గోడల్లో, నేల కింద నోట్ల కట్టలు.. మాఫియా ఇళ్లల్లో కళ్లుచెదిరే క్యాష్ .. !
ఇటలీలోని నేపుల్స్ లో ఓ మాఫియా డెన్ పై పోలీసుల దాడుల్లో భారీగా నగదు, వాచీలు, ఆయుధాలు బయటపడ్డాయి. ఓ అపార్ట్‌మెంట్‌లోని గోడలు, నేల, ఫర్నిచర్‌లో దాచిన 3.2 మిలియన్ యూరోలు (సుమారు రూ.30 కోట్లకు పైగా) క్యాష్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కైయానో ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున దాడులు నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో 34 మందిని అరెస్టు చేసారు.

పోలీసులు సోదాలు నిర్వహించగా యూరో నోట్ల కట్టలు భారీగా కనిపించాయి. వాటిని సెల్లోఫేన్ టేప్‌తో చుట్టి, నేల, గోడల టైల్స్ కింద వరుసగా పేర్చి ఉంచారు. వార్డ్‌రోబ్‌లోని రహస్య డ్రాయర్లలోనూ నగదును దాచారు. భారీ మొత్తంలో నగదు కావడంతో పోలీసులు వాటిని ప్లాస్టిక్ మాప్ బకెట్లలో బయటకు తీసుకొచ్చి, ఆ తర్వాత సాయుధ వాహనంలో తరలించారు.
11 రోలెక్స్ వాచీలు.. ఆయుధాలు కూడా
నగదుతో పాటు 11 ఖరీదైన రోలెక్స్ వాచీలు, ఆయుధాలు, డ్రగ్స్ విక్రయానికి ఉపయోగించే సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తం ఆపరేషన్‌ను నేపుల్స్ యాంటీ-మాఫియా ప్రాసిక్యూటర్ నికోలా గ్రాటెరి నేతృత్వంలో జరిగింది. కొన్ని నెలల పాటు జరిపిన ఆపరేషన్ ను తాజాగా ముగించారు. జైల్లో ఉన్న మాఫియా సభ్యుల వద్దకు వారి బంధువుల ద్వారా మొబైల్ ఫోన్లు చేరినట్లు అధికారులు గుర్తించారు. ఆ ఫోన్లను పోలీసులు ట్యాప్ చేసి కీలక సమాచారాన్ని సేకరించారు. ఇక పోలీసులకు ఉప్పందించిన వ్యక్తులు కూడా ఉన్నారు. వారికి రక్షణ కల్పించే హామీతో వారు వివరాలు అందించారు.
🇮🇹💰 FLASH | La police italienne a découvert 3,2 MILLIONS D’EUROS en liquide cachés dans les murs, sous le sol et dans les meubles d’un appartement près de Naples.
11 montres Rolex, des armes et du matériel lié au trafic de drogue ont également été saisis. Au total, 34 personnes soupçonnées d’appartenir à un clan mafieux ont été arrêtées. (CNN)
— Cerfia (@CerfiaFR) September 23, 2026
ఏంజెలినో ముఠా పై చర్యలు
అరెస్టయిన వారిలో పలువురు ఏంజెలినో ముఠాకు చెందినవారిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ముఠా కైయానో ప్రాంతంలో భారీగా పట్టు సాధించింది. ముఠా ప్రభావం ఎంతలా ఉందంటే.. గతేడాది కైయానో స్థానిక ప్రభుత్వాన్ని కూడా తమ నియంత్రణలోకి తీసుకుంది. కైయానో ప్రాంతంలో నేరాలను తగ్గించేందుకు ప్రధాని జార్జియా మెలొనీ 2023లో “కైయానో మోడల్” పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. యువతను నేరాలు, డ్రగ్స్‌కు దూరంగా ఉంచడంతో పాటు వారికి ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పించడం ఈ కార్యక్రమం లక్ష్యం.
కైయానో ఆపరేషన్‌పై ప్రతిపక్షం విమర్శలు
ఇటలీలోని కైయానోలో భారీ నగదు, ఆయుధాలు, ఖరీదైన వాచీలు స్వాధీనం చేసుకుని 34 మందిని అరెస్టు చేసిన ఘటనపై రాజకీయ విమర్శలు మొదలయ్యాయి. ఈ ఆపరేషన్‌ను ప్రభుత్వం చేపట్టిన “కైయానో మోడల్” కార్యక్రమం విఫలమైందనడానికి నిదర్శనంగా కొందరు ప్రతిపక్ష నేతలు అభివర్ణించారు. గ్రీన్స్ అండ్ లెఫ్ట్ అలయన్స్‌కు చెందిన ప్రతిపక్ష ఎంపీ ఫ్రాన్సెస్కో బొరెల్లి మాట్లాడుతూ.. నెలలుగా ప్రధాని, మంత్రులు కైయానోలో చేపట్టిన చర్యలను ఘనంగా ప్రచారం చేశారు. వ్యవస్థీకృత నేరాలపై విజయం సాధించామని చెప్పారు. అయితే తాజా దర్యాప్తులో వెలుగుచూసిన పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది” అని విమర్శించారు. అరెస్టయిన 34 మందిపై నేర సంస్థలో సభ్యత్వం, డ్రగ్స్ అక్రమ రవాణా, బెదిరింపులతో డబ్బులు వసూలు చేయడం, డ్రగ్స్ విక్రయం వంటి అభియోగాలు మోపారు.
షిఫ్టుల వారీగా నేర కార్యకలాపాలు
మాఫియా ముఠా పనిచేసిన విధానం “వ్యాపార సంస్థలా” ఉండటం విశేషం. డ్రగ్స్ విక్రయాలు, బెదిరింపులతో డబ్బు వసూళ్లకు వ్యక్తులను వేర్వేరు సమయాల్లో షిఫ్టుల పద్ధతిలో నియమించినట్లు తెలిసి పోలీసులు కంగుతిన్నారు. స్వాధీనం చేసుకున్న 3.2 మిలియన్ యూరోలు “జస్టిస్ ఫండ్”కు మళ్లిస్తారు. వ్యవస్థీకృత నేరాల బాధితులకు సహాయం చేసేందుకు ఈ నిధిని ఉపయోగిస్తారు. అయితే, ప్రభుత్వ ఖర్చు తగ్గించేందుకు ఫోన్ ట్యాపింగ్‌ను తగ్గించాలని భావిస్తున్న పోలీసులకు ఈ ఒక్క ఆపరేషన్‌లో దొరికిన నగదుతోనే నేపుల్స్‌లో ఏడాది పాటు నిర్వహించగలిగే స్థాయిలో వైర్‌ట్యాపింగ్ ఖర్చు సమకూరింది.
మరిన్ని ట్రెండింగ్ వార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి