Telangana: తండ్రికి అండగా తనయ.. పత్తిచేలో దుక్కి దున్నుతూ తనవంతు సాయం.. శభాష్ అంటున్న గ్రామస్తులు..
Nalgonda News: తల్లిదండ్రుల కష్టసుఖాల్లో చేదోడు వాదోడుగా ఉండేందుకు చేతికి అందివచ్చే కొడుకులు ఉంటే.. ఆ ధైర్యమే వేరు అంటారు. కానీ మగసంతానం లేని తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? అంటే నేటితరం ఆడపిల్లలు తామేం తక్కువ అని నిరూపిస్తున్నారు.
నల్లగొండ, జులై 18: తల్లిదండ్రుల కష్టసుఖాల్లో చేదోడు వాదోడుగా ఉండేందుకు చేతికి అందివచ్చే కొడుకులు ఉంటే.. ఆ ధైర్యమే వేరు అంటారు. కానీ మగసంతానం లేని తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? అంటే నేటితరం ఆడపిల్లలు తామేం తక్కువ అని నిరూపిస్తున్నారు. వంటింటికే పరిమితం కాదు.. తల్లిదండ్రుల కష్టసుఖాల్లోనూ అండగా తాముంటామని అంటున్నారు ఆడపిల్లలు. నల్లగొండ జిల్లాలో నేను సైతం అంటూ దుక్కి దున్నుతూ ఓ యువతి తన తండ్రికి చేదోడు వాదోడుగా నిలుస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
నల్గొండ జిల్లా కనగల్ మండలం శిర్ధేపల్లికి చెందిన గంట వెంకన్నకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వ్యవసాయం, కూలీనాలీ చేస్తూ ఉన్నంతలో ముగ్గురు కుమార్తెలను చదివిస్తున్నాడు. రెండో కూతురు మనిషా కనగల్ లోని కేజీబీవీలో ఇంటర్ పూర్తి చేసింది. నల్లగొండలో డిగ్రీ చదివేందుకు దరఖాస్తు చేసి ఇంటి వద్దే ఉంటోంది. ఆడపిల్లలు వంటింటి పనులు చేస్తూ సుకుమారంగా ఉంటారని అనుకుంటారు. కానీ తన భూమిలో పత్తి విత్తనాలు విత్తిన వెంకన్న గుంటుక దున్నేందుకు ప్రయత్నిస్తున్నాడు. పత్తి చేనులో గుంటుక తోలెందుకు రోజుకు వెయ్యి రూపాయలు ఇస్తామన్నా.. కూలీలు దొరకడం లేదు. దాంతో తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని చూడలేక వారం రోజులుగా పత్తి చేనులో తండ్రి వెంకన్నతో కలిసి మనిషా గుంటుక తోలుతోంది. తమ భవిష్యత్తు కోసం నిత్యం కష్టించే తల్లిదండ్రుల కష్టాల్లో పాలు పంచుకుంటూ నాన్నకు అండగా ఉంటున్నానని మనిషా చెబుతోంది. తండ్రి వ్యవసాయ పనుల్లో చేదోడు వాదోడుగా ఉంటున్న మనీషాను గ్రామస్తులు అభినందిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..