెళ్లాల్సిన అవసరం లేదు
ఈ యాప్‌లోని వివరాలు తెలుగులోనే ఉంటాయి. దీంతో గ్రామీణ ప్రజలు కూడా సులువుగా చదవచ్చు. మీకు ఎంత రేషన్ వచ్చింది..? ఇప్పటివరకు ఎంత రేషన్ కేటాయించారు? అనే వివరాలను రేషన్ షాపుకు వెళ్లి డీలర్‌ను అడగాల్సిన అవసరం ఉండదు. మీ రేషన్ కార్డు యాక్టివ్‌లో ఉందా..? లేదా? అనే వివరాలు కూడా ఇందులో చూడవచ్చు. ఇలా రేషన్ కార్డుకు సంబంధించిన ప్రతీ విషయం ఈ యాప్‌లో చెక్ చేసుకోవచ్చు.
యాప్ ఎలా వాడాలి
గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి టీ రేషన్ అని సెర్చ్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ ఓపెన్ అయ్యాక రేషన్ కార్డు నెంబర్ లేదా ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత స్టాక్ రిపోర్ట్, అలోకేషన్ అనే ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిని క్లిక్ చేసి మీరు రేషన్ వివరాలు తెలుసుకోవచ్చు.




