షార్క్‌ల మధ్య యువకుడి ప్రపోజల్ .. షాక్‌లో యువతి!
సాధారణంగా పెళ్లి ప్రపోజల్ అంటే.. అందమైన ప్రదేశం, పూలు, రొమాంటిక్ డిన్నర్ లేదా సర్‌ప్రైజ్ పార్టీలాంటి సెట్టింగ్ ను ఊహించుకుంటాం. కానీ ఇంగ్లాండ్‌కు చెందిన ఓ యువకుడు మాత్రం తన ప్రేయసికి జీవితాంతం గుర్తుండిపోయేలా ప్రపోజ్ చేయాలనుకున్నాడు. అందుకే ఏకంగా షార్క్‌ల మధ్యలోనే ‘విల్ యూ మ్యారీ మీ?’ అంటూ అడిగాడు. నీటిలో జరిగిన ఈ సర్‌ప్రైజ్ ప్రపోజల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

బకింగ్‌హామ్‌షైర్‌కు చెందిన జేమ్స్ వాల్ష్, తన ప్రేయసి పైజ్ కుక్ కు ప్రపోజ్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. అయితే అందరూ చేసే విధంగా కాకుండా.. ఏదైనా ప్రత్యేకంగా చేయాలని నిర్ణయించాడు. పైజ్‌కు షార్క్‌లంటే చాలా ఇష్టం. ఆ విషయం తెలిసిన జేమ్స్‌కు ఓ ఆలోచన వచ్చింది. “ఆమెకు ఇష్టమైన షార్క్‌ల మధ్యే ప్రపోజ్ చేస్తే ఎలా ఉంటుంది?” అంతే.. తన ప్లాన్‌ను అమలు చేసేందుకు ఇంగ్లాండ్‌లోని లింకన్‌షైర్‌లో ఉన్న స్కెగ్‌నెస్ అక్వేరియంను ఎంచుకున్నాడు.
ముందే భారీ ప్లాన్..
షార్క్‌లతో కలిసి డైవింగ్ చేసే అనుభవంలో భాగంగా పైజ్‌ను అక్కడికి తీసుకెళ్లాడు జేమ్స్. అయితే అసలు సర్‌ప్రైజ్ ఏంటో ఆమెకు ఏ మాత్రం తెలియదు. ప్రపోజల్‌ను విజయవంతం చేసేందుకు జేమ్స్ ముందుగానే అక్వేరియం సిబ్బందిని సంప్రదించాడు. తన ప్లాన్ మొత్తం వారికి ఈ మెయిల్ ద్వారా వివరించాడు. దాంతో సిబ్బంది కూడా అతడికి సహకరించారు. సెప్టెంబర్ 10వ తేదీన అసలు సర్‌ప్రైజ్‌కు రంగం సిద్ధమైంది.
నీటిలో ఏం జరుగుతుందో తెలియని పైజ్..
జేమ్స్, పైజ్ ఇద్దరూ వెట్‌సూట్లు, స్కూబా డైవింగ్ పరికరాలు ధరించి షార్క్ ట్యాంక్‌లోకి దిగారు. అయితే చివరి క్షణంలో అక్వేరియం సిబ్బంది మిగతా డైవింగ్ బృందం నుంచి ఈ జంటను విడిగా ఉంచారు. ఇంతలో ఓ వ్యక్తి ఎవరికీ తెలియకుండా ఓ ప్రత్యేకమైన బోర్డుతో అక్కడికి చేరుకున్నాడు. పైజ్‌కు ఇంకా ఏమీ అర్థం కాలేదు. ఒక్కసారిగా చేతిలో బోర్డు. నీటి అడుగున జేమ్స్ మోకాళ్లపై కూర్చున్నాడు.ఆ తర్వాత చేతిలోని బోర్డును పైజ్‌కు చూపించాడు. అందులో..విల్ యూ మ్యారీ మీ? అని రాసి ఉంది. ఆ క్షణం ఏం జరుగుతుందో అర్థమైన పైజ్ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. భావోద్వేగంతో తన స్కూబా మాస్క్‌ను చేతితో కప్పుకుంది. కొద్దిసేపటి తర్వాత తేరుకున్న ఆమె.. తన చేతితో ‘OK’ సిగ్నల్ ఇచ్చింది. ఆ తర్వాత ఇద్దరూ నీటిలోనే ఒకరినొకరు హత్తుకున్నారు.
ఇది నా జీవితంలోనే బెస్ట్ డే
ఈ సర్‌ప్రైజ్‌తో పైజ్ పూర్తిగా ఆశ్చర్యపోయింది. తాను షార్క్‌లతో కలిసి డైవింగ్ చేయాలని ఎప్పటి నుంచో కోరుకున్నానని.. అదే రోజు జేమ్స్ పెళ్లి ప్రపోజల్తో తీసుకురావడంతో అసలు తాను షార్క్ ట్యాంక్‌లో ఉన్నాననే విషయాన్ని కూడా కొంతసేపు మర్చిపోయానని ఆమె చెప్పింది. “ఇది నా జీవితంలోనే బెస్ట్ డే” అని పైజ్ ఆనందం వ్యక్తం చేసింది.
అక్వేరియం కూడా శుభాకాంక్షలు
ఈ ప్రత్యేకమైన క్షణానికి సాక్ష్యమైన స్కెగ్‌నెస్ అక్వేరియం.. జేమ్స్, పైజ్‌లకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపింది. సాధారణంగానే షార్క్‌లతో డైవింగ్ అనేది ఉత్కంఠభరితమైన అనుభవం. అలాంటి సమయంలో పెళ్లి ప్రపోజల్ జరగడంతో ఈ జంటకు అది మరింత ప్రత్యేకమైన జ్ఞాపకంగా మారింది. షార్క్‌ల మధ్య మొదలైన ఈ కొత్త ప్రయాణం.. జీవితాంతం కలిసి సాగాలని ఆశిద్దాం. జేమ్స్ వేసిన ఆ ఒక్క ప్రశ్నకు పైజ్ చెప్పిన ‘అవును’తో వారి ప్రేమకథలో మరో కొత్త అధ్యాయం మొదలైంది.
మరిన్ని ట్రెండింగ్ స్టోరీస్ కోసం క్లిక్ చేయండి