Telangana: లంచం తీసుకుంటుండగా ఏసీబీ ఎంట్రీ.. నడిరోడ్డుపై పరుగులు పెట్టిన ప్రభుత్వాధికారి.. కట్‌చేస్తే..
సమాజాంలో రోజురోజుకూ అవినీతి పరులు పెరిగిపోతున్నారు. చట్టబద్దమైన పదవుల్లో ఉంటూ అక్రమంగా జనాల నుంచి లంచాలు దొబ్బితింటున్నారు. ఇలాంటి వారికి చెక్ పెట్టేందుకు ఏసీబీ అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వీరిలో మాత్రం ఎలాంటి మార్పు రావట్లేదు. రోజూ ఎక్కడో అక్కడ జనాల నుంచి లంచం తీసుకుంటూ అధికారులకు పట్టుబడుతూనే ఉన్నారు. తాజాగా ఇలానే లంచం తీసుకుంటూ ఓ ప్రభుత్వాధికారి ఏసీబీ అధికారులు అడ్డంగా బుక్కయ్యాడు.

ఓ రైస్ మిల్ యజమాని వద్ద జిల్లా పౌర సరఫరాల శాఖ డిఎం రూ. 75 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. నడి రోడ్డుపై లంచం తీసుకుంటుండా ఏసీబీ అధికారులు రావడంతో.. గమనించిన పౌరసరపరాల అధికారి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ సంఘటన కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా ఏసిబి డిఎస్పి మధు తెలిపిన వివరాల ప్రకారం.. దహేగాంకు చెందిన వాసవి మోడ్రన్ రైస్ మిల్ నుండి సిఎంఆర్ బియ్యం నాణ్యత ప్రమాణాలను పరిశీలించి ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేందుకు పౌరసరఫాల డీఎం నర్సింగరావు ఒక్కో లారీకి రూ.25వేల లంచం డిమాండ్ చేశాడు. ఇక గురువారం సాయంత్రం రెబ్బెన మండలంలోని కైరుగాం వద్ద బాధితుడు మూడు లారీలకు సంబంధించిన రూ. 75 వేలను అధికారికి ఇస్తుండగా ఎంట్రీ ఇచ్చిన ఏసీబీ అధికారులు అతన్ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.నర్సింగరావు తో పాటు ఔట్సోర్సింగ్ ఉద్యోగి మణికంఠను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.
బాధితుడు నుండి ఇప్పటికే 16 లారీలకు సంబంధించిన డబ్బులు పౌరసరఫరాల శాఖ అధికారులు తీసుకున్నట్లు డి.ఎస్.పి వెల్లడించారు. ప్రభుత్వ అధికారులు అవినీతికి పాల్పడడంతో పాటు లంచం కోసం సామాన్య జనాన్ని వేధింపులకు గురిచేస్తే 1064, 9154388963 (ఆదిలాబాద్ ఏసిబి డిఎస్పి ) కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు.
వేధింపులు తట్టుకోలేక ఏసీబీని ఆశ్రయించా
పౌరసరఫరాల శాఖ అధికారుల వేధింపులు తట్టుకోలేకనే ఏసీబీని ఆశ్రయించినట్లు బాధితుడు సందీప్ తెలిపారు. వాసవి మాడ్రన్ రైస్ మిల్ నునడుపుతున్న సందీప్ రభి సీజన్‌లో వడ్లు పట్టకుండా ట్రక్ షీట్ ఇవ్వాలని అధికారులు కోరడంతో నిరాకరించాడు. దీంతో అధికారులు అతనిపై 6A కేసు నమోదు చేశారని తెలిపాడు. అవి రేషన్ బియ్యం కాదని కలెక్టర్‌కి వినతిపత్రం ఇచ్చినా కూడా ఉన్నతాధికారులు పట్టించుకోలేదని.. దీంతో తాను హైకోర్టును ఆశ్రయించానని చెప్పాడు. హైకోర్టు ఆదేశాలతో అధికారులు సీజ్ చేసిన బియ్యాన్ని పరిశీలించి.. అవి రేషన్ బియ్యం కాదని తేర్చారు. దీంతో సీజ్ చేసిన బియ్యం రిలీజ్ చేయాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అయినప్పటికీ అధికారులు బియ్యం రిలీజ్ చేయకుండా తనను ఇబ్బందులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. వారి వేధింపులు తట్టుకోలేకనే ఏసీబీని ఆశ్రయించి అవినీతి అధికారులను పట్టించానని బాధితుడు తెలిపాడు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



