ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధం.. భక్తుల సౌకర్యార్థం అధికారుల భారీ ఏర్పాట్లు!
Hyderabad Ganesh Immersion 2026: దేశ వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. కొన్ని నగరాల్లో ఇప్పటికే గణపయ్య గంగమ్మ ఒడికి చేరుకోగా.. ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం శుక్రవారం జరగనుంది. అయితే ఈ ఊరేగింపుకు భారీ ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో.. వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాటు పూర్తి చేశారు.

హైదరాబాద్ నగరంలో వినాయక నిమజ్జనోత్సవానికి జలమండలి సర్వం సిద్ధం చేసింది. శోభాయాత్రకు తరలివచ్చే లక్షలాది మంది భక్తులకు తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. గురువారం జలమండలి ఉన్నతాధికారులతో ఈడీలు, డైరెక్టర్లు, సీజీఎంలు, జీఎంలు నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఎండీ అశోక్ రెడ్డి మాట్లాడారు. నిమజ్జనం పూర్తయ్యే వరకు రాబోయే 72 గంటల పాటు అధికారులు, సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
భాగ్యనగరంతో పాటు ORR పరిధిలోని మూడు రీజియన్లలో భక్తుల దాహార్తి తీర్చేందుకు 137 ప్రత్యేక వాటర్ క్యాంపులను ఏర్పాటు చేస్తున్నారు. నిమజ్జనాల కోసం స్థానికంగా సిద్ధం చేసిన 90 బేబీ పాండ్స్ వద్ద కూడా తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నారు. ప్రధాన శోభాయాత్ర సాగే మార్గాలతో పాటు ట్యాంక్‌బండ్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయం పరిసర ప్రాంతాల్లో 12 ప్రత్యేక వాటర్ క్యాంపులను అందుబాటులో ఉంచారు.
భక్తుల కోసం ఏకంగా 40 లక్షల వాటర్ ప్యాకెట్లను సిద్ధం చేశారు. అవసరమైన చోట్ల డ్రమ్ముల ద్వారా కూడా మంచినీటిని సరఫరా చేయనున్నారు. శోభాయాత్ర మార్గాల్లో ఏర్పాటు చేసే అన్నదాన శిబిరాలకు వాటర్ ట్యాంకర్ల ద్వారా ఉచితంగా నీటిని అందించనున్నారు. శోభాయాత్ర జరిగే మార్గాల్లో నీటి సరఫరాను నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా నోడల్ అధికారులు, రూట్ అధికారులను నియమించారు.
జలమండలి పరిధిలోని 3 రీజియన్లకు గాను సంబంధిత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు (EDs) స్వయంగా రంగంలోకి దిగి క్షేత్రస్థాయి ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. శోభాయాత్ర మార్గాల్లో డ్రైనేజీ లీకేజీలు, సీవరేజీ ఓవర్‌ఫ్లో సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా సీవర్ జెట్టింగ్ యంత్రాలను సిద్ధంగా ఉంచారు.
క్వాలిటీ అస్యూరెన్స్ టీమ్స్ (QAT) వాటర్ క్యాంపులలోని నీటి నాణ్యతను, క్లోరిన్ స్థాయిలను నిరంతరం పరిశీలిస్తాయి. పోలీస్, జీహెచ్‌ఎంసీ (GHMC), హైడ్రా (HYDRA), భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అధికారులతో సమన్వయం చేసుకుంటూ.. ఉత్సవాలు ప్రశాంతంగా ముగిసేలా అధికారులు అంకితభావంతో పనిచేయాలని ఎండీ అశోక్ రెడ్డి స్పష్టం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
