Janpur ZP Chairperson: యూపీ పరిషత్ ఎన్నికల్లో తెలుగు అమ్మాయి సత్తా.. జాన్పూర్ జెడ్పీ ఛైర్‌పర్సన్‌గా సూర్యాపేట జిల్లావాసి
సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రత్నవరానికి చెందిన శ్రీకళారెడ్డి ఉత్తర్‌ప్రదేశ్‌లోని జన్పూర్ జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్‌గా భారతీయ జనతా పార్టీ నుంచి ఎన్నికయ్యారు.
Suryapet Woman elected in UP ZP elections: సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రత్నవరానికి చెందిన శ్రీకళారెడ్డి ఉత్తర్‌ప్రదేశ్‌లోని జన్పూర్ జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్‌గా భారతీయ జనతా పార్టీ నుంచి ఎన్నికయ్యారు. మాజీ ఎమ్మెల్యే కీసర జితేందర్‌రెడ్డి కుమార్తె అయిన శ్రీకళారెడ్డి యూపీలో స్థిరపడ్డారు. గతంలో కోదాడ నియోజకవర్గ రాజకీయాల్లో తన తండ్రి గారి తరఫున చురుకుగా పాల్గొన్న శ్రీకళారెడ్డికి యూపీకి చెందిన ధనుంజయ్‌తో వివాహమైంది. అనంతరం బీజేపీలో చేరారు. ఇటీవల అక్కడ జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీచేసి జడ్పీటీసీ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఆ తరువాత జాన్పూర్ పరిషత్ ఛైర్‌పర్సన్‌గా ఎన్నుకున్నారు.
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రభంజనం సృష్టించింది. జిల్లా పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను గెలిచి సత్తా చాటింది. మొత్తం 75 జిల్లా పరిషత్‌లకు ఎన్నికలు జరగ్గా.. బీజేపీ ఏకంగా 67 సీట్లలో విజయం సాధించింది. ఒకరంగా వార్ వన్ సైడ్ అయినట్లే స్థానిక ఎన్నికలు సాగాయి. ఈ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ కేవలం 6 స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కంచుకోటగా ఉన్న రాయబరేలీలోనూ బీజేపీ విజయ కేతనం ఎగురవేసింది.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3 వేల మంది పంచాయతీ సభ్యులు 75 మంది ఛైర్‌పర్సన్‌ల ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఇందులో 22 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. బీజేపీ నుంచి 21 మంది, సమాజ్‌వాదీ పార్టీ ఒకరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన స్థానాలకు ఆదివారం ఎన్నికలు జరిగాయి. సాయంత్రం ఫలితాలను ప్రకటించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 67 స్థానాలు సాధించి తమకు తిరుగులేదని నిరూపించింది. బీజేపీ ఏకగ్రీవంగా గెలిచిన స్థానాల్లో సహారన్‌పూర్, బహ్రెయిచ్, ఎత్వా, చిత్రకూట్, ఆగ్రా, గౌతమ్ బుద్ధనగర్, బులంద్ షహర్, అమ్రోహా, మొరాదాబాద్, లతీపూర్, మీరట్, ఝాన్సీ, బందా, శ్రవస్తి, బల్రాంపూర్, గోండా, గోరఖ్‌పూర్, మవు, వారణాసి, పిలిభిత్, షాజహాన్‌పూర్ ఉన్నాయి.
గతంలో జరిగిన జిల్లా పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలకు ఎస్పీ దక్కించుకుంది. ఏకంగా 63 సీట్లు సాధించి రికార్డుల్లోకెక్కింది. ఇప్పుడు 67 సీట్లు సాధించి ఆ రికార్డును బద్దలు కొట్టింది బీజేపీ. ఈ ఎన్నికల్లో బీఎస్పీ పోటీ చేయలేదు. ఈ విజయంతో బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. వచ్చే ఏడాది అసెంబ్లీ అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీకి ఇది బిగ్ బూస్ట్ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Read Also… Coronavirus: వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా.. 99 శాతం కోవిడ్ మరణాలు.. అసలు కారణం అదే..!