Drunk and Drive: మళ్లీ యాక్షన్ సీన్‌లోకి సైబరాబాద్ పోలీసులు.. రావడం రావడంతోనే డ్రంకన్ డ్రైవర్లకు ఊహించని ఝలక్..

Drunk and Drive: మళ్లీ యాక్షన్ సీన్‌లోకి సైబరాబాద్ పోలీసులు.. రావడం రావడంతోనే డ్రంకన్ డ్రైవర్లకు ఊహించని ఝలక్..
Drunk And Drive

Drunk and Drive: దాదాపు మూడు నెలల విరామం తరువాత సైబరాబాద్ పోలీసులు మళ్లీ యాక్షన్ సీన్‌లోకి దిగారు. రావడం..

Shiva Prajapati

|

Jul 05, 2021 | 7:53 AM

Drunk and Drive: దాదాపు మూడు నెలల విరామం తరువాత సైబరాబాద్ పోలీసులు మళ్లీ యాక్షన్ సీన్‌లోకి దిగారు. రావడం రావడంతోనే మందుబాబుల మత్తు వదిలేలా చర్యలకు ఉపక్రమించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు డ్రంకన్ డ్రైవ్ తనఖీలను తిరిగి ప్రారంభించారు. వీకెండ్ కావడంతో మద్యం ప్రియులు విచ్చలవిడిగా రోడ్లపైకి వచ్చే అవకాశం ఉన్నందున.. శని, ఆదివారాల్లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లను నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా పోలీసులు 126 మందిపై వాహనదారులపై కేసులు పెట్టారు. కోవిడ్ 19 జాగ్రత్తలు పాటిస్తూ పోలీసు అధికారులు తనిఖీలు నిర్వహించారు. ‘‘మందు బాబులు మద్యం సేవించి వాహనాలు నడపడం మూలంగా అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా కారణంగా కొంతకాలం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లను నిలిపివేయడం జరిగింది. ఈ మధ్య కాలంలోనే అనేక ప్రమాదాలు జరిగాయి. వాటిలో ఎక్కువగా మద్యం సేవించి వాహనాలు నడిపిన ఘటనలే ఎక్కువగా ఉన్నాయి’ అని సైబరాబాద్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(డీసీపీ), ట్రాఫిక్, విజయ్ కుమార్ తెలిపారు.

ఈ సందర్భంగా పలు రోడ్డు ప్రమాదాలను ట్రాఫిక్ పోలీసులు ఉదహరించారు. జూన్ 27వ తేదీన ఓ విద్యార్థి ఫుల్లుగా మద్యం సేవించి ఆడి కారు నడిపాడు. ఇనార్బిట్ మాల్ సమీపంలో ఒక ఆటోను ఢీకొట్టడంతో అందులోని ఓ ప్రయాణికుడు ప్రాణాలు కోల్పోయాడు. అదే రోజు రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ప్రేమావతిపేటలో ఇలాంటి ప్రమాదమే చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న యువకుడు ఇన్నోవా వాహనాన్ని అధిక వేగంతో నడిపి ప్లాట్‌ఫాంపై కి దూసుకెళ్లాడు. ఈ ఘటనలో ప్లాట్‌ఫాంపై కూర్చున్న మహిళకు తీవ్ర గాయాలయ్యాయి.

మరో సంఘటనలో, కొత్తగూడలోని బొటానికల్ గార్డెన్ వద్ద ఫుల్లుగా తాగిన బైకర్.. మిల్క్ వ్యాన్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైకర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇలా చాలావరకు ప్రమాదాలు డ్రంక్ అండ్ డ్రైవ్ కారణంగానే జరుగుతుండటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలతో మందుబాబులకు చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, 2021లో ఇప్పటి వరకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు 20,326 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను నమోదు చేశారు. మోటార్ వెహికిల్ చట్టంలోని సెక్షన్ 206 ఆర్‌/డబ్ల్యూ 19 ప్రకారం డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వారి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు కోరుతూ ఆర్టీఏకు నివేదిక పంపించారు. కాగా, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు అత్యధికంగా గచ్చిబౌలి, మాధాపూర్, అల్వాల్, కుకట్‌పల్లి, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో నమోదయ్యాయి.

ఇదిలాఉంటే.. మద్యం మత్తులో యాక్సిడెంట్లు చేసిన వారిపై ఐపిసి సెక్షన్ 304 (II) ప్రకారం హత్యా నేరం కింద కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు. అంతేకాదు.. మద్యం సేవించిన వ్యక్తులకు వాహనాలు ఇచ్చినవారిపై, వారి వెంట ఉన్న వారిపైనా కేసులు పెడుతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో చిక్కిన వారి వివరాలను వారు పనిచేస్తున్న కంపెనీలు, కుటుంబ సభ్యులకు కూడా పోలీసులు సమాచారం చేరవేస్తున్నారు. కంపెనీలు తమ, తమ ఉద్యోగులకు రహదారి భద్రతా నియమాలు పాటించేలా శిక్షణ ఇవ్వాలని సైబరాబాద్ పోలీసులు కోరుతున్నారు.

Also read:

Ap Curfew: నేడు కోవిడ్‌పై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమీక్ష.. కర్ఫ్యూ సడలింపుపై నిర్ణయం తీసుకునే అవకాశం

Cows: ఆవులు ప్లాస్టిక్ ను జీర్ణించుకోగలవు.. దాని కోసం వాటి కడుపులో ప్రత్యేక అమరిక..వెల్లడించిన శాస్త్రవేత్తలు

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu