ఆదిలాబాద్ పల్లె నుంచి మిస్ ఎర్త్ వేదిక వరకు.. ప్రీతి ముండే విజయగాథ
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం హీరాపూర్ గ్రామానికి చెందిన ప్రీతి ముండే జాతీయ స్థాయి అందాల పోటీల్లో తెలంగాణకు ప్రాతినిధ్యం వహించి ‘మిస్ ఎర్త్ వాటర్ ఇండియా 2026’ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. యోగా, క్రీడలు, సామాజిక సేవ, పర్యావరణ పరిరక్షణలోనూ చురుగ్గా పాల్గొంటున్న ప్రీతి.. త్వరలో అంతర్జాతీయ వేదికపై భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు.

ఆదిలాబాద్ జిల్లాలోని ఓ మారుమూల పల్లెటూరి నుంచి జాతీయ స్థాయి అందాల పోటీల వేదిక వరకు సాగిన ప్రీతి ముండే ప్రయాణం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం హీరాపూర్ గ్రామానికి చెందిన ప్రీతి.. రాజస్థాన్‌లోని జైపూర్‌లో నిర్వహించిన ‘మిస్ ఇండియా ఎర్త్ 2026’ పోటీల్లో తెలంగాణకు ప్రాతినిధ్యం వహించి ‘మిస్ ఎర్త్ వాటర్ ఇండియా 2026’ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. జాతీయ స్థాయిలో ప్రతిభ చాటిన ప్రీతి.. త్వరలో ఫిలిప్పీన్స్‌లో జరగనున్న అంతర్జాతీయ ‘మిస్ ఎర్త్’ వేదికపై భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ పోటీల్లో ఆమె ప్రదర్శన, స్నేహపూర్వక వ్యక్తిత్వానికి గుర్తింపుగా ‘మిస్ కంజీనియాలిటీ 2026’ ఉప కిరీటాన్ని కూడా అందుకున్నారు.
సాధారణ కుటుంబం నుంచి అంచెలంచెలుగా..
ఇంద్రవెల్లి మండలంలో వస్త్ర వ్యాపారం నిర్వహించే ప్రహ్లాద్ ముండే, ఉమా ముండే దంపతుల కుమార్తె ప్రీతి. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన ఆమె.. తనకు ఉన్న ఆసక్తులను ఒక్కొక్కటిగా సాధన చేస్తూ ముందుకు సాగారు. మోడలింగ్‌తో పాటు విద్య, యోగా, క్రీడలు, సేవా కార్యక్రమాల్లోనూ ప్రీతి తనదైన ముద్ర వేస్తున్నారు. అరోరా విశ్వవిద్యాలయంలో యోగాలో మాస్టర్స్ అభ్యసిస్తున్న ఆమె.. జాతీయ స్థాయి యోగా ఛాంపియన్‌షిప్‌కు కూడా ఎంపికయ్యారు.
యోగా నుంచి సేవా కార్యక్రమాల వరకు
ప్రీతి గతంలో ఎన్‌సీసీ క్యాడెట్‌గా శిక్షణ పొందారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ విభాగంలో యోగా శిక్షకురాలిగా సేవలందించారు. ప్రస్తుతం ప్రైవేట్ పాఠశాలలో యోగా ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూనే.. జ్యోతిష్యురాలిగా, యువ పారిశ్రామికవేత్తగా కూడా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. కేవలం అందాల పోటీలకే పరిమితం కాకుండా సామాజిక సేవ, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లోనూ ప్రీతి చురుగ్గా పాల్గొంటున్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ స్వచ్ఛంద సేవకురాలిగా వివిధ సేవా కార్యక్రమాల్లో భాగమవుతున్నారు. పర్యావరణంపై విద్యార్థుల్లో అవగాహన పెంచాలనే లక్ష్యంతో ‘కైండ్ హార్ట్స్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని ద్వారా పాఠశాల విద్యార్థులకు చెత్తను వేరు చేయడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. చెరువుల పునరుద్ధరణ, సామూహికంగా మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.
అంతర్జాతీయ వేదికపై తెలంగాణకు ప్రాతినిధ్యం
హీరాపూర్ వంటి గ్రామీణ ప్రాంతం నుంచి ప్రారంభమైన ప్రీతి ప్రయాణం.. ఇప్పుడు జాతీయ స్థాయి అందాల పోటీల నుంచి అంతర్జాతీయ వేదిక వరకు చేరింది. అందాల పోటీలతో పాటు యోగా, క్రీడలు, సామాజిక సేవ, పర్యావరణ పరిరక్షణలోనూ ఆమె కొనసాగిస్తున్న ప్రయాణం స్థానికంగా ప్రశంసలు అందుకుంటోంది. మిస్ ఎర్త్ అంతర్జాతీయ వేదికపై భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించేందుకు సిద్ధమవుతున్న ప్రీతి ముండే.. తన తదుపరి అడుగుపై దృష్టి సారిస్తున్నారు. ఆమె విజయంపై హీరాపూర్ గ్రామస్తులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పలువురు ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు.
