హైదరాబాద్ ఓయో హోటల్‌లో యువతి అనుమానాస్పద మృతి కేసులో ట్విస్ట్.. ఏం జరిగిందంటే.?
హైదరాబాద్ మాదాపూర్‌లోని ఓయో హోటల్‌లో యువతి నిఖిత అనుమానాస్పద మృతి కేసులో నిందితుడు శ్రీనివాస రవితేజ తన స్వగ్రామంలో ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం అతడు విశాఖపట్నం కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. నిఖిత ముఖం, తలపై గాయాలు, గదిలో రక్తపు మరకలు, మద్యం సీసాలు గుర్తించారు. రవితేజ వాంగ్మూలం కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు, ఇది కేసు దర్యాప్తులో కీలక మలుపు.

హైదరాబాద్ మాదాపూర్‌లోని ఓయో హోటల్‌లో యువతి అనుమానాస్పద మృతి కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాస రవితేజ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం ఈ-మర్రిపాలెంలోని తన స్వగ్రామంలో బుధవారం ఇంట్లోనే అతడు ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు గుర్తించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. రవితేజకు తొలుత స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందించగా.. పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖపట్నంలోని కేజీహెచ్‌కు తరలించినట్లు సమాచారం. ప్రస్తుతం అక్కడే చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పరవాడ పోలీసులు హైదరాబాద్ పోలీసులకు సమాచారం అందించారు.
విశాఖపట్నానికి చెందిన షారోన్ నిఖిత టోప్నో.. శ్రీనివాస రవితేజతో కలిసి మాదాపూర్‌లోని సిద్దిఖీనగర్, రోడ్ నంబర్ 5లో ఉన్న ఓయో హోటల్‌కు వెళ్లింది. సెప్టెంబర్ 21న మధ్యాహ్నం ఇద్దరూ హోటల్‌లో రూమ్ తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే మంగళవారం తెల్లవారుజామున నిఖిత అపస్మారక స్థితిలోకి వెళ్లింది. దీంతో రవితేజ, హోటల్ సిబ్బంది సహాయంతో ఆమెను కొండాపూర్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే నిఖిత మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. యువతి ముఖం, తల భాగంలో గాయాలు, వాపులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హోటల్ గదిని క్లూస్ టీమ్ పరిశీలించగా గోడలు, బెడ్‌షీట్‌పై రక్తపు మరకలు కనిపించినట్లు అధికారులు తెలిపారు. గదిలో ఖాళీ మద్యం సీసాలు కూడా గుర్తించినట్లు సమాచారం. ఈ ఆధారాలతో యువతి మృతి అనుమానాస్పదంగా మారింది. ఘటనకు ముందు హోటల్ గదిలో ఇద్దరి మధ్య ఏం జరిగిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫోరెన్సిక్ ఆధారాలతో పాటు హోటల్ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీ, ఇతర ఆధారాలను పరిశీలిస్తున్నారు.
నిఖిత మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించిన అనంతరం రవితేజ ఆస్పత్రి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత అతడి ఫోన్ స్విచ్ఛాఫ్ కావడంతో పోలీసులు అతడి కోసం గాలింపు చేపట్టారు. ప్రత్యేక బృందాలు రవితేజ ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్న సమయంలోనే అతడు తన స్వగ్రామంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. ఇంట్లో ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ తాగినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు గుర్తించి ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న రవితేజ ఆరోగ్య పరిస్థితిపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. మాదాపూర్ ఓయో హోటల్‌లో నిఖిత మృతి ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. యువతి మృతికి దారితీసిన పరిస్థితులు ఏమిటి? ఘటన సమయంలో హోటల్ గదిలో ఏం జరిగింది? రవితేజ ఆత్మహత్యాయత్నానికి కారణమేంటి? అనే అంశాలపై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. రవితేజ ఆరోగ్య పరిస్థితి, అతడి వాంగ్మూలం ఆధారంగా కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
