Bharat Jodo Yatra: స్టైల్ మార్చిన రాహుల్ గాంధీ.. ఆ విమర్శలకు చెక్ పెట్టేందుకేనా.. కర్ణాటకలో సాగుతున్న పాదయాత్ర..
ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యతగా పార్టీ అధ్యక్షుడి పగ్గాల నుండి రాహుల్ గాంధీ తప్పుకున్నారు. 2024 ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని, ప్రభుత్వ వ్యతిరేక ఓటును తమ వైపు..
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నాయకత్వంపై ఎన్నో విమర్శలు ఉన్నాయి. రాజకీయం చేయడం తెలియదని, ప్రజాకర్షణ లేని నేతంటూ కొన్నేళ్లుగా ఎన్నో విమర్శలను రాహుల్ గాంధీ ఎదుర్కొంటూ వస్తున్నారు. 2019 సాధారణ ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. పార్టీ ప్రచార బాధ్యతలను ఆయన భుజం మీద వేసుకుని దేశం మొత్తం పర్యటించారు. ఫలితాలు హస్తం పార్టీకి సానుకూలంగా రాకపోవడంతో రాహుల్ గాంధీ నాయకత్వంపై ప్రజలకు విశ్వాసం లేదని బీజేపీ వంటి పార్టీలు ప్రచార వేగాన్ని పెంచాయి. మరోవైపు ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యతగా పార్టీ అధ్యక్షుడి పగ్గాల నుండి రాహుల్ గాంధీ తప్పుకున్నారు. 2024 ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని, ప్రభుత్వ వ్యతిరేక ఓటును తమ వైపు ఆకర్షించేందుకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టారు. ఇది సుదీర్ఘ యాత్రం దేశంలోని 12 రాష్ట్రాలను కవర్ చేస్తూ 3,500 కిలోమీటర్ల మేర పర్యటించేలా ఈ పాదయాత్రను ప్లాన్ చేయగా, సెప్టెంబర్ 7వ తేదీన తమిళనాడులోని కన్యాకుమారి నుంచి భారత్ జోడో యాత్రను ప్రారంభించారు. ఇప్పటికి నెలా పదిహేను రోజుల యాత్ర పూర్తైంది. మూడు రాష్ట్రాల్లో యాత్ర పూర్తై కర్ణాటకలో సాగుతోంది. మరి కొద్దిరోజుల్లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో ఎంటర్ కానుంది.
ఇతర పార్టీల విమర్శలకు చెక్ పెట్టేందుకే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టినట్లు ఆయన పాదయాత్ర సాగుతున్న తీరును చూస్తే అర్థమవుతోంది. రాహుల్ గాంధీ ప్రజల్లో లేని వ్యక్తి అనే విమర్శ ఎప్పటినుంచో ఉంది. ఈ ప్రశ్నకు సమాధానం కూడా రాహుల్ గాంధీ పాదయాత్ర ద్వారా చెబుతున్నారనే అనుకోవాలి. ప్రతి రోజూ వేలాది మంది ప్రజల మధ్య పాదయాత్ర చేస్తున్నారు రాహుల్ గాంధీ. అనేక అంశాలపై మాట్లాడటంతో పాటు, వివిధ వర్గాల ప్రజలతో మమేకమవుతున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. బీజేపీతో పాటు తనను విమర్శించే అన్ని పార్టీలకు సరైన జవాబు ఇవ్వడం కోసం రాహుల్ గాంధీ గతంతో పోలిస్తే పూర్తిగా తన శైలిని మార్చుకున్నారనే చెప్పుకోవాలి. ప్రజలతో మమేకమవడం, ప్రజలను కలవడంతో పాటు రాత్రి సమయాల్లో లగ్జరీ హోటల్స్ లో కాకుండా ఆయన కోసం ఏర్పాటు చేసుకున్న కంటెయినర్ లో నిద్ర పోవడం ద్వారా తాను సాధారణమైన మనిషినని, ప్రజల కష్టాలు తెలుసుకునేందుకే ప్రజల్లోకి వచ్చి ప్రజల మధ్యలో ఉంటున్నాననే సంకేతమివ్వడం కోసం తన పాదయాత్రను ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటివరకు కాంగ్రెస్ శ్రేణులు ఎంతో నిరుత్సాహంగా ఉన్నారు. అధినాయకత్వం బలంగా లేదనే ఆలోచనలో పార్టీ శ్రేణులు ఉన్నారు. ఇలాంటి వారిలో ఇప్పుడు రాహుల్ గాంధీ తన పాదయాత్రతో ఉత్సహం నింపుతున్నారు. కొంత కాలంగా పార్టీకి దూరంగా ఉన్నవారిని మళ్లీ పార్టీలోకి తీసుకొచ్చేందుకు రాహుల్ గాంధీ పాదయాత్ర ఉపయోగపడుతుందని పార్టీ క్యాడర్ భావిస్తోంది. ఈ పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ తిరిగి పుంజుకుంటోందనే ఆలోచనలోనూ హస్తం పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టడంతో పాటు.. పాదయాత్ర ద్వారా ప్రతిరోజూ వార్తల్లో ఉండటంతో పాటు.. ప్రజలందరిలో రాజకీయ చర్చ జరగడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో 3,500 కిలోమీటర్ల పాదయాత్రకు రాహుల్ గాంధీ శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. మరి రాహుల్ గాంధీ వూహించినట్లు తన లక్ష్యాన్ని చేరుకుంటారా లేదా అనేది వచ్చే ఎన్నికల ఫలితాలు తేల్చనున్నాయి. మరోవైపు తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ లో పూర్తైన భారత్ జోడో యాత్ర కర్ణాటకలోని తెలుగువారు ఎక్కువుగా ఉండే రాయచూరు ప్రాంతంలో కొనసాగుతోంది. కర్ణాటకలో యాత్ర ముగిసిన తర్వాత రాహుల్ గాంధీ తెలంగాణలోకి ప్రవేశిస్తారు.
నేటి భారత్ జోడో యాత్ర షెడ్యూల్
ఉదయం 6గంటలకు రాయచూరులోని యెరగేరా గ్రామం నుంచి పాదయాత్రను ప్రారంభించారు. సాయంత్రం 5.30 గంటలకు బసవేశ్వరా సర్కిల్ గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. రాత్రి ఏంగూరులో రాహుల్ గాంధీ బస చేస్తారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..