AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వైద్యం కోసం వస్తే ప్రాణాలకే ముప్పు! పెద్దాసుపత్రిలో ఏం జరుగుతోంది?

Phani CH
|

Updated on: Sep 23, 2026 | 9:35 PM

Share

వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో పైకప్పు పెచ్చులు ఊడిపడిన ఘటన కలకలం రేపింది. ఆరోగ్యశ్రీ వార్డులో కాంక్రీట్‌ ముక్కలు పడటంతో ముగ్గురు సహా పలువురికి గాయాలైనట్లు నివేదికలు పేర్కొన్నాయి. బాధితులను వెంటనే అత్యవసర చికిత్సకు తరలించారు. మరుసటి రోజు ఇతర విభాగాల్లోనూ పైకప్పు భాగాలు పడటంతో భద్రతపై ఆందోళనలు పెరిగాయి. ఇదే సమయంలో రోగులను పరామర్శించేందుకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌ భాస్కర్‌ను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.

నేటి సమాజంలో వైద్యం అత్యంత ఖరీదైన వ్యాపారంగా మారిపోయింది. సామాన్యులు, పేద కుటుంబాలు ప్రైవేటు లేదా కార్పొరేట్ ఆసుపత్రుల వైపు చూడాలంటేనే భయపడే పరిస్థితి. కార్పొరేట్‌ ఆస్పత్రిలో అడుగుపెడితే లక్షల రూపాయల బిల్లులతో అప్పులపాలవ్వాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన వేలాది మంది నిరుపేదలకు ‘వరంగల్ MGM ఆసుపత్రి’ ఒక్కటే పెద్ద దిక్కుగా నిలుస్తోంది. మెరుగైన ఉచిత వైద్యం అందుతుందనే కొండంత ఆశతో, నమ్మకంతో ఇక్కడికి వచ్చే పేద రోగులకు ఇప్పుడు ఆసుపత్రి భవనాలే ప్రాణ సంకటంగా మారుతున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలకు గుండెకాయ లాంటి ఈ ఆసుపత్రిలో రోగుల భద్రత గాల్లో దీపంగా మారింది. వైద్యసేవల సంగతి అటుంచితే, ఆసుపత్రి భవనం శిథిలావస్థకు చేరడంతో రోగుల ప్రాణాలకే ముప్పు వాటిల్లుతోంది. ఎంజీఎం ఆసుపత్రిలోని ఆరోగ్యశ్రీ వార్డులో ఒక్కసారిగా స్లాబ్ పైకప్పు పెచ్చులు ఊడిపడటంతో తీవ్ర అలజడి రేగింది. రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేదలు, కూలీలు, దిగువ మధ్యతరగతి ప్రజలు వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రులనే నమ్ముకుంటారు. ఎంజీఎం వంటి ‘పేదల పెద్దాసుపత్రి’ తమను కాపాడుతుందనే నమ్మకంతో ఇక్కడికి వస్తుంటారు. కానీ, ఆసుపత్రి భవనాల కనీస నిర్వహణ లోపించడం వల్ల, రోగాలు నయం కావడానికి వచ్చిన చోటే కొత్త గాయాల పాలవ్వాల్సి రావడం అత్యంత విచారకరం. ఆసుపత్రిలో కనీస భద్రత లేకపోతే నిరుపేద ప్రజలు ఎక్కడికి వెళ్లాలి? ఇప్పుడు సర్వత్రా ఇలాంటి ప్రశ్నలే వ్యక్తమవుతున్నాయి. అసలు ఎంజీఎం ఆస్పత్రిలో ఏం జరిగిందో చూద్దాం. ఆసుపత్రిలోని ‘ఆరోగ్యశ్రీ వార్డు’లో ఉదయం వేళ రోగులు తమ బెడ్లపై చికిత్స పొందుతున్న సమయంలో ఒక్కసారిగా భవనం స్లాబ్ పైకప్పు పెచ్చులు ఊడి కిందపడ్డాయి. మంచంపై నుండి కనీసం కదలలేని నిస్సహాయ స్థితిలో ఉన్న పెరాలసిస్ బాధితుడు మస్తాన్ , అటెండర్లు ఎల్లమ్మ , ఓంకార్ అనే వారిపై ఈ కాంక్రీట్ పెచ్చులు పడ్డాయి. ఈ ప్రమాదంలో ముగ్గురికీ తలలు పగిలి తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారంతా జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలం ఉప్పుగల్ గ్రామానికి చెందినవారుగా గుర్తించారు. ప్రాణాపాయం తప్పినప్పటికీ, నమ్మకంతో వైద్యం కోసం వచ్చిన చోటే తలలు పగలడం పట్ల బాధితుల బంధువులు దిగ్భ్రాంతి చెందారు. ప్రస్తుతం బాధితులకు అదే ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో భవనం పరిస్థితిపై అధికారుల సమాధానం ఏంటి? ఘటన జరిగిన వెంటనే ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామ్‌కుమార్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదం జరిగిన వార్డులోని రోగులందరినీ సురక్షితంగా వేరే వార్డుకు తరలించారు. అయితే, ఈ భవనం చాలా పాతది కావడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అక్కడి వైద్య సిబ్బంది చెబుతున్నారు. ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న విమర్శ ఏంటంటే.. వరంగల్‌లో నూతనంగా నిర్మిస్తున్న 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి త్వరలో ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోందని, ఈ నెపంతో.. ప్రస్తుతం సేవలందిస్తున్న ఈ పాత ఎంజీఎం ఆసుపత్రి నిర్వహణను అధికారులు, ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నూతన భవనం పూర్తయ్యే వరకు పాత భవనంలో సేవలందుకుంటున్న వేలాది మంది పేద రోగుల ప్రాణాలకు బాధ్యత ఎవరిదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు ఎంజీఎం ఆస్పత్రి ఘటన రాజకీయ దుమారం రేపుతోంది. ఆసుపత్రిలో పైకప్పు కూలి రోగులు గాయపడటం, బెడ్లు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారనే సమాచారంతో.. పరిస్థితిని పరిశీలించేందుకు ప్రతిపక్ష నాయకులు బయలుదేరారు. అయితే వారి పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు రాజకీయంగా విమర్శలు రేపింది. గాయపడిన రోగులను పరామర్శించేందుకు ఎంజీఎంకు వెళ్లిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌ను పోలీసులు ప్రధాన గేటు వద్దే అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు- బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా పోలీసులు వినయ్ భాస్కర్‌పై భౌతిక దాడికి పాల్పడ్డారని, పిడిగుద్దులు కురిపించారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఈ ఘటనపై ప్రతిపక్ష నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. ప్రజల పక్షాన నిలబడే నాయకుల గొంతు నొక్కడమే రేవంత్ రెడ్డి ప్రభుత్వ పనిగా మారిందని ధ్వజమెత్తారు. పరామర్శకు వెళ్తున్న ప్రజాప్రతినిధిపై పోలీసులు దౌర్జన్యం చేయడం, పిడిగుద్దులు గుద్దడం ముమ్మాటికీ పిరికిపంద చర్య అని అభివర్ణించారు. వినయ్ భాస్కర్‌పై దాడి చేసిన పోలీసులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ దౌర్జన్యానికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. వరుస ఘటనలు, రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఎంజీఎం ఆసుపత్రి యంత్రాంగం, పోలీసులు అత్యవసర ఆంక్షలు విధించారు. ఆసుపత్రి ప్రాంగణాన్ని ఒక రకంగా దిగ్బంధించారని చెప్పవచ్చు. ఆసుపత్రి ప్రధాన గేట్లకు తాళాలు వేసి భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక మీడియా ప్రతినిధులను కూడా లోపలికి అనుమతించకుండా మెయిన్ గేటు బయటే నిలిపివేశారు. ఇటు రోగుల బంధువులను కూడా లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఉత్తర తెలంగాణలోని అనేక జిల్లాల ప్రజలకు ఏకైక దిక్కు అయిన ఎంజీఎం ఆసుపత్రి పరిస్థితిపై ప్రభుత్వం తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉంది. కేవలం ఆంక్షలు విధించడం లేదా ప్రతిపక్షాలను అడ్డుకోవడం వల్ల సమస్య పరిష్కారం కాదు. ఆసుపత్రిలోని పాత భవనాలన్నింటికీ తక్షణమే సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలి. ప్రమాదకరంగా ఉన్న వార్డుల నుంచి రోగులను సురక్షిత ప్రాంతాలకు మార్చాలి. ఆసుపత్రి నిర్లక్ష్యం వల్ల గాయపడిన మస్తాన్, ఎల్లమ్మ, ఓంకార్‌లకు మెరుగైన ఉచిత వైద్యంతో పాటు ప్రభుత్వం తగిన పరిహారం అందించాలి. కొత్త ఆసుపత్రి ప్రారంభమయ్యే వరకు పాత ఆసుపత్రిని నిర్లక్ష్యం చేయకుండా తగినన్ని బెడ్లు, మందులు, భద్రతా వసతులు కల్పించాలి. లోపాలను కప్పిపుచ్చేందుకు మీడియాను, బాధితుల బంధువులను అడ్డుకోవడం మానాలని ప్రతిపక్షం కోరుతోంది. పరిస్థితిపై స్పష్టమైన వివరణ ఇచ్చి ప్రజల్లో నమ్మకాన్ని పునరుద్ధరించాలంది. కార్పొరేట్ వైద్యాన్ని తట్టుకోలేక ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే నిరుపేదల ప్రాణాలకు భరోసా కల్పించడం ప్రభుత్వ కనీస బాధ్యత. కనుక..ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హీరో నాని రిక్వెస్ట్‌.. సీఎం రేవంత్ రిప్లై! థియేటర్ విజిట్‌ రద్దు చేసుకున్న నాని!

దడ పుట్టిస్తున్న వాయుగుండం.. తీరంలో రాకాసి అలల బీభత్సం.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ

గుడ్‌ న్యూస్‌.. గ్యాస్ సిలిండర్‌పై వారికి రూ.600 తగ్గింపు!

సబ్బు, షాంపూ, టూత్‌పేస్ట్‌ పైనా కేంద్రం కొత్త రూల్స్‌

Gold Price Today: పెరిగిన పసిడి.. స్థిరంగా వెండి ధర

Follow Us